Skip to content
జాతీయం వార్తలు

Parliament Live: ప్రభుత్వం బలప్రయోగంతో గొంతుకలు నొక్కేస్తోంది..నీట్ నిరసన అంశంపై కేంద్రం మీద మండిపడిన మల్లికార్జున ఖర్గే..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Parliament Live: ప్రభుత్వం బలప్రయోగంతో గొంతుకలు నొక్కేస్తోంది..నీట్ నిరసన అంశంపై కేంద్రం మీద మండిపడిన మల్లికార్జున ఖర్గే..

Parliament Live: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం ఉభయ సభలను కుదిపేస్తోంది. లోక్‌సభ తరహాలోనే రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ఈ అంశంపై భారీ ఆందోళనకు దిగడంతో సభ సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్షల కుంభకోణం, విద్యార్థుల ఆందోళనల అంశాన్ని గట్టిగా లేవనెత్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ.. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. ఈ సమస్యపై నా అభిప్రాయాలను వినిపించడానికి నాకు అవకాశం ఇవ్వాలి.

అక్కడ వేలాది మంది పిల్లలు గుమిగూడి నిరసన తెలుపుతుంటే.. ప్రభుత్వం బలప్రయోగం చేస్తూ, వారి గొంతులను అణచివేసి తరిమివేయాలని చూస్తోందని ఖర్గే సభలో మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల అనంతరం సభలో ప్రతిపక్షాల నినాదాలు మిన్నంటడంతో రాజ్యసభ స్పీకర్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలోనూ నీట్ వివాదంతో పాటు అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడ కూడా సభ కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, బలప్రయోగం చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద పోలీసులు హింసకు దిగారని.. అరెస్టులు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, నిరసనను చట్టబద్ధంగా, వృత్తిపరంగా హ్యాండిల్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఎలాంటి వదంతులు, అపోహలను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

నిరసనకారులు పరిమితులను దాటి పార్లమెంట్ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో శాంతిభద్రతల పరిరక్షణకై సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఇంటర్నెట్ ఆంక్షలతో పాటు న్యూఢిల్లీ జిల్లా పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ కింద నిషేధాజ్ఞలు విధించారు. అలాగే ఐదు కీలక మెట్రో స్టేషన్లను (రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ) కూడా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది.