పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
HYDRAA Operation in Puppalaguda Targets Illegal Constructions
హైదరాబాద్ శివార్లలోని ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో దాదాపు రూ. 30,000 కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల బారి నుంచి కాపాడింది. స్వాధీనం చేసుకున్న ఈ భారీ ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది తక్షణమే రక్షణ ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేశారు.
పుప్పాలగూడలోని ఈ ప్రభుత్వ భూముల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన చారిత్రక రాతి గుట్టలు (రాక్ ఫార్మేషన్స్) ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విలువైన భూములను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA)కు కేటాయించింది. అయితే, ఇక్కడున్న చారిత్రక రాతి గుట్టలను, ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతూ ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు దశాబ్దాలుగా చట్టపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, రాతి గుట్టలతో పాటు అక్కడి ప్రభుత్వ భూమిని సంరక్షించాలని, తక్షణమే హద్దులు గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని హైకోర్టు మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అయినప్పటికీ, అధికారుల జాప్యం కారణంగా హద్దుల గుర్తింపు, ఫెన్సింగ్ పనులు సాగకపోవడంతో ఈ భూములు క్రమంగా కబ్జాకు గురవుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో, ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు ఇటీవల హైడ్రా నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భూమికి సంబంధించిన పూర్తి వివరాలను, కోర్టు ఆదేశాలను పరిశీలించారు. అనంతరం రంగంలోకి దిగిన హైడ్రా బలగాలు, శుక్రవారం నాడు రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కలిసి ఉమ్మడిగా ఆపరేషన్ నిర్వహించి, కబ్జాలను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ పూర్తి చేశాయి. హైడ్రా తీసుకున్న ఈ తక్షణ చర్యపై పర్యావరణ ప్రేమికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.