Skip to content
జాతీయం వార్తలు

దేశవ్యాప్త రాజకీయ ప్రచారానికి సిపిఐ సన్నద్ధం

Prajapaksham 16 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
దేశవ్యాప్త రాజకీయ ప్రచారానికి సిపిఐ సన్నద్ధం

ఎందుకు మార్పు తప్పనిసరి ?

భారతదేశం నేడు నిర్ణయాత్మక క్షణంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ దశాబ్దకాల అధికారం ఆందోళనకు, ఆశాభంగానికి, కష్టనష్టాలు పెరుగుదలకు నిలకడగా బాటవేసింది. బిజెపి ఎన్నిక తర్వాత ఎన్నికకు అభివృద్ధి, ఉపాధి, సౌభాగ్యం, మంచి పరిపాలన, మెరుగైన భవిష్యత్‌ వాగ్దానం చేసింది. దేశం తద్భిన్నంగా, పెరుగుతున్న నిరుద్యోగం, దుర్భరమైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అసమానత, బలహీనపడుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న ప్రజాస్వామ్య వాతావరణం, పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్నది.

ఈ ప్రశ్నలు మోదీ ప్రభుత్వంనుంచి సమాధానాలు డిమాండ్‌ చేసినపుడల్లా, వారు జాతీయ సంభాషణను వేరే అంశాలపైకి మళ్లిస్తున్నారు. సామాన్య ప్రజల రోజువారీ ఆందోళనలను పరిష్కరించే బదులు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పదేపదే మతమార్గాల్లో ప్రజలను విభజించటం, భావోద్వేగ విజ్ఞప్తులు చేయటం, ఉద్దేశపూర్వకంగా సృష్టించే వివాదాలవైపు మరలుతున్నారు. జవాబుదారీతనాన్ని తప్పించుకునేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. వైఫల్యాన్ని మరుగుపరిచేందుకు ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారు. విభజన ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చుతుంది కాబట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం దశాబ్దకాలంపైగా, అపూర్వమైన అభివృద్ధి సాధించామన్న చిత్రాన్ని ప్రజలముందుంచుతున్నది. అయితే కోట్లాది ప్రజల జీవితానుభవం భిన్నమైన కథ చెబుతున్నది. యువకులు పోటీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి శ్రమిస్తున్నారు. కాని జరుగుతున్నదేమిటి? రిక్రూట్‌మెంట్‌ జాప్యం, పదేపదే ప్రశ్నాపత్రాలు లీకులతో పరీక్షల రద్దు, అవినీతి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు నింపడం లేదు. భద్రమైన ఉద్యోగం స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగాలు వచ్చాయి.

విద్యాధిక యువత డిగ్రీలు చేతబట్టుకుని ఒక పోటీ పరీక్షనుంచి మరో పరీక్షకు పరుగులు పెడుతున్నారు. అయితే వారి ఆకాంక్షలకు తగిన అవకాశాలు కనిపించటం లేదు. విద్య తమ పిల్లల భవిష్యత్‌కు భద్రత చేకూర్చుతుందని తల్లిదండ్రులు తమ పొదుపు సొమ్ము అంతా వెచ్చిస్తున్నారు. అందుకు బదులుగా అసంఖ్యాకంగా యువ భారతీయులు నిరాశానిస్పృహల్లోకి, నిరుద్యోగంలోకి, రేపటి గూర్చిన అగమ్యంలోకి నెట్టబడుతున్నారు. బిజెపి ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల్లో ఒకటి నిరుద్యోగం అనే వాస్తవాన్ని ఎంతపెద్దగా ప్రచారం చేసుకున్నా దాచలేరు.

నిరుద్యోగంతోపాటు ద్రవ్యోల్బణం కృంగదీస్తున్న భారమవుతున్నది. తమ ఆదాయాలు పెరుగుతున్న ధరల వేగాన్ని అందుకోలేకపోతున్నాయని మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారీ ప్రజలకు గుర్తుచేస్తున్నది. ఆహారం, వంటగ్యాస్‌, రవాణా, విద్యుచ్ఛక్తి, ఆరోగ్య సంరక్షణ, విద్యపై ఖర్చు నిలకడగా పెరుగుతున్నది. వేతన ఉద్యోగులు తమ ఆదాయాలు అవసరాలకు సరిపోవటంలేదని బాధపడుతున్నారు. వేతన కార్మికులేమో కనీస అవసరాలు తీర్చుకోవటానికి సైతం అవస్థపడుతున్నారు. చిన్నపాటి వర్తకులు ప్రజల కొనుగోలు శక్తి క్షీణింపు పర్యవసానం చవిచూస్తున్నారు.

కుటుంబాలు కేవలం మనుగడకోసం వైద్య చికిత్స వాయిదా వేసుకుంటున్నాయి, అత్యవసర వ్యయం తగ్గించుకుంటున్నాయి, అప్పులు చేస్తున్నాయి. సామాన్య ప్రజలేమో పెరుగుతున్న ఆర్థిక అస్థిరతను అనుభవిస్తుండగా, మోదీ ప్రభుత్వమేమో ఆర్థిక విజయాల పతాక శీర్షికలతో వేడుక కొనసాగిస్తున్నది.

గ్రామీణ భారతంలో సంక్షోభం మరీ తీవ్రంగా ఉంది. కోట్లాదిమంది వ్యవసాయమే జీవనోపాధిగా కొనసాగుతున్నప్పటికీ, రైతులేమో పెరుగుతున్న పెట్టుబడుల ఖర్చులు, ఆదాయంలో అస్థిరత, పెచ్చుపెరుగుతున్న అప్పులతో సతమతమవుతున్నారు. రైతులు దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలం పోరాటం చేసినప్పటికీ, కనీస మద్దతు ధరకు లీగల్‌ గ్యారంటీ కోసం చేస్తున్న డిమాండ్‌ అపరిష్కృతంగానే ఉంది.

రైతుల చరిత్రాత్మక ఉద్యమం తర్వాత బిజెపి ప్రభుత్వం వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. అయినా అందులోని ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి లీగల్‌ గ్యారంటీ నెరవేరలేదు. రైతులకు తమ ఉత్పత్తుల కొనుగోలుకు హామీ, అందుబాటులో పరపతి, ఇరిగేషన్‌, గిట్టుబాటు ధరలు అవసరం. వారికి ప్రసంగాలు, ప్రజాసంబంధాల ప్రచారాలు అవసరం లేదు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేయటం కూడా అంతే బాధాకరం. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, ఆదాయ భద్రత కలిగించేందుకు నరేగా చట్టం చేయబడింది. కష్టకాలంలో కోట్లాదిమంది పేదలకు అది జీవనమార్గం అయింది. ఈ ప్రభావవంతమైన కార్యక్రమాన్ని విస్తరించేబదులు, నరేంద్రమోదీ ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ కేటాయించకుండా, వేతనం చెల్లింపు ఆలస్యం చేస్తూ, పరిపాలనా సంబంధమైన ఆంక్షలు విధిస్తూ క్రమంగా బలహీనమొనర్చింది.

ఉపాధికి గ్యారంటీ ఇవ్వటం దాతృత్వం కాదు, అది చట్టబద్ధ హక్కు. గ్రామీణ భారత్‌కు మరింత శక్తివంతమైన ఉపాధి గ్యారంటీలు అవసరం.

ప్రభుత్వ విద్య సమాన అవకాశాలు తెస్తుందని ఒకప్పుడు భావించబడింది. ఇప్పుడు అది కూడా ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వ సంస్థలకు ఇతోధిక పెట్టుబడి అవసరం కాగా, ప్రభుత్వ సంస్థలను ఎండగట్టి ప్రైవేటు విద్యావ్యాపారం విస్తరిస్తున్నారు. అదే అలక్ష్యం ఆరోగ్య సంరక్షణలో కూడా కనిపిస్తుంది. నాణ్యమైన ప్రభుత్వ వైద్యం తగినంతగా లేనందున ప్రజలు తమ సొంత జేబుల నుంచి చాలా పెద్ద మొత్తాలు ఖర్చు చేస్తున్నారు. ఇవి బిజెపి ప్రభుత్వం ఎంచుకున్న విధానాలు. సామాన్య ప్రజలు వాటి పర్యవసానాలు అనుభవిస్తున్నారు.

నిజమైన సంపద సృష్టికర్తలు కార్మికులు. దేశ ఆర్థికాభివృద్ధికి వారు నిత్యం పాటుపడుతున్నారు. అయితే అభద్రత ఎదుర్కొంటూనే ఉన్నారు. స్థిరమైన ఉద్యోగాలు తగ్గిపోతూ, తగినంత సామాజిక భద్రతలేని కాంట్రాక్టీకరణ, పొరుగు సేవలు, అనియత పనులు పెరుగుతున్నాయి. కార్మిక రక్షణలను క్రమంగా తగ్గిస్తూ కార్పొరేట్‌ ప్రయోజనాలకు విపరీతమైన ప్రోత్సాహం ఇస్తున్నారు.

మహిళలు వివక్షత ఎదుర్కోవటం కొనసాగుతున్నది. సాధికారిత నిత్యం వల్లించటం మినహా సమాన అవకాశాలు కల్పించటంలేదు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన రాజ్యాంగ సవరణను ఇక ఎంతమాత్రం జాప్యం చేయకుండా అమలు జరపాలి. దళితులు, ఆదివాసీలు వివక్ష, అత్యాచారాలు, నివాస ప్రదేశాల నుంచి తొలగింపు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి అంటే ఉన్నది ఊడగొట్టటం కాదు. గాఢమవుతున్న అసమానతతో ప్రజాస్వామ్యం సహజీవనం చేయజాలదు.

దేశంలోని ప్రజాస్వామిక సంస్థలు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరపటం కాదు. దానికి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు, స్వేచ్ఛాయుతమైన పత్రికారంగం, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ (ఫెడరలిజం) పట్ల గౌరవం, అసమ్మతి వ్యక్తీకరణకు రాజ్యాంగ హక్కు అవసరం.

మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిని ప్రజాస్వామిక హక్కులు ఉపయోగించుకుంటున్న పౌరులుగా కాకుండా శత్రువులుగా చూడటం పెరుగుతున్నది. ఆత్మవిశ్వాసంగల ప్రభుత్వం ప్రశ్నలు ఆహ్వానిస్తుంది. అభద్రతతో ఉన్న ప్రభుత్వం వాటికి భయపడుతుంది.

భారతదేశ ఎన్నికల క్రమంలో విశ్వాసం పునరుద్ధరించటం ఎంతో అవసరం. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పునాది. అవి నిష్పక్షపాతంగా నిర్వహించబడటమేగాక, అలా కనిపించాలి కూడా. బిహార్‌, పశ్చిమబెంగాల్‌లో ఓటరు జాబితాల ప్రక్షాళన (ఎస్‌ఐఆర్‌)లో ఏకపక్షంగా తొలగింపుల వల్ల ఎందరో అర్హులు ఓటుహక్కు కోల్పోయారన్న ఆందోళనలు వ్యక్తమయినాయి.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో తారుమారులతో ఎన్నికల వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లుతున్నది. ముఖ్య ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్‌ల ఎంపికలో ప్రభుత్వ జోక్యం పెరగటం వల్ల అవి విమర్శలపాలవుతున్నాయి. ప్రజాస్వామ్యయుత క్రమంలో విశ్వాస పునరుద్ధరణకై సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. ఎన్నికల్లో ధనబలం, కండబలం ప్రవాహాన్ని అణచివేయటానికై ఎన్నికల నిధులు ప్రభుత్వం సమకూర్చాలన్న ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ సిఫారసులు తక్షణం అమలు జరపాలి.

ఈ వైఫల్యాలను విస్మరించటం అసాధ్యమైనప్పుడల్లా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మతపరంగా సమాజ విభజనవైపు మరలుతాయి. ఉమ్మడి ప్రయోజనాలను పంచుకునే ప్రజలను విభజించటం ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయం.

మతవిశ్వాసం కోట్లాదిమంది భారతీయుల జీవితాల్లో పవిత్రమైన స్థానం ఆక్రమించుకుని ఉంది. అందువల్లనే అయోధ్య రామాలయం కోసం వసూలు చేసిన విరాళాలు, భక్తులు సమర్పించుకున్న కానుకలు దొంగతనం కావటం భక్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది. ఈ ఆరోపణలు పారదర్శకత, జవాబుదారీతనం గూర్చి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి. దీనిపై సబబైన, స్వతంత్ర, విశ్వసనీయత కలిగిన దర్యాప్తు అవసరం.

ఇది ద్రవ్య జవాబుదారీతనానికి మించిన సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు దశాబ్దాల పాటు భగవాన్‌ రాముని పేరుతో ప్రజల్ని సమీకరించాయి. ఆయన పేరుతో ఉన్న ఆలయం పనితీరు గూర్చి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తబడుతున్నప్పుడు వాటిని కొట్టిపారేయ వీలులేదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మతాన్ని వ్యాపారంగా, రాజకీయ అధికారానికి సాధనంగా ఉపయోగించింది. ప్రజలను ఐక్యం చేయటానికి బదులు విభజించటానికి ఉద్దేశించిన ఎడతెగని ప్రచారంతో వాస్తవ సమస్యలను సమాధి చేస్తున్నది మోదీ ప్రభుత్వం.

ఇంతకన్నా మెరుగైన స్థితికి భారత్‌ అర్హురాలు. కొత్త వివాదాలు సృష్టించే బదులు ప్రశ్నలకు జవాబుచెప్పే ప్రభుత్వం అవసరం. ఉపాధి, భద్రత, ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కులకు రక్షణ, నరేగా పటిష్టత, రైతులకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ, సామాజిక న్యాయ పరిరక్షణ, అర్థవంతమైన ఎన్నికల సంస్కరణలు అమలుజరిపే, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధానాలు దేశానికి అవసరం.

అన్నిటికన్నా ముఖ్యంగా, ఎన్నికల లబ్ధి కోసం ప్రజలను విభజించే బదులు ఐక్యం చేసే ప్రభుత్వం దేశానికి అవసరం.

భారత కమ్యూనిస్టు పార్టీ ఈ నిశ్చితాభిప్రాయంతోనే ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రల ద్వారా దేశవ్యాప్త ప్రచారోద్యమానికి పిలుపు ఇచ్చింది. ఇవి ప్రతి గ్రామం, పట్టణం, నగరానికీ ప్రజల ఐక్యత, న్యాయం, ప్రజాస్వామిక మార్పు సందేశాన్ని తీసుకెళతాయి.

ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్‌ 1న రాంలీలా మైదాన్‌లో జరిగే ‘మార్పు అవసరం’ ర్యాలీకి చేరుకుంటాయి. పైన ప్రస్తావించిన వివిధ తరగతుల ప్రజానీకం కోసం ఉద్దేశించిన కోర్కెలతోపాటు, ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ, భారత లౌకిక, ప్రజాతంత్ర రిపబ్లిక్‌ పరిరక్షణ, దాని రాజ్యాంగం పరిరక్షణను దేశం నలుమూలల నుంచీ చేరుకున్న ప్రజలు డిమాండ్‌ చేస్తారు.

బద్లావ్‌ జరూరీ హై
మార్పు అవసరం
ఢిల్లీ చలో
1 సెప్టెంబర్‌, రాంలీలా మైదాన్‌

ట్యాగ్‌లు: CPI national news