Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ కీలక నిర్ణయం.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటన..
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ కీలక నిర్ణయం.. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటన..
Sonam Wangchuk Continues Hunger Strike: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు ముట్టడికి శాంతియుతంగా తరలివెళ్తున్న యువత, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన బలాన్ని, దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి బెడ్ నుంచే ఒక చేతిరాత లేఖ ద్వారా వాంగ్‌చుక్ తన సందేశాన్ని విడుదల చేశారు.
శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న యువతను క్రూరంగా అణచివేయడం తనను తీవ్రంగా కలచివేసిందని వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)కి చెందిన యువ నాయకులను సంసద్ భవన్ వేదికగా పార్లమెంటు సభ్యులను (MPs) కలవడానికి అనుమతించే వరకు లేదా ఆసుపత్రిలోనే తనను వారిని కలవడానికి అనుమతించే వరకు తన దీక్షను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న అక్రమాలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతను, జవాబుదారీతనాన్ని ప్రభుత్వం త్వరలోనే నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
దేశంలో సంచలనం సృష్టించిన NEET-UG పరీక్షల పేపర్ లీకేజీ.. ఇతర విద్యాసంబంధిత అక్రమాలకు వ్యతిరేకంగా, విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు ఢిల్లీలో సంసద్ చలో మార్చ్‌ను చేపట్టారు. అయితే, పార్లమెంట్ వైపు దూసుకువెళ్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఆ బారికేడ్లను దాటడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల క్రమంలో పలువురు సీజేపీ నాయకులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ని ఉద్రిక్తతలు ఎదురైనప్పటికీ, పోలీసులు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ యువత, విద్యార్థులు ఎంతో సహనంతో, శాంతియుతంగా తమ నిరసనను కొనసాగించడాన్ని చూసి తాను ఎంతగానో ప్రభావితమయ్యానని వాంగ్‌చుక్ కొనియాడారు. విద్యార్థులు తమ సమస్యలను, వినతులను పార్లమెంటు ముందు తెలుపుకునేందుకు ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కేవలం అనుమతిని ఇస్తే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుందని ఆయన పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, సీజేపీ (CJP)కి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో అత్యవసరంగా సమావేశమైంది. NEET-UG పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తక్షణమే పూర్తి జవాబుదారీతనం వహించాలని వారు డిమాండ్ చేశారు. దీనితో పాటు వారు మంత్రి ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు:
ఆసుపత్రిలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలి.
నీట్ పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి.
నీట్ అక్రమాల వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
ఈ డిమాండ్లపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రభుత్వ ఉన్నత నాయకత్వంతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకునేందుకు తనకు కొంత సమయం కావాలని ప్రతినిధి బృందాన్ని కోరినట్లు సమాచారం.
ఈ ఆందోళనల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రోలోని కొన్ని కీలక స్టేషన్ల గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, ఆర్‌బీఐ కార్యాలయం, పార్లమెంట్ పరిసర ప్రాంతాలలో నిరసనలు తెలపడానికి ప్రయత్నించిన పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.