మోదీ ప్రాధాన్యతల్లోకి మహిళలు, యువత
80వ స్వాతంత్ర దినోత్సవం: ఎర్రకోట నుండి వికసిత భారత్ కోసం సప్తధార రోడ్‌మ్యాప్ - ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఇవే..
80వ స్వాతంత్య్రదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులనుంచి వరుసగా 13వ సారి జాతీయ పతాకావిష్కరణ గావించిన తదుపరి చేసిన సాంప్రదాయక ప్రసంగంలో అనేక ఉద్ఘాటనలతోపాటు రెండు తరగతుల ప్రజలు ప్రత్యేక ప్రస్తావనకు, ప్రాధాన్యతకు నోచుకున్నారు. వారు మహిళలు, యువత. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ చట్టం అమలును లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టి రాజ్యాంగ సవరణకు మార్చినెల బడ్జెట్ సమావేశంలో చేసిన ప్రయత్నం విఫలం కావటం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు తగిలిన ఎదురుదెబ్బ, గల నెలలో జన్ జీ యువత నీట్ ఇతర ప్రశ్నాపత్రాల లీకేజికి ప్రభుత్వంనుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల, వారి తల్లిదండ్రుల మనోవేదనను ప్రతిబింబిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో గాంధేయమార్గంలో సాగించిన ఉధృతమైన ఆందోళనపై, పార్లమెంటు మార్చ్‌పై క్రూరమైన హింసను ప్రయోగించి అపఖ్యాతి పాలైన ప్రభుత్వం, విద్యామంత్రి ప్రధాన్ చేత రాజీనామా చేయించి పొందిన నైతిక పరాజయం నుంచి కోలుకునే ప్రయత్నం ఇందుకు నేపథ్యంగా భావించవచ్చు. పోలీసు హింసకు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఐక్యంగా పార్లమెంటు బయట, లోపల సాగించిన ఆందోళనతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సమావేశాలనుంచి ముఖంచాటేసి మరీ అప్రతిష్టపొందారు. ఈ ఉద్యమ ఖ్యాతి కాక్రోచ్ జనతాపార్టీకి, ప్రతిపక్ష ఇండియా కూటమికి దక్కిన దృష్ట్యా జన్ జీ తరం తల్లిదండ్రులను బుజ్జగించటానికి ప్రధానమంత్రి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ హితోపదేశాలకు, దేశం నలుమూలలా సంఘ్, బిజెపి నాయకుల ప్రచారానికి దన్ను చేకూర్చే ప్రయత్నం ప్రధాని ప్రసంగంలో కనిపిస్తుంది.
ముందు మహిళా రిజర్వేషన్ చట్టం అమలు అంశాన్ని చూదాం. “అందరూ మహిళలను పూజించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు(పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, రాష్ట్రపతి ఆమోద ముద్రతో అది 2003 సెప్టెంబర్‌లో చట్టరూపం దాల్చింది) అమలుకోసం ముందుకు రావాలని అన్ని పార్టీలను కోరుతున్నాను. దాన్ని ఆమోదించినందుకు వారు కూడా ఆ ఖ్యాతిని పొందవచ్చు. మన మహిళలకు ఆ హక్కు ఇవ్వండి. అది ఈ క్షణం అవసరం”అని ప్రధాని మోదీ వక్కాణించారు. దీనివెనుకనున్న వాస్తవం ఏమిటి? దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీర్ఘకాలం మాట్లాడని మోదీ, తన రెండవ పదవీకాలం చివరలో అకస్మాత్తుగా తన అంబులపొది నుంచి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చారు. అన్ని పక్షాలు బలపరిచాయి. ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. అయితే దీన్ని తక్షణం 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, 2026 తదుపరి తొలి సెన్సెస్ వరకు నియోజకవర్గాల మార్పుపై రాజ్యాంగ సవరణ ద్వారా నిషేధం ఉందని, అందువల్ల ఆ సెన్సెస్ ప్రాతిపదికపై దాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నాడు ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓట్ల కోసం రిజర్వేషన్ బిల్లు హడావిడిగా తెచ్చారని అందరికీ అర్థమైంది. అయినా ఆ ఎన్నికల ఫలితాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
బిజెపి లోక్‌సభ బలం 240కి పరిమితమైంది. ఇప్పుడేమో మహిళలకు త్వరగా న్యాయం చేయాలంటూ, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా 2010సెన్సెస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి మోదీ భంగపడ్డారు. కాని కిందపడ్డా తమదే పైచేయి అనే మనస్తత్వం కదా!
ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి వారికి ద్రోహం చేశాయంటూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించారు. నియోజకవర్గాల సంఖ్యను ప్రతీరాష్ట్రంలో 50 శాతం పెంపుదల నోటిమాట తప్ప బిల్లులో ప్రతిపాదించలేదు. నియోజకవర్గాల సంఖ్య పెంపుదలతో మహిళా రిజర్వేషన్‌ను సంధానించారు. అయితే ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీల సంఖ్యాబలం ఆధారంగానే మహిళా రిజర్వేషన్ అమలు జరపాలని, ముందుగా అఖిలపక్ష సమావేశం జరిపి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఆ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించదు. ప్రతిపక్ష పార్టీలను చీల్చి మద్దతు కూడగట్టుకోవాలని ప్రభుత్వం నీచమైన ప్రయత్నం చేస్తోంది.
రెండు, యువత. ప్రధాని తమ 75 నిముషాల ప్రసంగంలో “యువత” పదాన్ని 50 సార్లుకు పైగా ప్రస్తావించారు. వారిని ఆకట్టుకునేందుకు కొన్ని తాయిలాలు ప్రకటించారు. పోటీ పరీక్షలకోసం ఎంతో ధనం వెచ్చిస్తూ కుటుంబానికి భారంగా తయారైన యువతకోసం ‘పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్’; ఒక కోటి యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) శిక్షణ, క్రీడా ప్రతిభులకోసం అన్వేషణ; మరింత క్రియాశీలమైన పౌర రక్షణ వ్యవస్థ వాటిలో ఉన్నాయి.
భారతదేశాన్ని ముందుకు నడిపించి, ఉన్నత శిఖరాల కు చేర్చేందుకు ‘సప్తధారల’ను మోదీ ప్రకటించారు. అవి విద్యుచ్ఛక్తి, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలు, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఆర్థిక వ్యవస్థ, మేథాశక్తి. అడవులనుంచి నక్సలైట్లను ఏరివేశామని, మేధావులైన మావోయిస్టులు ఇంకా పట్టణాలలో పనిచేస్తున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎర్రకోట వేడుకల్లో పలు విశేషాలు, వివాదాలు కూడా ఉన్నాయిః జాతీయ గేయం ‘వందేమాతరం’ మొత్తం ఆరు పాదా లూ తొలిసారి పాడినారు. ఆర్మీ బ్యాండ్ బాణీ వాయించగా సభికులు పెదాలు కదిపేరు. తదుపరి ప్రధాని జాతీయ పతాకం ఎగురవేయగా, అనంతరం జాతీయగీతం ‘జనగణమన’ ఆలాపన జరిగింది. కాంగ్రెస్ పాలనను నిందించటానికే సర్వసాధారణంగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు ప్రస్తావించే నరేంద్రమోదీ ఈసారి స్వాతంత్య్ర సమరయోధుల పేర్లలో భాగంగా ప్రస్తావించారు. ఇక వివాదాల్లోకి వస్తే, ప్రధాని జేబు చతురస్రంపై త్రివర్ణ పతాకం రివర్స్ వరుసలో ఉండటాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. కాగా కాంగ్రెస్ నాయకుల గైరుహాజరు స్వాతంత్య్ర దినం రోజున ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించటమేనని బిజెపివారు విమర్శించారు.