Skip to content
సంపాదకీయం వార్తలు

మనం మరచిన ‘కలం యోధుడు’ కొంపెల్ల

Prajapaksham 22 Jun 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
మనం మరచిన ‘కలం యోధుడు’ కొంపెల్ల

Remembering Kompella Janardhana Rao and His Contribution to Telugu Literature

తెలుగు సాహిత్య చరిత్రలో కొందరు రచయితలు తమ రచనల వల్ల చిరస్థాయిగా నిలిచిపోతారు. మరికొందరు తమ వ్యక్తిత్వం, సాహిత్యంపై ఉన్న అంకితభావం, సాహిత్య సమాజం కోసం చేసిన త్యాగాల వల్ల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో కొంపెల్ల జనార్ధనరావు పేరు అత్యంత గౌరవంతో చెప్పుకోవాల్సిందే. ఆయన రచనలు సంఖ్యాపరం గా పెద్దవి కాకపోవచ్చు. కేవలం మూడు పదుల వయసులోనే ఈ లోకం విడిచి హడావుడిగా వెడిలిపోయిన ఆయ న తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా ఆధునిక సాహిత్య వికాసానికి ఆయన అందించిన ప్రేరణ అసాధారణం. ఆయన జీవన విధానం అనితర సాధ్యం. ప్రతి సంవత్సరం జులై 23 వస్తే మనం కొంపెల్ల జనార్ధనరావును స్మరించుకొని తీరాలి. ఎందుకంటే ఆయన మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే తీసుకోవడంత సమంజం కాదుగనక. ఆయన మృతి, సాహిత్యాన్ని జీవితంగా భావించిన ఒక తరం కలల పతనం కూడా. ఒక సాహిత్య పత్రి క నిలదొక్కుకోవాలని, కొత్త ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లాలని, తెలుగు భాషలో నూతన చైతన్యం రావాలని తపించిన వ్యక్తి చివరికి దారిద్య్రం, అనారోగ్యం, నిర్లక్ష్యం అనే మూడు శత్రువుల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయాడు.
కొంపెల్ల మరణాన్ని గుర్తుచేసుకోవడం అంటే మన సా హిత్య సమాజం తన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించిందో ప్రశ్నించుకోవడమే. కొంపెల్ల తూర్పు గోదావరి జిల్లా మోడేకుర్రులో, 1906లో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనకు సాహిత్యంపై అసాధారణమైన ఆసక్తి ఉండేది. కుటుంబ నేపథ్యం సౌకర్యవంతమైనదే అయినప్పటికీ, కాలక్రమేణా ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. అయినప్పటికీ ఆయనలోని సాహిత్యాసక్తి మాత్రం తగ్గలే దు. సంస్కృత విద్యను అభ్యసించి, తెలుగు సాహిత్య సం ప్రదాయాలను లోతుగా అధ్యయనం చేశారు. ఆ కాలం లో జాతీయోద్యమ ప్రభావం యువతపై ఎంతగా ఉందో ఆయన జీవితం కూడా తెలియజేస్తుంది. గాంధీజీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనం. విలాసవంతమైన బాల్యం నుంచి ఆర్థిక సమస్యల కారణంగా విద్యను మధ్యలోనే వదిలివేయాల్సి వచ్చిన యవ్వనం వ రకూ ఆయన జీవితం పలు పలుపులు తిరిగింది. యువకుడిగానే ‘భారతి’ పత్రికలో ఉపసంపాదకునిగా చేరడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆకాలంలో తెలుగు సాహి ఒక సంధికాలాన్ని అనుభవిస్తోంది. సంప్రదాయ కవిత్వం నుంచి ఆధునిక భావవ్యక్తీకరణ వైపు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి పరిస్థితు ల్లో కొంపె ల్ల తనదైన స్వరాన్ని వినిపించాడు.
భావకవిత్వాన్ని ఆదరించిన ఆయన అనేక కవితా ఖండికలు రచించాడు. ఆ యన రచనల్లో సున్నితత్వం, భావోద్వేగం, భాషాపట్ల ప్రే మ స్పష్టంగా కనిపిస్తాయి. ‘తాన్‌ సేన్‌’, ‘తెలుగు’ వంటి నాటికల ద్వారా కూడా తన సృజనాత్మకతను చాటుకున్నాడు. రచనలు చేయడంతో ఆగకుండా, సాహిత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలన్న కొంపెల్ల సంకల్పం ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిట్టింది. ఈ సంకల్పమే ‘ఉదయిని’ అనే సాహిత్య పత్రికకు రూపం ఇచ్చింది. 1934 డిసెంబరులో ప్రారంభమైన ఈ పత్రిక సాధారణ ప్రచురణ కాదు. అది ఒక ఉద్యమం. కొత్త ఆలోచనలకు వేదిక కావాలని, యువ రచయితలకు అవకాశం కల్పించాలని, తెలుగు సాహిత్యంలో సృజనాత్మక చైతన్యం పెం పొందించాలని ఆయన కోరుకున్నాడు. ఒక పత్రికను నడపడం ఈ రోజుల్లోనే కష్టమైతే, అప్పట్లో అది మరింత క్లిష్టమైన పని. ప్రకటనల ఆదాయం లేదు. పెద్ద పెట్టుబడులు లేవు. సాంకేతిక సౌకర్యాలు లేవు. ఉన్నది కేవలం సాహిత్యంపై అపారమైన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమతోనే కొంపెల్ల పత్రికను కొనసాగించడానికి అహర్నిశలు శ్రమించాడు.
పత్రికను కొనమని, చదవమని, ఆదరించమని సాహిత్యాభిమానులను వేడుకున్నాడు. అతను ఒక సంపాదకుడు… ఒక ప్రచారకు డు… ఒక నిర్వాహకుడు… ఒక సేకరణకర్త… అంతా తానై ‘ఉదయిని’ పత్రిక కోసం అవిశ్రాంగా కృషి చేశాడు. కానీ స మాజం ప్రతిసారీ త్యాగాన్ని గౌరవించదు. సాహి త్య సేవకులను వెంటనే గుర్తించదు. అదే కొంపెల్ల విషయంలో జరిగింది. నవ్యసాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో వెలువడిన ఇతర పత్రికలు పాఠకాదరణ పొందడంతో ‘ఉదయిని’ ఆర్థికంగా కుదేలైంది. పత్రికను నిలబెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముద్రణ ఖర్చులు చెల్లించలేని స్థితి ఏర్పడింది. చివరికి ఏడవ సంచిక ముద్రణ దశలోనే చిత్తుకాగితాలుగా అమ్మివేయాల్సిన విషాద పరిస్థితి నెలకొంది. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు. ఒక కల ఛిద్రమవడం. ఒక జీవిత లక్ష్యం కూలిపోవడం. ఒక రచయిత హృదయం ముక్కలవడం. ఆ దెబ్బను కొంపెల్ల తట్టుకోలేకపోయాడు. అ ప్పటికే శారీరకంగా క్షీణించిన ఆయన మానసికంగా కూ డా కుంగిపోయాడు. నిలువునా విరిగిపోయాడు. క్షయవ్యాధి ఆయన శరీరాన్ని బలహీనపరిచినా, నిజానికి ఆ యనను చంపింది వ్యాధి కాదని, దారిద్య్రమని ఆయన సమకాలీనులు చెప్పడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కా దు. సాహిత్యరంగంలో ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ కొంపెల్లను ప్రత్యేకంగా నిలబెట్టిన మరో అంశం శ్రీశ్రీతో ఆయనకు న్న స్నేహం. భావపరంగా ఇద్దరూ వి భిన్న ధ్రువాలు. కొంపెల్ల సంప్రదాయవాది. ప్రవర్తనలో సనాతన విలువలను విశ్వసించేవాడు. మరోవైపు శ్రీశ్రీ విప్లవాత్మక ఆలోచనల ప్రతినిధి. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన ఉదాహరణ.
స్నేహం విమర్శతో మొదలైంది. 1928లో శ్రీశ్రీ రచించిన ‘ప్రభవ’ను కొంపెల్ల తీవ్రంగా విమర్శించాడు. భాషలో అధిక సంస్కృత ప్రభావం ఉం దని, స్వతంత్ర స్వరం అవసరమని స్పష్టంగా పేర్కొన్నా డు. సాధారణంగా రచయితలు విమర్శలను సహించరు. కానీ శ్రీశ్రీ వాటిని ఆలోచించాడు. ఆ విమర్శలలోని నిజాయితీని గుర్తించాడు. అక్కడి నుంచే వారి స్నేహం ప్రారంభమైంది. నిజమైన స్నేహం అంటే ఒకరి ఆలోచనలను మరొకరు అంగీకరించడం కాదు. ఒకరి వ్యక్తిత్వాన్ని మ రొకరు గౌరవించడం. కొంపెల్ల, శ్రీశ్రీల స్నేహం అలాంటిదే. ఇద్దరూ త రచూ వాదించుకునేవారు. కానీ సాహిత్యంపై ఉన్న ప్రేమ వారిని కలిపేది. ఆలోచనల్లో భేదాలు ఉన్నా లక్ష్యంలో సామ్యం ఉండేది. తెలుగు సాహిత్యం ఎదగాలని ఇద్దరూ కోరుకున్నారు. నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం గుర్తు చేసుకోవాలి. తరువాత కా విప్లవాత్మక సాహిత్యానికి చిహ్నంగా నిలిచిన శ్రీశ్రీ రచనలకు తొలినాళ్లలో అం దరూ మద్దతివ్వలేదు. ఆయన ‘జయభేరి’ వంటి రచనలకు వేదికలు నిరాకరించిన సందర్భాల్లో కొంపెల్ల తన ‘ఉదయిని’ ద్వారా ఆ రచనలకు స్థానం కల్పించాడు. అంటే కేవలం తన అభిరుచి కి నచ్చిన రచనలనే కాదు, కొత్త ఆలోచనలకు కూ డా వేదిక కల్పించగల విశాల దృష్టి ఆయనకు ఉందని తెలుస్తుంది. కొంపెల్ల మ రణం శ్రీశ్రీని తీవ్రంగా కదిలించిం ది. ఆ బాధే తరువాత ‘మహాప్రస్థానం’ అంకితంలో ప్రతిఫలించింది. తెలుగు సాహిత్యంలో అంకితగీతాల చరిత్రలో అది ఒక విశిష్ట స్థానం పొందింది.
వెళ్ళిపోయా వా నేస్తం’ అనే ఆవేదన వెనుక ఒక యుగపు నిరాశ దాగి ఉంది. కొంపెల్ల మరణించినప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే విచారించారని శ్రీశ్రీ పేర్కొనడం మన సాహిత్య సమాజాని కి అద్దం పడుతుంది. మ నం గొప్ప రచయితలను వారి జీవితం ఉన్నప్పుడు ఆదరిస్తామా? లేక మరణానంతరం మాత్రమే మహిమలు కట్టిపెడతామా? అనే ప్రశ్న ను అది ముందుకు తెస్తుంది. ఇ క్కడ ఒక పెద్ద పాఠం ఉంది. సాహిత్యం గురించి మాట్లా డే సమాజం, సా హిత్యకారులను గౌరవిస్తున్నామని చెప్పే వ్యవస్థ, వాస్తవంగా సృజనకారుల జీవన భద్రత గురించి ఎంత ఆలోచిస్తోంది? కొంపెల్ల కథ ఈ ప్రశ్నకు అసౌకర్యకరమైన సమాధానం ఇస్తుంది. ప్రతిభను ప్ర శంసించడం సుల భం. కానీ ఆ ప్రతిభ బతికేలా చేయడం కష్టం. మనం తరచూ మొదటిదే చేస్తాం… రెం డోదాన్ని విస్మరి స్తాం…. నేటి పరిస్థితులను పరిశీలించినా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదని స్పష్టమవుతుంది. అనే చిన్న పత్రికలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడుతున్నాయి. స్వతంత్ర రచయితలు తమ రచనలతో జీవించలేకపోతున్నారు. సాహిత్య ప్రచురణలు వాణిజ్య ఒత్తిడులకు లోనవుతున్నాయి. కొత్త రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొంపెల్ల జీవితం మనకు హెచ్చరికగా కనిపిస్తుంది. సాహిత్యం కేవలం పుస్తకాల సమాహారం కాదు.
అది ఒక సమాజపు మేధో జీవితం. ఆ జీవితం కొనసాగాలంటే రచయితలు, సంపాదకులు, చిన్న పత్రికలు, సాహిత్య వేదికలు బలంగా ఉండాలి. వాటిని నిలబెట్టే బాధ్యత పాఠకులపై కూడా ఉంటుంది. కొంపెల్ల కాలంలో పాఠక మద్దతు కొరవడింది. అదే విషాదానికి కారణమైంది. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదంటే సాహిత్యాన్ని వినోద వస్తువుగా కాక, సామాజిక అవసరంగా చూడాలి. కొం పెల్ల జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన వ్యక్తిగత కీర్తికోసం పనిచేయలేదనే మరో గొప్ప గుణం కనిపిస్తుంది కూడా సాక్షాత్కారమవుతుంది. కొం పెల్ల తన రచనల ప్రచారంకోసం పరితపించలేదు. సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న లక్ష్యంతో పనిచేశాడు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా విశ్రాంతి తీసుకోలేదు. తన కష్టాల గురించి పెద్దగా మాట్లాడలేదు. ఒక ఆదర్శం కోసం జీవించాడు. అందుకే ఆయన జీవితం మనకు కేవలం చరిత్రగా కాకుండా, ఒక నైతిక పాఠంగా మన ముందు ఉంటుంది. మనం విశ్వసించే విలువల కోసం ఎంతవరకు త్యాగం చేయగలమన్న ప్రశ్నకు స మాధానం. సమాజం గుర్తించకపోయినా, ఫలి తం కనిపించకపోయినా, ఒక లక్ష్యం కోసం పనిచేయడం ఎంత గొప్ప దో చెప్పే ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *