LPG Cylinders Swept Away: భారీ వరదలకు నదిలో కొట్టుకుపోయిన 3 వేల గ్యాస్ సిలిండర్లు.. వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరిక..
LPG Cylinders Swept Away: భారీ వరదలకు నదిలో కొట్టుకుపోయిన 3 వేల గ్యాస్ సిలిండర్లు.. వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరిక..
LPG Cylinders Swept Away: మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబై నగరం ఈ భారీ వర్షాలకు పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడే జనజీవనం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని రాయగడ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆందోళనకరంగా రేపాయి. వరదల ధాటికి హెచ్‌పిసిఎల్ (HPCL) పాతాళగంగ ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్ పూర్తిగా ముంపునకు గురికావడంతో.. అక్కడ నిల్వ ఉంచిన సిలిండర్లు నదిలో కొట్టుకుపోయాయి.
గ్యాస్ నిండినవి, ఖాళీవి కలిపి సుమారు 3 వేల ఎల్‌పిజి సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. పన్వెల్ తాలూకాలోని MIDC చావానేలో ఉన్న ఈ ప్లాంట్ నుండి భారీ వరద ఉధృతికి సిలిండర్లు కొట్టుకుపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నది దిగువ ప్రాంతాల్లో కొట్టుకొచ్చే ఏ సిలిండర్లను కూడా ముట్టుకోవద్దని అధికారులు స్థానిక నివాసితులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ముట్టుకుంటే ప్రమాదం భారీన పడే అవకాశం ఉందని తెలిపారు.
రాయగడ్ జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ఈ విషయమై ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ సొంతంగా తీయవద్దన్నారు. వాటిని ఇళ్లకు తీసుకెళ్లవద్దని ప్రజలను కోరారు. నదిలోకి కొట్టుకొచ్చిన ఆ సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో.. లేదా అవి లీక్ అవుతూ ప్రమాదకర స్థితిలో ఉన్నాయో తెలియదు. ఉచితంగా దొరికిందనే సంతోషంలో వాటిని తీసుకువెళితే మీ ఇల్లు తగలబడే ప్రమాదం ఉంది. వాటిని తాకడం, ఓపెన్ చేయడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. అది ప్రాణాంతకంగా మారవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్థానిక నివాసితులు ఎలాంటి ప్రాణసంకటమైన సాహసాలు చేయవద్దని.. నదిలో లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. వరద నీటిలో కొట్టుకుపోయిన సిలిండర్లను సురక్షితంగా గుర్తించి.. వాటిని తిరిగి వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు.