AI Saksham: ప్రభుత్వ సేవలు మరింత వేగంగా.. తెలంగాణలో ఏఐ సాక్షమ్ ప్రారంభం..
bhatti-vikramarka
AI Saksham: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు మరింత వేగవంతంగా, సులభంగా , పారదర్శకంగా అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, సామర్థ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘ఏఐ సాక్షమ్’ (AI Saksham) శిక్షణ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో ఘనంగా శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCR HRD) వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ప్రభుత్వ పరిపాలనలో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక, సానుకూల మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగాన్ని గణనీయంగా పెంచి, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను , సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, వృద్ధులు , పింఛనుదారులు చిన్న చిన్న పనుల కోసం కూడా పదేపదే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితికి శాశ్వతంగా చరమగీతం పాడాలన్నారు. ప్రభుత్వ నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సరిగ్గా చేరుతున్నాయా లేదా అనే అంశాల విశ్లేషణతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంచనా వేయడం వంటి కీలకమైన పరిపాలనా వ్యవహారాల్లో కృత్రిమ మేధ (AI) ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.
పరిపాలనలో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. ఏఐ వ్యవస్థలు విశ్లేషించి అందించే సమాచారాన్ని అధికారులు స్వయంగా కచ్చితంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని, ఏఐ తీసుకునే నిర్ణయాల వెనుక మానవ పర్యవేక్షణ (Human Oversight) తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మొదట చిన్నస్థాయి ప్రయోగాత్మక ప్రాజెక్టులు (Pilot Projects) చేపట్టి, అవి విజయవంతమైన తర్వాత మాత్రమే ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో విస్తరించాలని, లోపాలు జరిగితే బాధ్యత వహించే విధంగా పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు అందే వేగవంతమైన, నాణ్యమైన సేవలే ఏఐ వినియోగ విజయానికి అసలైన ప్రామాణికమని ఆయన పునరుద్ఘాటించారు.