Modi Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు.. నిర్మల, హర్దీప్ పురీలు ఔట్ ? రేసులో శక్తికాంత దాస్, అనురాగ్ ఠాకూర్..
Modi Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు.. నిర్మల, హర్దీప్ పురీలకు ఔట్.. రేసులో శక్తికాంత దాస్, అనురాగ్ ఠాకూర్..
Modi Cabinet Reshuffle: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైంది. జూలై 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే.. ఏ క్షణంలోనైనా ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్‌లోకి భారీగా యువరక్తాన్ని ఎక్కించడం.. ఇతర పార్టీల నుండి వచ్చిన కీలక నేతలకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా ఈ కీలక సంస్కరణలు చేపట్టబోతున్నారు.
మంత్రివర్గంలో సగటు వయస్సును తగ్గించి.. యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వయస్సు (46 ఏళ్లు)కు దరిదాపుల్లోకి మంత్రుల సగటు వయస్సును తీసుకురావాలనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని అనివార్య మినహాయింపులు మినహా.. 65 సంవత్సరాలు పైబడిన మంత్రులను తొలగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిబంధన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రం వర్తించదు. అలాగే గత రెండు పునర్వ్యవస్థీకరణల్లోనూ ఒకే శాఖలో కొనసాగుతున్న మంత్రుల పోర్ట్‌ఫోలియోలను ఈసారి ఖచ్చితంగా మార్చనున్నారు.
ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను క్యాబినెట్ నుండి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆమె పనితీరుపై ఎలాంటి అసంతృప్తి లేదని.. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశంలో ఆమెకు ఒక పెద్ద సంస్థాగత బాధ్యత (పార్టీ పదవి) అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక సంస్కరణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఒక కొత్త ముఖాన్ని కోరుకుంటోంది.
మరోవైపు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని కూడా తప్పించడం అనివార్యమని.. ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించే అంశంపై ఊహాగానాలు సాగుతున్నాయని వర్గాలు తెలిపాయి. ఒక వ్యక్తికి ఒకే పదవి విధానంలో భాగంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పంకజ్ చౌదరిని.. అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హర్ష్ మల్హోత్రలను కేంద్ర సహాయ మంత్రి పదవుల నుండి తొలగించనున్నట్లు సమాచారం.
నిర్మలా సీతారామన్ స్థానంలో ప్రస్తుత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్, ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శక్తికాంత దాస్ పేరు కూడా మంత్రి పదవుల రేసులో ముందంజలో ఉంది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుండి తప్పించే అవకాశం లేదు.. కానీ ఒకవేళ ఆయనకు ఒడిశా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే మాత్రం కేంద్ర క్యాబినెట్ నుండి తప్పుకుంటారు.
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి తిరిగి క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. రాబోయే 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుండి వచ్చిన రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్‌ల పేర్లను పరిశీలిస్తున్నారు. శివసేన (ఉద్ధవ్ వర్గం), పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ (TMC) తిరుగుబాటు ఎంపీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఇక దక్షిణాది నుండి విశాఖపట్నం ఎంపీ డి. పురందేశ్వరితో పాటు టీఎంసీ తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.