తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి.. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు..
Andhra Pradesh CM Chandrababu Naidu Extends Wishes on Telangana Formation Day
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. పరిపాలన, భౌగోళిక పరంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం, ఉమ్మడి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన ఈ పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ఒకదానితో ఒకటి ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఎంతో ఘనమైన చరిత్ర, విశిష్ట సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్నో అద్భుత విజయాలను సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలు భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని తన సందేశంలో ఆకాంక్షించారు.
రెండు రాష్ట్రాల్లోని ప్రతి తెలుగు కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, అభివృద్ధి ఫలాలను అందుకంటూ అత్యున్నత జీవన ప్రమాణాలను సాధించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత భారత్ 2047’ సంకల్ప లక్ష్య సాధన కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో ఇరు రాష్ట్రాలు కీలక భూమిక పోషిస్తూ, తెలుగు వారి ఖ్యాతిని, ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటిచెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.