Sonam Wangchuk Protest: సోనమ్ వాంగ్‌చుక్ సీజేపీ ఉద్యమానికి భారీ మద్దతు.. వేలాది మందితో పార్లమెంట్ మార్చ్.. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న సీజేపీ..
Delhi Protest LIVE: ఢిల్లీలో సీజేపీ ఛలో పార్లమెంట్ ఉద్రిక్తం.. CJP నిరసనకారులపై లాఠీఛార్జ్..టియర్ గ్యాస్ ప్రయోగం...
Sonam Wangchuk Protest: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజైన సోమవారం నాడు.. నీట్ యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బొద్దింక జనతా పార్టీ- సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ నిరసన యాత్ర ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ నిరసనల నేపథ్యంలో భద్రతా చర్యలు ఒకవైపు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ వైద్య చికిత్స వివాదం మరోవైపు న్యాయస్థానానికి చేరాయి.
శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించన సోనమ్ వాంగ్‌చుక్.. అక్కడ కూడా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన తన భార్య గీతాంజలి జె ఆంగ్మో ద్వారా ఒక సందేశాన్ని పంపుతూ.. భారతదేశపు రెండవ స్వాతంత్ర్య ఉద్యమం, పార్లమెంటుకు యాత్ర.. దయచేసి దీనిని విజయవంతం చేయండని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు.
అయితే ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌కు జరుగుతున్న వైద్య చికిత్సలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఆదివారం ఏకసభ్య న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి సోమవారం ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఎటువంటి అరెస్టులు చూపించకుండానే వాంగ్‌చుక్‌ను చట్టవిరుద్ధంగా ఆసుపత్రికే పరిమితం చేశారని ఆమె తన అప్పీల్‌లో పేర్కొన్నారు. అలాగే రోగి యొక్క సమాచారంతో కూడిన సమ్మతి (Informed Consent), వైద్య చికిత్సను అంగీకరించే లేదా తిరస్కరించే స్వేచ్ఛను ఈ ఉత్తర్వు కాలరాస్తోందని.. కార్యకర్తకు గానీ, భార్యగా తనకు గానీ వైద్య నిర్ణయాల్లో తుది అధికారం లేకుండా చేస్తోందని ఆమె కోర్టులో వాదించారు.
సీజేపీ ప్రకటించిన పార్లమెంట్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే న్యూఢిల్లీ జిల్లా పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో సెక్షన్ 144 సీఆర్పీసీ) కింద కఠిన నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సోమవారం కీలకమైన ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేస్తున్నట్లు DMRC తన X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగంలో సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చేందుకు సీజేపీ పట్టుబడుతుండటంతో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.