Skip to content
జాతీయం వార్తలు

Tamil Nadu Politics: విజయ్‌కి బిగ్ షాకిచ్చిన ప్రతిపక్షాలు.. టీవీకే ప్రభుత్వంపై మూకుమ్మడిగా గవర్నర్‌కు ఫిర్యాదు..

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Tamil Nadu Politics: విజయ్‌కి బిగ్ షాకిచ్చిన ప్రతిపక్షాలు.. టీవీకే ప్రభుత్వంపై మూకుమ్మడిగా గవర్నర్‌కు ఫిర్యాదు..

విజయ్‌కి బిగ్ షాకిచ్చిన ప్రతిపక్షాలు

Tamil Nadu Politics: విజయ్ సీఎం అయిన కొద్ది రోజులకే తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తిరుగుబావుటా ఎగురవేశాయి. ఎమ్మెల్యేల బేరసారాలు, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం, క్యాబినెట్ సమావేశాల్లో అనధికార వ్యక్తుల ప్రమేయం వంటి తీవ్రమైన అంశాలపై జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు శనివారం విడివిడిగా రాజ్ భవన్‌కు తరలివెళ్లారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదుల వర్షం కురిపించాయి.

డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టులు చేయడం, పార్టీ మారాలంటూ వారిపై ఒత్తిడి తేవడం వంటి చర్యలకు అధికార పక్షం పాల్పడుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వంతో ఎలాంటి అధికారిక సంబంధం లేని జాన్, విష్ణు‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మంత్రుల కంటే ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆర్‌ఎస్ భారతి మండిపడ్డారు. వారు ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపేనని, డబ్బు ఆశ చూపి లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసేలా సీఎం విజయ్ స్వయంగా ఒప్పించే ప్రయత్నం చేశారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డీఎంకే కోరింది. రాబోయే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో చేసిన బహిరంగ ప్రకటనలను ఈ సందర్భంగా డీఎంకే ప్రస్తావించింది.

మరోవైపు అన్నాడీఎంకే కూడా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ.. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక ఉన్న అదృశ్య హస్తంపైనా, క్యాబినెట్ భేటీల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 167ను ఉపయోగించి ప్రభుత్వం నుంచి తక్షణ వివరణ కోరాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేసింది. బీజేపీ సైతం గవర్నర్‌ను కలిసి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి క్యాబినెట్ సమావేశానికి హాజరైన జాన్ ఆరోగ్యసామి, విష్ణురెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు ఒక బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్‌పై తక్షణమే విచారణ జరపాలని కోరింది.

ఈ పరిస్థితుల మధ్య ప్రతిపక్షాల ఆరోపణలను అధికార టీవీకే పార్టీ తీవ్రంగా ఖండించింది. వివాదంలో ఉన్న జాన్ ఆరోగ్యసామి, విష్ణురెడ్డిలను ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారులుగా నియమించామని.. కాబట్టి వారిని ప్రైవేట్ వ్యక్తులుగా పరిగణించలేమని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ మొత్తం పొలిటికల్ వ్యవహారంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడేందుకు తక్షణ రాజ్యాంగపరమైన జోక్యం, స్వతంత్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీఎంకే తన వినతిపత్రంలో కోరినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మరికొన్ని రోజులు ఉత్కంఠభరితంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.