ఉపశమన వర్షాలు
Heavy Rain Lashes Vijayawada, Intense Rainfall Expected for Next Five Days
రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెల రోజులు దాటినా పెద్దగా వానలు పడలేదు. దీంతో అనేకచోట్ల ఖరీఫ్‌లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. అంతకుమించి తాగునీటి సంక్షోభం తరుముకొస్తుందా అనే సందేహాలు ముసిరాయి. ఈ వారం మొదట్లో రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల్లో నీటి మట్టాలు కేవలం 30 శాతంగానే నమోదయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి ప్రాజెక్టులన్నీ జలకళతో తొణకిసలాడేవి. రైతులు పంట పనుల్లో నిమగ్నమయ్యే వారు. కానీ, రాష్ట్రంలో
తద్భిన్నమైన పరిస్థితి కనపడింది.
ఎగువన కృష్ణా నది నుంచి, అలాగే గోదావరి నది నుంచి నీళ్ళు రాక రిజర్వాయర్‌లు వెలవెలబోయాయి.అయితే, కర్నాటకలో నెల మధ్యలో వర్షాలు కురియడంతో కృష్ణా నదిలో జలాలు వచ్చినా, ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను నింపుకోవడంలోనే నిమగ్నమయ్యాయి. వర్షాలు పెరగడంతో ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండ నిండి, వారం రోజులుగా నీళ్లు వదులుతుండడంతో జూరాలకు చేరుకున్నాయి. ఇది కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఉపశమనాన్ని కలిగించింది. ఉత్తర తెలంగాణలో పరిస్థితి వర్షాలు పడక, నిన్న మొన్నటి వరకు పరిస్థితి క్లిష్టంగా ఉండేది. గోదావరి నది పరిధిలో వర్షాలు రాక శ్రీరామ్‌సాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు వెలవెలబోయాయి. అదే సమయంలో ప్రాణహిత నది జలకళ నింపుకొని ప్రవహిస్తుండడం, మేడిగడ్డ వద్ద పరవళ్లు తొక్కడంతో
బిఆర్‌ఎస్ పక్షం రోజులుగా జలరాజకీయాలు రాజేసింది. కన్నెపల్లి పంపుహౌజు నుంచి నీరు ఎత్తిపోయాలంటూ కొత్త రాగం తీసుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టజూసింది. నిజానికి కన్నేపల్లి పంపుహౌజ్ వద్ద నీళ్ళెత్తిపోసినా, ఎగువన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు మూసివేస్తేనే, ఎల్లంపల్లికి ప్రాణహిత నది నీటిని వెనక్కి ఎత్తిపోయవచ్చు. ఆ బ్యారేజీలు కూడా మేడిగడ్డలాగానే బలహీనంగా ఉన్నాయని, గేట్లు తెరిచే ఉంచాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత ఏజెన్సీ(ఎన్‌డిఎస్‌ఎ) హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో తీవ్ర వాయుగుండం ఫలితంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు మూడు రోజులుగా జోరందుకున్నాయి. రెండు రోజుల క్రితం తీరం దాటిన తీవ్ర వాయుగుండం పశ్చిమదిశలో పయనిస్తూ, రాష్ట్రంలో ఉత్తర
దిశగా వెళ్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసి, వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. ఫలితంగా వట్టిపోయిన కడెం ప్రాజెక్టు నుంచి, శ్రీరాంసాగర్ నుంచి ఎల్లంపల్లికి గోదావరి పరుగులు తీసింది. దీంతో కన్నేపల్లి పంపుహౌజు నుంచి ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలన్న బిఆర్‌ఎస్ సృష్టించిన రాజకీయ వేడి చప్పున చల్లారింది. ప్రాణహిత జలాలు అవసరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్న సహజ గోదావరి నదీ ప్రవాహ జలాలనే నంది మేడారం పంపు హౌజు వద్ద నాలుగు పంపు హౌజులను ఆన్ చేసి, దిగువ మిడ్ మానేరుకు తరలించడం ప్రారంభించారు. ఉత్తర తెలంగాణకు కొంత ఊరటను కలిగించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలరాజకీయ చక్రవ్యూహం నుంచి బైటపడినట్లయింది.
అయినప్పటికీ, రాష్ట్రానికి నీటి కొరత తీరినట్లేనని భావించకూడదు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో కాలంలో దీర్ఘకాలం వర్షాలు పడకుండా ఉండడంతో పాటు, మధ్య మధ్యలో ఆకస్మికంగా రెండు మూడు రోజులు వర్షాలు పడతుంటాయని చెబుతున్నారు. ఈ వర్షాలతో వర్షపాతం లోటు తగ్గినట్లు అంకెల్లో కనపడినా వాస్తవంలో ప్రతిబింబించదు. ప్రస్తుతం తెలంగాణలో పడుతున్న వర్షాలతో లోటు వర్షపాతం తగ్గింది. రెండు వారాల క్రితం సగటున 33 శాతం లోటు వర్షాలు ఉండగా, ఇప్పటి వానలతో అది 22 శాతానికి చేరుకుంది. ఇంకా 13 జిల్లాల్లో అంత కంటే ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పెద్దగా పడలేదు. కాబట్టి ఈ వర్షాలకే ప్రభుత్వం, రైతులు సంతోషిస్తే, మబ్బులను చూసి నీటిని పారబోసుకున్నట్లే అవుతుంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా రైతులు వరి వంటి వర్షాధార పంటలను తగ్గించి, మెట్ట పంటలకు సిద్ధం కావాలి. ఈ వర్షాలను చూసుకొని వరిపంటకోసం ముందుకుపోతే మొదటికే ప్రమాదం. వచ్చిన నీటిని జాగ్రత్తగా జలాశయాలలో భద్రపరుస్తూ, ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవాలి. ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్రం ప్రభుత్వం వేసిన కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. అలాగే కంటింజెన్సీ ప్లాన్‌లు రూపొందించటమే కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు అంతకంటే ముఖ్యం.