Iran Rejects Oman Proposal: హోర్ముజ్‌లో ఒమన్‌కు సమానాధికారం ఇవ్వం.. 50-50 భాగస్వామ్యానికి ఇరాన్ నో
Iran Rejects Oman Proposal: హోర్ముజ్‌లో ఒమన్‌కు సమానాధికారం ఇవ్వం.. 50-50 భాగస్వామ్యానికి ఇరాన్ నో
హోర్ముజ్ జలసంధి నిర్వహణలో ఒమన్ దేశానికి సమానాధికారాలు ఇచ్చేందుకు ఇరాన్ తిరస్కరించింది. హోర్ముజ్ జలసంధిపై సంపూర్ణ అధికారాలన్నీ ఇరాన్‌కే ఉంటాయని స్పష్టం చేసింది.
హోర్ముజ్ జలసంధిలో ప్రాదేశిక జలాలను పంచుకుంటున్న ఈ రెండు దేశాలు ఒక సంయుక్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమన్ తాజా ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇరాన్-ఒమన్లకు ఫిఫ్టీ-ఫిఫ్టీ వంతున సమానమైన నియంత్రణాధికారాలు ఉండాలని ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఒమన్‌ను ఒక విలువైన పొరుగు దేశంగా, చర్చల్లో మధ్యవర్తి దేశంగా ఇరాన్ గౌరవిస్తుందని, కానీ హోర్ముజ్ నియంత్రణలో సమాన భాగస్వామ్యంవల్ల ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీనిని అంగీకరించలేమని చెప్పారు.
అదే విధంగా ఒమన్ నియంత్రణలో ఉన్న జలసంధి భాగాన్ని పర్యవేక్షించాలని, ఒమన్ ప్రాదేశిక జలాల నుండి వెళ్లే దక్షిణ ప్రాంత మార్గాలు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. హోర్ముజ్‌లోని ప్రధాన స్రవంతి రవాణా మార్గాలపై పూర్తిస్థాయి హక్కులు, అధికారాలన్నీ ఇరాన్‌కే ఉండాలని స్పష్టం చేసినట్లు చెప్పారు.
ఈ ప్రణాళిక విజయవంతమయ్యే అవకాశం లేదని ఆయన అన్నారు. దీంతో త్వరతగతిన యుద్ధంలో పురోగతి వస్తుందన్న ఆశలకు గండిపడింది.
అమెరికా దురాక్రమణ నుంచి హోర్ముజ్ జలసంధిని కాపాడేందుకు ఇరాన్ ముమ్మరంగా దౌత్య ప్రయత్నాలు చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం ఒమన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో టెలిఫోన్ సంభాషణలు చేశారు.
హోర్ముజ్ జలసంధి భద్రత, పశ్చిమాసియాలో స్థిరత్వం సాధించేందుకు, అమెరికా దురాక్రమణను తొలగించి, ఆ ప్రాంతంలో హోర్ముజ్‌పై సెంట్కామ్ ఆధిపత్యం లేకుండా చేసేందుకు అబ్బాస్ అరాఘ్చీ తన దౌత్య చర్యలు వేగవంతం చేశారు.
నౌకలు స్వచ్ఛందంగా రుసుములు చెల్లించడం ద్వారా హోర్ముజ్ జలసంధి నిర్వహణకు ఒక ఉమ్మడి ప్రాంతీయ యంత్రాంగం ఏర్పాటు చేసేందుకు ఒమన్-ఇరాన్ మధ్య మరోవైపు దశలవారీగా చర్చలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా సమాన భాగస్వామ్యం కోసం ఒమన్ మంగళవారం ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం హోర్ముజ్ జలసంధిపై కేవలం ఇరాన్ పెత్తనం మాత్రమే ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉండదు.
ఈ జలసంధిని ఉపయోగించుకునేవారంతా జలసంధి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, భద్రత, పరిశోధన, రక్షణ కార్యకలాపాల నిమిత్తం విరాళాలను స్వచ్ఛందంగా సమకూరుస్తారు.
హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్‌తో కలిపే మలక్కా జలసంధి నిబంధనల తరహాలో ఈ ప్రతిపాదనను ఒమన్ చేసింది. మలక్కాలో ఇండోనేసియా, మలేసియా, సింగపూర్ కలిసి నౌకల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తున్నాయి.
ఒమన్ చేసిన స్వచ్ఛంద విరాళాల ప్రణాళికను గల్ఫ్ దేశాలు కూడా అంగీకరించాయి. కానీ ఇరాన్ తిరస్కరించింది.