Bilingual Parenting: రెండు భాషలు నేర్పితే పిల్లలు గందరగోళానికి గురవుతారా? శిశు వైద్యుడు చెప్పిన నిజాలు ఇవిగో..
Bilingual Parenting: రెండు భాషలు నేర్పితే పిల్లలు గందరగోళానికి గురవుతారా? శిశు వైద్యుడు చెప్పిన నిజాలు ఇవిగో..
Bilingual Parenting: చిన్నప్పటి నుంచే రెండు భాషలు మాట్లాడిస్తే పిల్లలు అయోమయానికి గురవుతారా.. వారికి మాటలు రావడం ఆలస్యమవుతుందా.. ఈ సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ భయంతోనే కొందరు ఇంట్లో మాతృభాష మాట్లాడడం పూర్తిగా మానేసి.. కేవలం ఇంగ్లిష్‌కే పరిమితమవుతుంటారు. అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని శిశు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు వినడం వల్ల పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కాదని.. వారి భాషా నైపుణ్యాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వారు చెబుతున్నారు.
ఈ విషయమై జరిగిన పరిశోధనలు కూడా ఇదే నిజాన్ని నిరూపిస్తున్నాయి. 2025లో ‘జర్నల్ ఆఫ్ చైల్డ్ లాంగ్వేజ్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ద్విభాషా (Bilingual) వాతావరణంలో పెరిగే పిల్లల్లో మాటలు రావడం, పదాలను పలకడం లేదా భాషా అభివృద్ధిలో ఎలాంటి ఆలస్యం గమనించబడలేదు. అంతేకాకుండా, 2023లో ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో ప్రచురితమైన ఒక సమీక్ష ప్రకారం.. రెండు భాషలు నేర్చుకునే పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ (Focus), జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు సాధారణ పిల్లల కంటే మరింత మెరుగ్గా ఉంటాయని తేలింది.
కొంతమంది చిన్నారులు మాట్లాడేటప్పుడు గివ్ మీ నీళ్లు లేదా నాకు చాక్లెట్ ఇవ్వు ప్లీజ్ లాంటి రెండు భాషలు కలిసిన వాక్యాలను ఉపయోగిస్తుంటారు. దీనిని చూసి తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని శాస్త్రీయంగా ‘కోడ్-స్విచింగ్’ (Code-switching) అంటారు. ఇది గందరగోళం కాదు.. సదరు చైల్డ్ రెండు భాషలను ఒకేసారి విజయవంతంగా నేర్చుకుంటున్నారనడానికి ఒక బలమైన సంకేతం. పిల్లల మెదడు సహజంగానే రెండు భాషల పదాలను వారి అవసరానికి అనుగుణంగా మార్చి ఉపయోగిస్తుంది.
ద్విభాషా పిల్లలకు ఒక్కో భాషలో విడివిడిగా చూసినప్పుడు పదాలు కొంచెం తక్కువగా తెలిసినట్లు కనిపించవచ్చు. కానీ రెండు భాషల్లో వారికి తెలిసిన మొత్తం పదాలను కలిపి లెక్కిస్తే గనుక.. వారి మొత్తం పద సంపద (Vocabulary) ఒకే భాష మాట్లాడే ఇతర పిల్లలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువే ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అందువల్ల పిల్లల కోసం మాతృభాషను వదిలేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంట్లో సహజంగా మాట్లాడే భాషలోనే పిల్లలతో సంభాషించడం వల్ల వారి మధ్య భావోద్వేగ బంధం బలోపేతం అవ్వడమే కాకుండా.. పిల్లల్లో భాషా వికాసం మరింత మెరుగ్గా ముందుకు సాగుతుంది.