తెలంగాణ భవిష్యత్‌పై సీఎం రేవంత్ రెడ్డి విజన్.. ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రసంగం..
CM Revanth Reddy's Telangana Formation Day Speech Highlights Vision for Future Growth
రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. రాచరికాన్ని, పెత్తందారీ పోకడలను తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే తమ పాలన సాగుతోందని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీలకు ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో, అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే రాష్ట్ర హితం కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. గత 30 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ ప్రజా ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని సీఎం సగర్వంగా ప్రకటించారు. ‘తెలంగాణ విజన్-2047’ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రంలోని రైతులను కేవలం అన్నదాతలుగానే కాకుండా వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని వివరించారు.
యువతకు ఉపాధి కల్పనపై మాట్లాడిన ముఖ్యమంత్రి… ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అత్యంత పారదర్శక పద్ధతిలో ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖల్లో మరిన్ని ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ఇప్పటికే 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందించడంతో పాటు, జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.
పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యతని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. అద్దె ఇళ్ల బాధల నుండి పేదలకు విముక్తి కల్పించేందుకు గడిచిన 13 నెలల కాలంలో రూ.22,000 కోట్ల వ్యయంతో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఇందులో భాగంగా క్యూఆర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. అలాగే, పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘విశిష్టసేవా పురస్కారాలను’ ప్రదానం చేశారు.