Skip to content
తెలంగాణ › వార్తలు

Kukatpally Housing Board Case: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఇళ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 101 మందికి నవంబర్ 23లోగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని డెడ్‌లైన్..

jagan 07 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Kukatpally Housing Board Case: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఇళ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 101 మందికి నవంబర్ 23లోగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని డెడ్‌లైన్..

Jantar Mantar Violence: జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్.. బాధితులకు అవకాశం..

Kukatpally Housing Board Case: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15లో ఇళ్ల కేటాయింపుల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కొనుగోలుదారులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత 17 ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పదంగా మారిన 101 ఫ్లాట్లను ఈ నెల 23వ తేదీలోగా కొనుగోలుదారుల పేరిట తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును (Telangana Housing Board) ఆదేశించింది. సుప్రీంకోర్టు జస్టిస్ కేవీ విశ్వనాథన్ , జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

వాయిదాల చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయాలా వద్దా అనే అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉంది. దీనిపై హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, వడ్డీ వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ కారణంగా కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టరాదని, తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. హైకోర్టులో కేసు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ ఇళ్లను ఇతరులకు విక్రయించడం లేదా ఇతరత్రాలు బదిలీ చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని అటు హౌసింగ్ బోర్డుకు, ఇటు కొనుగోలుదారులకు న్యాయస్థానం కఠిన ఆంక్షలు విధించింది.

2009 నాటి ‘సంపూర్ణం’ పథకం వివాదం – నేపధ్యం

ప్రారంభం: 2009 సంవత్సరంలో హౌసింగ్ బోర్డు ‘సంపూర్ణం’ (Sampoornam) పథకం కింద కేపీహెచ్‌బీలో ఇళ్లను కేటాయించింది. తొలుత ఫ్లాట్ ధరను రూ. 30.80 లక్షలుగా నిర్ణయించి, ఆ తర్వాత ఏకపక్షంగా దానిని రూ. 47.85 లక్షలకు పెంచడంతో అసలు వివాదం ప్రారంభమైంది.

న్యాయపోరాటం: నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరగడం, అదనపు ధరలు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరం నుంచి నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) వరకు సుదీర్ఘ న్యాయపోరాటం సాగించారు.

ఎన్‌సీడీఆర్‌సీ తీర్పు: ఇళ్ల నిర్మాణంలో హౌసింగ్ బోర్డు వైపు నుంచే తీవ్రమైన ఆలస్యం జరిగిందని నిర్ధారించిన ఎన్‌సీడీఆర్‌సీ.. కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయడం చట్టవిరుద్ధమని గతంలో స్పష్టమైన తీర్పునిచ్చింది.

హౌసింగ్ బోర్డు వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఎన్‌సీడీఆర్‌సీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హౌసింగ్ బోర్డు మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. బోర్డు తరఫు న్యాయవాదులు వాదిస్తూ, తమ వైపు జరిగిన ఆలస్యానికి తాము 6 శాతం వడ్డీ చెల్లించడానికి సిద్ధమని, కానీ కొనుగోలుదారుల నుంచి మాత్రం 14 శాతం వడ్డీ వసూలు చేయడానికి అనుమతించాలని కోరారు. అయితే, హౌసింగ్ బోర్డు వాదనలను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. బాధితులు గత 17 ఏళ్లుగా పడుతున్న మానసిక వేదన, నిరీక్షణను పరిగణనలోకి తీసుకుని తక్షణమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని స్పష్టం చేయడం ద్వారా గృహ కొనుగోలుదారులకు గొప్ప ఊరటనిచ్చింది.