మాయమవుతున్న మనిషి.. రక్తసిక్తమవుతున్న బంధాలు..
మాయమవుతున్న మనిషి.. రక్తసిక్తమవుతున్న బంధాలు..
– మన్నారం నాగరాజు
‘మనిషి సామాజిక జీవి’ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, క్షమ, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలే మనిషిని ఇతర జీవుల కంటే గొప్పవాడిగా నిలబెట్టాయి. కానీ నేడు అదే మనిషి తన చేతులతో తన బంధాలను తెంచుకుంటున్నాడు. కోపం కళ్లను కప్పేస్తోంది. అనుమానం హృదయాన్ని విషపూరితం చేస్తోంది. క్షణికావేశం ప్రాణాలను బలి తీసుకుంటోంది.
ఉదయం పత్రిక తెరిచినా, టీవీ ఆన్ చేసినా, సోషల్ మీడియా చూసినా కనిపించేది హత్యలు, ఆత్మహత్యలు, కుటుంబ కలహాలు, లైంగిక నేరాలు, ప్రతీకార దాడులు, రక్తపు మరకలే. ఇవి కేవలం నేరాల వార్తలు మాత్రమే కాదు, సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాలకు అద్దంపట్టే విషాద చిత్రాలు.
ఒకప్పుడు కుటుంబం అంటే భరోసా. పెద్దల మాటకు విలువ ఉండేది. చిన్న చిన్న గొడవలు ఇంటి గడప దాటేవి కాదు. కోపం వచ్చినా కాసేపటికి చల్లారిపోయేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భార్యాభర్తలే ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు. కన్నబిడ్డలనే తల్లిదండ్రులు చంపుతున్నారు. తల్లిదండ్రులపై పిల్లలు దాడులు చేస్తున్నారు. అన్నదమ్ములు, బంధువులు ఆస్తి కోసం రక్తపాతం సృష్టిస్తున్నారు. ప్రేమను పంచాల్సిన చేతులే ప్రాణాలను తీస్తున్నాయి. కారణాలు వేర్వేరైనా, చివరకు బలి అవుతున్నది మాత్రం మనిషి ప్రాణమే.
ఈ పరిస్థితికి ఒక్క కారణం లేదు. క్షణికావేశం, సహనం లేకపోవడం, మద్యం, మాదకద్రవ్యాల వినియోగం, మానసిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక భారాలు, కుటుంబ సభ్యుల మధ్య తగ్గిపోతున్న సంభాషణలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ఒంటరితనం… ఇవన్నీ కలిసి మనిషిలోని మానవత్వాన్ని నెమ్మదిగా హరిస్తున్నాయి. సమస్యలను చర్చించి పరిష్కరించుకునే సంస్కృతి బలహీనపడుతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణి పెరుగుతోంది. సమస్యలు ఒక్క క్షణం ఆవేశంతో శాశ్వత విషాదాలుగా మారిపోతున్నాయి.
హత్య జరిగినప్పుడు ఒక ప్రాణం మాత్రమే పోతుందని అనుకోవడం పొరపాటు. ఆ ఘటనతో రెండు కుటుంబాలు శాశ్వతంగా ఛిన్నాభిన్నమవుతాయి. పిల్లలు అనాథలవుతారు. తల్లిదండ్రులు జీవితాంతం కన్నీళ్లతో మిగిలిపోతారు.
ఇటీవలి కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే వరుసగా వెలుగులోకి వస్తున్న హత్యలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గత ఏడాది నగరంలో 258 హత్య కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, నగర జీవితంలో పెరుగుతున్న అసహనం, విలువల పతనానికి సంకేతం.
షాబాద్‌లో జరిగిన వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు తనపై పోక్సో కేసు నమోదైందనే పగతో బాధితురాలి కుటుంబ సభ్యులను హత్య చేసి, అనంతరం తన భార్యా పిల్లలను కూడా చంపడం మానవత్వాన్ని కుదిపేసిన ఘటన. మరోవైపు, పటాన్‌చెరులో రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని అతని భార్య మరో వ్యక్తితో కలిసి హత్య చేయడం, వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తున్నాయో చూపించింది.
ఇవి ఒక్కో సంఘటనలు కాదు. సమాజంలో పెరుగుతున్న నైతిక సంక్షోభానికి ప్రతిబింబాలు. మద్యం, మాదకద్రవ్యాలు, అక్రమ సంబంధాలు, డబ్బు మీద వ్యామోహం, విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు వెతికే మనస్తత్వం, నియంత్రణలేని కోరికలు మనిషిని క్రమంగా పాశవికత్వం వైపు నెడుతున్నాయి.
సోషల్ మీడియాలో నేర సంబంధిత కంటెంట్, హింసాత్మక వీడియోలు, అసభ్య దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, ఓటీటీకి అధికంగా అలవాటు పడిన వారిలో, ముఖ్యంగా టీనేజర్లలో, ఒంటరితనం, హింసాత్మక ధోరణులు, ప్రవర్తనా మార్పులు పెరుగుతున్నాయని పేర్కొంది. అందుకే సాహిత్యం, సంగీతం, కళలు, క్రీడలు వంటి సృజనాత్మక అభిరుచుల వైపు యువతను మళ్లించడం కాలానుగుణ అవసరంగా మారింది.
పిల్లలకు కేవలం మార్కులు, ఉద్యోగాలు, పోటీ పరీక్షలే కాదు, నైతిక విలువలు, సహనం, పరస్పర గౌరవం, బాధ్యత, చట్టంపై విశ్వాసం, కుటుంబ బంధాల ప్రాధాన్యత కూడా బోధించాల్సిన అవసరం ఉంది. సమాజంలో పెరుగుతున్న హింసను కేవలం పోలీసు చర్యలతో మాత్రమే పూర్తిగా అరికట్టలేం. నేరం జరగకుండా నిరోధించేది కుటుంబం, విద్య, సమాజం, విలువలు.
తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. ఉపాధ్యాయులు పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా బోధించాలి. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మానవత్వం బతికితేనే కుటుంబం నిలుస్తుంది. కుటుంబం నిలిస్తేనే సమాజం నిలుస్తుంది. లేకపోతే, ‘మాయమైపోతున్నాడమ్మా… మనిషన్నవాడు’ అనే ఆవేదన కేవలం ఒక పాటలోని పాదంగా కాకుండా, రేపటి భారత సమాజాన్ని వర్ణించే చేదు నిజంగా మిగిలిపోతుంది.