జిహాద్ ఒక్కటే మార్గం.. హెజ్బొల్లాకు మొజ్తబా ఖమేనీ కీలక లేఖ, అమెరికాతో ఒప్పందానికి షరతు..
అమెరికాతో ఒప్పందంలో లెబనాన్ రక్షణే ప్రధాన షరతు
హెజ్బొల్లాకు రాసిన లేఖలో మొజ్తబా ఖమేనీ ఉద్ఘాటన
అమెరికా-ఇజ్రాయెల్ దేశాలపై జీహాద్ ప్రతిఘటన
పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ (56) హెజ్బొల్లా సైన్యాలకు రాసిన ఒక లేఖలో స్పష్టం చేశారు. ఆయన లేఖను ఇరాన్ మీడియా సోమవారం రాత్రి ప్రసారం చేసింది. హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ షేక్ నయీమ్ ఖాస్సెమ్, ఇతర పోరాట యోధులకు ఎక్స్ వేదికగా ఈ లేఖను మొజ్తబా ఖమేనీ షేర్ చేశారు.
అమెరికాతో ఇరాన్ యుద్ధం ముగిసిపోవాలంటే ఎలాంటి ఒప్పందం చేసుకున్నాగానీ, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగడమే ప్రధాన షరతుగా ఉంటుందని చెప్పారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణను అంతం చేయాలని పిలుపు ఇచ్చారు. లెబనాన్ రక్షణ ఇరాన్ ప్రధాన లక్ష్యమని ఖమేనీ ఆ లేఖలో స్పష్టం చేశారు. హెజ్బొల్లా యోధుల రక్షణను ఒక వ్యూహాత్మక ఆదేశంగా ఇరాన్ భావిస్తోందని పేర్కొన్నారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పట్ల హెజ్బొల్లా యోధులు అచంచలమైన విశ్వాసం, వినయ విధేయతలు ప్రకటిస్తూ హెజ్బొల్లా రాసిన లేఖకు తిరిగి సమాధానంగా ఖమేనీ లేఖ రాస్తూ, వారి గొప్పతనాన్ని ప్రశంసించారు. లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు పూర్తిగా వైదొలగి తమ కార్యకలాపాలను నిలిపివేసినప్పుడే యుద్ధం ముగుస్తుందని ఖమేనీ వారికి భరోసా ఇచ్చారు. లెబనాన్ రక్షణలో ఎల్లప్పుడూ ఇరాన్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ తన మొండి వైఖరిని కొనసాగిస్తే, యుద్ధమే మార్గమని భావిస్తే, అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జీహాద్ చేయడం తప్ప మరో మార్గం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వ నిరంకుశత్వం, దురాక్రమణతోపాటు మనుషుల ప్రాణాలు తీస్తూ తరతరాలను నాశనం చేసే నేరపూరిత జియోనిస్టులతో ప్రపంచం ఈనాడు విసిగిపోయిందని, ఈ దశలో జీహాద్ ప్రతిఘటన తప్ప ముందుకు వెళ్లడానికి మరో మార్గం మిగలలేదని తన లేఖలో ఖమేనీ రాశారు.
ఇజ్రాయెలీ దురాక్రమణను వ్యతిరేకిస్తూ హెజ్బొల్లా సైనికులు జీహాద్ పోరాటంలో ఒక శిలలా నిలబడి మార్గదర్శనం చేస్తున్నారని ప్రశంసించారు. స్వేచ్ఛ కోసం దేశాలు చేస్తున్న పోరాటానికి ఇది స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు.