Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial: భారత స్వాతంత్య్రం 80వ సంవత్సరంలోకి…(ఎడిటోరియల్)

Prajapaksham 15 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: భారత స్వాతంత్య్రం 80వ సంవత్సరంలోకి…(ఎడిటోరియల్)

బ్రిటిష్‌వారి వలసపాలననుంచి భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించేందుకు అశేష త్యాగాలకు సిద్ధపడి పట్టువిడవని పోరాటపటిమతో 1947 ఆగస్టు 15న ఫలసిద్ధి సాధించిన తరానికి ఈ 80వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ముందుగా ప్రణమిల్లుదాం! ఆ తొలి సంవత్సరాల్లో జన్మించిన తరం కూడా 80వ పడిలో పడింది. గడచిన 79 సంవత్సరాల్లో దేశం అనేక రంగాలలో సాధించిన పురోభివృద్ధివల్ల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలకు చేరినందున ఈ తరంలో గణనీయమైన సంఖ్య ఇంకా జీవించి ఉంది. ఈ తరం నిజంగా నవభారత నిర్మాతలు, దూతలు. పౌరులు, వారి హక్కులు, సంక్షేమం ప్రాధాన్యంగా రూపొందిన మన రాజ్యాంగం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రజలకు రక్షగా నిలిచింది. అది నిర్దేశించిన ప్రజాస్వామ్యం, లౌకికవిధానం మన దేశానికి అంతర్జాతీయంగా విశిష్ట స్థానం కల్పించాయి. ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం, ఉత్పాదక శక్తులు తగినంతగా అభివృద్ధి చెందని దశలో నాటి పాలకులు ఎంచుకున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, దానికి ఆలంబనగా ప్రభుత్వరంగానికి పెద్దపీట వేయటం దేశ పారిశ్రామిక, వ్యావసాయిక అభివృద్ధికి ప్రాతిపదికలు నిర్మించింది. అక్షరాస్యత బహుతక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, వయోజన ఓటింగ్‌ ప్రాతిపదికపై మన దేశం ఎంచుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రభుత్వం, ఆ తర్వాత పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు పరిపాలనలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తాము భాగస్వాములమన్న భావనను ప్రజలకు కలుగజేసింది. పురుషులతోపాటు మహిళలకూ ఒకేసారి ఓటు హక్కు ఇచ్చిన తొట్టతొలి దేశం మనది. వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయకుండా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పంచవర్ష ప్రణాళిక విధానాన్ని చేపట్టారు. స్వాతంత్య్రం నాటికి భారతదేశం భౌగోళిక స్థితి ఒక ఊహాచిత్రంగానే ఉండగా, 560 స్వదేశీ రాజసంస్థానాలను యూనియన్‌లో విలీనం చేయటం, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటంతో భారతదేశ సమగ్రత, సమైక్యతలకు స్పష్టమైన రూపం ఏర్పడింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అయినందున రాజకీయ, పరిపాలనాధికారం సహజంగా ఆ పార్టీకే లభించింది.

భారత్‌ దేశ విభజనతో స్వాతంత్య్రం లభించటం, ఆ సందర్భంగా ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో హిందూ-ముస్లిం మతకలహాలు, పెద్ద ఎత్తున హింసాకాండ, వేలాదిమంది మరణం, అటు మతం ప్రాతిపదికపై ప్రజలు మారటంతో రక్తసిక్తమైన రహదారులు అదో పెద్ద విషాదం. మతం ప్రాతిపదికగా పాకిస్థాన్‌ను బ్రిటీష్‌వారు విభజించినా, పాకిస్థాన్‌లోకన్నా ఎక్కువమంది ముస్లింలు భారత్‌లో ఉండిపోవటం ముస్లింల్లోని లౌకిక భావాలకు ప్రతీక. అది మరిచిపోవలసిన ఘోరకలి. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తదుపరి ఆగస్టు 14న దాన్నొక విషాద స్మృతిదినంగా పాటిస్తూ గాయాన్ని గుర్తుచేస్తున్నది. అందులో వారికి ముస్లిం వ్యతిరేక భావోద్వేగాలు ప్రచారం చేసే కుత్సిత రాజకీయ ప్రయోజనం ఉంది. మతసామరస్యంకోసం పాటుపడిన గాంధీజీని హత్య చేసిన వారిని ఆరాధించే సంతతి వారిది. దేశవిభజనకు కాంగ్రెస్‌ పార్టీని, జవహర్‌లాల్‌ నెహ్రూను నిందిస్తూ నాటి హోంమంత్రి వల్లభ్‌భాయి పటేల్‌ను నెత్తికెత్తుకున్నారు. గుజరాత్‌లోని కవాడియాలో నర్మదా నదీతీరంలో పటేల్‌ విగ్రహం నెలకొల్పారు. తమ పార్టీలో దేశ స్వాతంత్య్రంకోసం పోరు సల్పిన మహానాయకులెవరూ లేనందున పటేల్‌ను దత్తత తీసుకున్నారు. అయితే అహ్మదాబాద్‌లోని పటేల్‌ (మొతెరా) క్రికెట్‌ స్టేడియంను పెద్దస్థాయిలో పునర్నిర్మాణం చేసి, ఆ కాంప్లెక్స్‌కు పటేల్‌ పేరుపెట్టి, వార్తల్లో ఉండే క్రికెట్‌ స్టేడియంకు నరేంద్రమోదీ తన పేరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యక్తిపూజను ఖండించిన బీజేపీవారు అంతకుమించిన స్థాయిలో మోదీ భజన చేస్తున్నారు. వ్యక్తిపూజ ప్రజాస్వామ్య విరుద్ధం, నియంతృత్వానికి రాచబాట.

అదలావుంచితే భారతదేశం అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆహారోత్పత్తిలో, మౌలిక పరిశ్రమల్లో, రోదసీ ప్రయోగాల్లో ఫలితాలు ఎన్నదగినవి. అయితే భారత్‌ ఎంచుకున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సంపన్న తరగతిని వృద్ధి చేసింది. పర్యవసానంగా దారిద్య్రం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అదుపు తప్పటంతో ఆర్థిక అంతరాలు పెరిగాయి. 1990వ దశకం ఆరంభం నుంచి దేశం మరో మలుపు తీసుకుంది. ఆర్థిక సంక్షోభం ఆవరించిన స్థితిలో పి.వి. నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ ద్వయం ఆర్థిక వ్యవస్థ సరళీకరణను ప్రవేశపెట్టారు. స్వదేశీ, విదేశీ శక్తులు ప్రభుత్వ అండతో విజృంభించాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ తారకమంత్రం అయింది. స్వాతంత్య్రం అనంతరం చేపట్టిన ఆర్థిక విధానాలు ప్రైవేటు పెట్టుబడికి అనుకూలంగా మార్చటం మొదలైంది. ప్రభుత్వ బంధనాలు, రెడ్‌టేప్‌ తొలగిపోవటం, ప్రైవేటు పెట్టుబడికి బ్యాంక్‌ రుణాలు సునాయాసంగా లభ్యం కావటంతో ఆర్థికాభివృద్ధి ఒక గెంతు వేసింది. జాతీయవాదులు, వామపక్షాలు ఈ విధానాలను ఎంతగా వ్యతిరేకించినా ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతులు వృద్ధి సంఖ్యలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు, మెరుగైన ఉపాధి మార్కెట్‌ ఆకర్షణలో కొట్టుకుపోయారు.

కాంగ్రెస్‌ స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని విడనాడి అమెరికా వ్యూహాత్మక చట్రానికి దగ్గరైంది. కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల ప్రభావం, సంకీర్ణ ప్రభుత్వాల శకం ముగింపుకు నాందిగా భారతీయ జనతాపార్టీ 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి కాలంనాటి ఎన్‌డీఏను ముసుగుగా వాడుకుంటూ తన అధికారం పటిష్టం చేసుకుంది. మితవాద రాజకీయాలకు తోడు అయోధ్యలో రామాలయ ఉద్యమం, ముస్లిం వ్యతిరేకత ప్రాతిపదికగా హిందూత్వ శక్తులను తన వెనుక సంఘటితం చేసుకోవటం బీజేపీ ఎదుగుదలకు దారితీసింది. కాంగ్రెస్‌ బలహీనపడటం, అత్యధిక ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో బీజేపీ మిత్రులుగా మారటం బీజేపీ అధికారంలో తిష్టవేయటానికి తోడ్పడ్డాయి.

పర్యవసానం: స్వాతంత్య్రం అనంతరం నిర్దేశించుకున్న మార్గం పూర్తిగా గతి తప్పింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వర్ధిల్లుతున్నది. ప్రభుత్వరంగం ధ్వంసం పెచ్చరిల్లింది. ఆర్థిక అసమానతలు పెచ్చుపెరిగాయి. విద్యారంగంపై ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు సాధించింది. విద్య, వైద్యం ప్రైవేటీకరణ వ్యాపారం తారాస్థాయికి చేరింది. సెక్యులరిజం ఉచ్ఛరించరాని పదంగా తయారైంది. ప్రజాస్వామ్యం ఎన్నికలకే పరిమితమైంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో పనిముట్టుగా మారటంతో ఎన్నికల అక్రమాలు పెరిగాయి, ఫలితాలు బీజేపీ ఖాతాలోకి వెళుతున్నాయి. అసమ్మతి, నిరసన అణచివేయబడుతున్నాయి. విద్యాధికుల్లో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఉచిత ధాన్యాలు ఇస్తున్నా దారిద్య్రం స్థితి మెరుగుకాలేదు. సమాఖ్య వ్యవస్థ రాష్ట్రాలకు కల్పించిన హక్కులు హరిస్తూ అన్నిటినీ కేంద్రం చేతిలోకి తీసుకునే నిరంకుశత్వం కొనసాగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చే శక్తిని ప్రజలు ఇవ్వకపోయినా, లోపలనుంచి తూట్లు పొడిచే ప్రక్రియ సాగుతున్నది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అలీన విధానాన్ని చెప్పకుండానే అటకెక్కించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం అనే పేరుతో అమెరికా వ్యూహాలకు దగ్గరైనారు.

దక్షిణార్ధగోళం దేశాలకు నాయకత్వం వహించే స్థితిని భారత్‌ కోల్పోతున్నది. పడికట్టు పదాలతో వినసొంపైన నినాదాల్లో మోదీ దిట్ట. ఇప్పుడు ‘వికసిత్‌ భారత్‌’ అంటూ 2047కు ముహూర్తం పెట్టి అప్పటికి ప్రపంచంలో నెం.1 కావటం దేశ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌ ఆదేశాలను తిరస్కరించే ధైర్యంలేని ప్రధాని మున్ముందు స్వదేశీ గుత్తపెట్టుబడిదారుల హుకుంలను నిరాకరించలేని స్థితిలోకి నెట్టబడినా ఆశ్చర్యం లేదు. కాబట్టి మార్పుకోసం ప్రజలు పోరాడాలి. రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్‌ను కాపాడుకోవాలి. ఇటీవల ఢిల్లీలో జన నిరసన యువతరంలో పెల్లుబుకుతున్న అసంతృప్తికి ప్రతీక, ప్రజా ఉద్యమాలకు ఉత్తేజకారకం, మోదీ ప్రభుత్వానికి సున్నితమైన హెచ్చరిక.