పదేళ్లు దాటినా మారని సిలబస్
Decade-Old Syllabus Raises Questions Over Education Quality (photo-AI Generated Image)
ప్రస్తుతం ఒకటి నుండి పదో తరగతి వరకు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు దాదాపు పదేళ్ల క్రితం రూపొందించినవి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాలలో రోజుకో కొత్త ఆవిష్కరణ జరుగుతుంటే… మన విద్యార్థులు మాత్రం ఇంకా పాత తరం సిద్ధాంతాలనే బట్టీ పడుతున్నారు. కంప్యూటర్ శాస్త్ర పుస్తకాల్లో ఇప్పటికీ కీబోర్డ్ మౌస్, కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలనే బోధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే, నేటితరం పిల్లల్లో ఇంకా దశాబ్దాల క్రితం నాటి ప్రాథమిక పాఠాలు నేర్పించడం విద్యా వ్యవస్థ వెనుకబాటుతనానికి నిదర్శనం. కాలంతోపాటు పాఠ్యాంశాలను నవీకరించకపోవడం వల్ల విద్యార్థులు నేర్చుకునే జ్ఞానానికి, నేటి సమాజపు అవసరాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది.
ప్రశ్నాపత్రాల నమూనా, బట్టీ విధానానికి ఊతమిస్తున్న పాతపాఠ్యాంశాలు పాఠ్యాంశాలు మారకపోవడం వల్ల మార్కెట్ లభించే గైడ్ ప్రశ్నానిధుల హవా పెరిగిపోయింది. ఏటా అవే పాఠాలు, అవే ప్రశ్నలు వస్తుండటంతో విద్యాసంస్థలు కొత్తగా ఆలోచించే శ్రమను తగ్గించుకున్నాయి. పదేళ్ల నుండి ఒకే రకమైన ప్రశ్నాపత్రాల నమూనా కొనసాగుతుండటం వల్ల, ఏ ప్రశ్నలు పరీక్షలో వస్తాయో ముందే ఊహించి, వాటిని విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్నారు. దీనివల్ల విద్యార్థికి సబ్జెక్టుపై లోతైన అవగాహన, సృజనాత్మకత పెరగడం లేదు. కేవలం మార్కులు సాధించే ఒక యంత్రంగా మాత్రమే విద్యార్థి మారుతున్నాడు.
జాతీయ, అంతర్జాతీయ పోటీలో వెనుకబాటుతనం
పాఠ్యాంశాల నాణ్యత పెంచకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు పునాది పడేది 6 నుండి 10 తరగతులలోనే. కేంద్ర విద్యా బోర్డులు తమ పాఠ్యాంశాలను క్రమ తప్పకుండా మారుస్తూ, అన్వయ పద్ధతిలోకి మారుతుంటే…మన సిలబస్ మాత్రం మార్పులకు దూరంగా ఉండిపోయింది. ఫలితంగా, కార్పొరేట్ పాఠశాలల్లో చది వి ఉన్నత స్థాయి పాఠ్యాంశాలు నేర్చుకునే పిల్లలు ముందంజలో ఉంటుండగా, కేవలం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే నమ్ముకున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు పోటీకి తట్టుకోలేక వెనుకబడిపోతున్నారు.
అధికారుల నిర్లిప్తత పాలకుల ప్రాధాన్యతా లోపం
పాఠ్యాంశాలను క్రమబద్ధంగా మార్చడం, నూతన జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం వంటి మేధోపరమైన పనులపై విద్యాశాఖకు ఆశించినంత శ్రద్ధ ఉన్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆయా కాలాల అవసరాలకు తగ్గట్టుగా వేగంగా స్పందించలేకపోతోంది. పాలకులు కూడా విద్యారంగంలో మౌలిక మార్పులు తేవడం కంటే, కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సిలబస్ పాతదైనా, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ‘విద్యా ప్రమాణాలు పెరిగాయి’ అని సరిపెట్టుకుంటున్నారు తప్ప, విద్యార్థి నిజమైన జ్ఞానార్జనను అంచనా వేయడం లేదు. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యార్థులకు, ఇరవయ్యో శతాబ్దపు పాఠ్యాంశాలను బోధిస్తూ… ఇరవై రెండో శతాబ్దపు పోటీ ప్రపంచాన్ని తట్టుకోమంటే అది సాధ్యం కాని పని. పదేళ్లు దాటినా సిలబస్ మార్చకపోవడం అనేది ఒక తరాన్ని మేధోపరంగా వెనుకబాటులోకి నెట్టడమే అవుతుంది.
పాఠ్యపుస్తకం మారనంత కాలం విద్యార్థి ఆలోచనా విధానం మారదు. ఆలోచనా విధానం మారనంత కాలం సమాజంలో కొత్త ఆవిష్కరణలు జరగవు. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యార్థులకు, ఇరవయ్యో శతాబ్దపు సిలబస్ బోధిస్తూ… ఇరవై రెండో శతాబ్దపు పోటీ ప్రపంచాన్ని తట్టుకోమంటే అది సాధ్యం కాదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తాత్కాలిక చర్యలు ఆపి, నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీలను వేసి, ప్రాథమిక స్థాయి (1-10 తరగతులు) నుంచే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ (కోడింగ్), ఆర్థిక అక్షరాస్యత, అనువర్తిత విజ్ఞానం (అప్లైడ్ సైన్స్) వంటి ఆధునిక అంశాలతో కూడిన నూతన పాఠ్యాంశాలను తీసుకురావాలి. అప్పుడే మన ప్రభు త్వ పాఠశాలల పిల్లలు కూడా ప్రపంచంతో ధీటుగా పోటీ పడగలరు. – కాళేశ్వరం కృష్ణమూర్తి