పేర్ల తొలగింపునకే… ‘సర్’ ప్రక్రియపై మాజీ సిఇసి ఎస్‌వై ఖురేషీ తీవ్ర అసహనం
పేర్ల తొలగింపునకే… 'సర్' ప్రక్రియపై మాజీ సిఇసి ఎస్‌వై ఖురేషీ తీవ్ర అసహనం
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగి ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లిందని విమర్శ
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై మాజీ సిఇసి ఎస్వీ ఖురేషీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ప్రధానంగా ఓటర్ జాబితాలో పేర్ల తొలగింపు పైనే దృష్టి సారిస్తోందని ఆరోపించారు. సర్ వల్ల స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగి ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లిందని విమర్శించారు. వీలైనన్ని ఎక్కువ పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో తొలగింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఓటరుగా నమోదు చేసుకోవడమనేది ఒక రాజ్యాంగపరమైన హక్కు అని, కానీ ఎన్నికల సంఘం ప్రజలకు ఏదో ఉపకారం చేస్తోందన్నట్లుగా పరిస్థితిని సృష్టిస్తోందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖురేషీ వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఈ ప్రత్యేక ప్రక్రియ (సర్) జరుగుతున్న తీరు అన్యాయంగా ఉందని మాజీ సిఇసి ఖురేషీ అన్నారు.
‘ఎస్ఐఆర్ ప్రధానంగా ఓటర్ల పేర్ల తొలగింపుపైనే దృష్టి పెడుతోంది. ఓటర్ జాబితా నుంచి ఎంత మంది పేర్లను తొలగించగలమన్నదే వారి ప్రధాన ధ్యాసగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి నాదొక సూచన. ఓటరు పేరు స్పెల్లింగ్, వయసు, అడ్రస్‌లో చిన్నపాటి తప్పులు ఉన్నప్పటికీ వారు సరైన వ్యక్తేనని మీకు తెలిస్తే ఆ తప్పులను పట్టించుకోవద్దు. తద్వారా ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. ఓటర్ జాబితా నుంచి వీలైనన్ని ఎక్కువ పేర్లను తొలగిస్తే మంచి మార్కులు వస్తాయన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడంతో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగింది.’ అని ఖురేషీ పేర్కొన్నారు.
‘నేను సిఇసిగా ఉన్నప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా స్పష్టంగా ఉండేది. ప్రతి ఏటా ఓటరు జాబితాను సవరించే ప్రక్రియను చేపట్టేవాళ్లం. 2002-2003లో బిహార్‌లో చివరిసారిగా ఎస్ఐఆర్ చేపట్టిన తర్వాత, ఓటర్ల జాబితాలు కంప్యూటరైజ్డ్ అయ్యాయి. దీంతో ఇకపై ఓటర్ జాబితా సమగ్ర సవరణ అవసరం లేదని నిర్ణయించారు.
ఇప్పుడు ఓటర్ జాబితాలో 99 శాతం మంది పేర్లు ఇప్పటికే నమోదై ఉన్నప్పుడు, మళ్లీ ఇంటింటికి వెళ్లి అక్కడ ఎవరు నివసిస్తున్నారో మొదటి నుంచి ఆరా తీయడమనేది తెలివి తక్కువ పనవుతుంది. అక్రమ వలసదారులను గుర్తించే పేరుతో బిహార్ గతేడాది ఎస్ఐఆర్ చేపట్టారు. దీనివల్ల దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ చివరికి ఎంత మంది విదేశీయులు దొరికారు? ఈ రోజు వరకు బిహార్‌లో ఓట్లు కలిగి ఉన్న అక్రమ వలసదారులు ఎంత మందో ఇసి వెల్లడించలేదు.
ఇదేమైనా పిల్లలాటనా? లేక వారి ఇష్టాయిష్టాలా? 500 మంది విదేశీయులను బిహార్‌లో ఎస్ఐఆర్ చేపట్టి గుర్తించారని మీడియా ద్వారా మాకు తెలిసింది. వారిలో 150 మంది బంగ్లాదేశీయులు కాగా, 350 మంది బిహార్ వ్యక్తులను పెళ్లాడిన నేపాలీ హిందూ మహిళలు. కేవలం 150 మంది బంగ్లాదేశీయులను గుర్తించడానికి మీరు ఎనిమిది కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ పేరిట లక్షలాది మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. దీని వల్ల ఈసీ సాధించిన ప్రయోజనం ఏంటి? ఇది సమంజసమేనా? అసలు కాదు’ అని ఖురేషీ అన్నారు.
ఎస్ఐఆర్పై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధుల చేసిన విమర్శలపై స్పందించారు ఎస్‌వై ఖురేషీ. దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో విదేశీయులు మనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
‘ఒక విదేశీ బృందం దేశంలో ఎన్నికల నిర్వహణపై లేఖ రాసే పరిస్థితికి మనం చేరుకోవడం చాలా బాధాకరం. ఇలా జరిగి ఉండకూడదు. కానీ అదే సమయంలో దీనిని కేవలం మన దేశ అంతర్గత వ్యవహారమని కొట్టిపారేయకూడదు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది అంతర్జాతీయ వార్తగా మారినందున భారత్ మౌనంగా ఉంటే అనుమానాలు బలపడే అవకాశం ఉంది’ అని ఖురేషీ స్పష్టం చేశారు.
యుపిఎ సర్కార్ నన్ను ఒత్తిడి పెట్టలేదు :
తన సిఇసి పదవి కాలంలో యుపిఎ–2 ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని ఖురేషీ తెలిపారు. అప్పట్లో ఇసికి ఉన్న ప్రతిష్ట దృష్ట్యా అటువంటి పని చేయడానికి (ఒత్తిడి తెచ్చేందుకు) ఎవరూ సాహసించేవారు కాదని స్పష్టం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వానికి ఎప్పుడూ అందరికంటే ఆఖరిగా తెలిసేదని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను విలేకరుల సమావేశంలో ప్రకటించేవాళ్లమని, అప్పుడే ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలిసేదన్నారు.