అవును.. తెలంగాణ మా జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కుమార్తె వెన్నెల కౌంటర్..
‘Yes, Telangana Is Our Jagir’: Gaddar’s Daughter Hits Back at Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మాట్లాడిన మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, అలాగే తన తండ్రి వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు.
తాను ఒక తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని పేర్కొంటూ, పవన్ కళ్యాణ్‌ను ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు గౌరవిస్తారని, కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మాట్లాడిన మాటలు సరైనవి కావని వెన్నెల స్పష్టం చేశారు. తెలంగాణ మీ జాగీరా అని పవన్ ప్రశ్నించిన తీరుపై ఆమె ఘాటుగా బదులిచ్చారు. అవును, తెలంగాణ గడ్డ నిన్న తమ అయ్యల జాగీరని, ఈరోజు తమ జాగీరని, రేపు తమ బిడ్డల జాగీరని, ఇది ముమ్మాటికీ తమ జాగీరేనని ఆమె గట్టిగా సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరో పైసలు పంచితేనో, లేదా లాబీలు చేస్తేనో రాలేదని, అది కేవలం ప్రజల పోరాటాల వల్ల మాత్రమే సాధ్యమైందని వెన్నెల గుర్తుచేశారు. ఇతరులను బాధపెట్టకుండా, ఎవరినీ హింసించకుండా, ఈ నేల కోసం తమకు తాముగా ప్రాణాలు అర్పించుకుని తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. ఇందుకు శ్రీకాంతచారి బలిదానమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంటూ, పల్లెపల్లెలో ఎంతోమంది త్యాగాలు, పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించడం వల్లే ఈ రాష్ట్రం ఏర్పడిందని ఆమె వివరించారు.
అంతకుముందు, జూన్ 2న హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో జనసేన పార్టీని విస్తరిస్తామని, రాబోయే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని, తెలంగాణ ఎవరి జాగీరు కాదని వ్యాఖ్యానించారు. అలాగే దివంగత గద్దర్‌కు తాను గతంలో వాహనం కొనిచ్చి సహాయం చేశానని గుర్తుచేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.