Skip to content
జాతీయం వార్తలు

బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై? కొత్త పార్టీపై జోరుగా ప్రచారం..పేరు అదేనా..

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై? కొత్త పార్టీపై జోరుగా ప్రచారం..పేరు అదేనా..

Annamalai Submits Resignation, Sparks Speculation About Political Future

తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు మారబోతున్నాయా? గత కొంతకాలంగా బీజేపీ అధిష్ఠానంతో విభేదిస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై త్వరలోనే కమలం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి, సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత ‘ద్రవిడ 2.0’ పేరుతో కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే అన్నామలైకి, బీజేపీ జాతీయ నాయకత్వానికి మధ్య వ్యూహాత్మక విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఒంటరిగా బరిలోకి దించి, క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచాలని అన్నామలై గట్టిగా భావించారు. అయితే, అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా ఏఐఏడీఎంకే (AIADMK)తో మళ్లీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు ప్రక్రియలో భాగంగా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలైని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. పార్టీ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం.

పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం, భవిష్యత్తుపై అస్పష్టత నెలకొనడంతో అన్నామలై నిన్న (సోమవారం) అత్యవసరంగా ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమై తన నిర్ణయాన్ని సామరస్యపూర్వకంగా వివరించినట్లు తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించగా, “దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం” అని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాకుండా, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి కమలం జెండా లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

జూన్ 4న అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నై, కోయంబత్తూరు పరిసరాల్లో ఆయన మద్దతుదారులు ఇప్పటికే “మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు” అంటూ భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అన్నామలై ప్రస్తుతం నడిపిస్తోన్న “వి ది లీడర్స్” అనే స్వచ్ఛంద సంస్థ (NGO) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక బలమైన వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. జూన్ 15 లోపు ఆయన తన భవిష్యత్తు కార్యాచరణపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

తొలుత ప్రజల్లోకి ఒక సామాజిక ఉద్యమంగా వెళ్లి, ఆ తర్వాత దానిని ‘ద్రవిడ 2.0’ అనే లౌకిక ప్రాంతీయ పార్టీగా మార్చాలనేది అన్నామలై వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, ఆయన రాజీనామా వార్తలపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అన్నామలై బయటకు వస్తే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా పెద్ద మలుపు కానుంది.