Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
Gandhi
Independence Day 2026: 1947 ఆగస్టు 15.. భారత చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సహా పలువురు నాయకులు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటుండగా.. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఆయన కలకత్తాలో వెళ్లి మత ఘర్షణలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.
గాంధీజీకి స్వాతంత్ర్యం కంటే దేశ విభజన, దాని ఫలితంగా జరుగుతున్న మత హింసే తీవ్ర ఆందోళన కలిగించింది. భారత్-పాకిస్థాన్ విభజన నేపథ్యంలో హిందూ, ముస్లింల మధ్య అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాంధీజీ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
1947 ఆగస్టు 9న గాంధీజీ కలకత్తాకు చేరుకున్నారు. బెంగాల్‌లో హిందూ, ముస్లింల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. మత ఘర్షణలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి శాంతిని నెలకొల్పాలని భావించారు. కలకత్తాలోని హైదరీ మంజిల్‌లో ఆయన బస చేశారు. అయితే అక్కడ కూడా గాంధీజీకి తీవ్ర నిరసన ఎదురైంది. కొందరు ముస్లిం నిరసనకారులు ఆయనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అయినప్పటికీ గాంధీజీ వెనక్కి తగ్గలేదు. ఇరువర్గాల నాయకులు, ప్రజలతో సమావేశమై హింసను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన సమయంలో గాంధీజీ మాత్రం కలకత్తాలోనే ఉన్నారు. ఆయన ఆ రోజు సాధారణంగా జరిగే వేడుకలకు దూరంగా ఉండి ప్రార్థనలు, ఆత్మపరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉపవాసం పాటిస్తూ, చరఖా తిప్పుతూ గడిపారు. ఎందుకంటే ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం అనేది కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు. దేశ ప్రజలు పరస్పరం శాంతి, సోదరభావంతో జీవించడం కూడా నిజమైన స్వాతంత్ర్యంలో భాగమే.
కలకత్తాలో గాంధీజీ చేపట్టిన శాంతి ప్రయత్నాలు క్రమంగా ఫలించాయి. హిందూ, ముస్లిం వర్గాల మధ్య హింస తగ్గుముఖం పట్టింది. ఈ పరిణామం అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటెన్ ను కూడా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఉపయోగించినా పంజాబ్‌లో హింసను అదుపు చేయడం కష్టమైందని, కానీ కలకత్తాలో ఒక వ్యక్తి ప్రయత్నంతో పరిస్థితి మారిందని ఆయన ప్రశంసించినట్లు చారిత్రక వర్ణనలు పేర్కొంటాయి.
స్వాతంత్ర్య వేడుకల సమయంలో గాంధీజీని కలిసిన సి. రాజగోపాలాచారితో కూడా ఆయన తన మనసులోని బాధను పంచుకున్నారు. దేశం విభజనతో ప్రజలు విడిపోయిన నేపథ్యంలో స్వాతంత్ర్యం తనకు పూర్తి ఆనందాన్ని ఇవ్వలేదని గాంధీజీ భావించారు.
హిందూ, ముస్లింలు పరస్పర విశ్వాసంతో కలిసి జీవించినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తానన్నది గాంధీజీ ఆలోచన. అందుకే 1947 ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన చారిత్రక వేడుకలకు హాజరుకాకుండా, మత ఘర్షణలతో అట్టుడుకుతున్న కలకత్తాలో ఉండటాన్ని ఆయన ఎంచుకున్నారు.
తర్వాత కూడా భారత్, పాకిస్థాన్‌లో మత సామరస్యం కోసం గాంధీజీ తన ప్రయత్నాలను కొనసాగించారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యే వరకు ఆయన శాంతి, మత సామరస్యం కోసం కృషి చేశారు. అందుకే 1947 ఆగస్టు 15 గాంధీజీ జీవితంలో ఒక విరుద్ధమైన రోజ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆనందం ఒకవైపు ఉంటే, దేశ విభజనతో ప్రజలు ఎదుర్కొంటున్న హింస, బాధ మరోవైపు నిలిచాయి.
- Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
- అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో జగమే సంగీతం
- ‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’