Skip to content
ఎడిట్ పేజి వార్తలు

అట్టుడుకుతున్న ఢిల్లీ.. మోదీకి కాంగ్రెస్‌ షాక్‌

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
అట్టుడుకుతున్న ఢిల్లీ.. మోదీకి కాంగ్రెస్‌ షాక్‌

Rahul Gandhi Protest: రాహుల్ గాంధీ ధర్నాతో వేడెక్కిన ఢిల్లీ.. ప్రధాని మోదీ నివాసం ఎదుట బైఠాయించిన ప్రతిపక్ష నేత.. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..

పరీక్షా పత్రాల లీకేజికి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటుకు కూతవేటుదూరంలోని జంతర్‌మంతర్‌లో 44రోజులుగా
ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడటానికి మనసురాని నరేంద్రమోదీ ప్రభుత్వం, సోమవారం వారి ‘పార్లమెట్‌ మార్చ్‌’ సందర్భంగా ప్రదర్శకులపై పోలీసుదాడులు జరిపించిన తీరు ప్రజాస్వామ్య ఉద్యమాలపట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని బాహాటపరిచింది. విద్యార్థులపై నీచమైన, ఘోరమైన లాఠీఛార్జి, బాష్పవాయువు గోళాలు ప్రయోగించటంపై చర్చకు ప్రభుత్వం నిరాకరించిన కారణంగా ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు మంగళవారం మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్‌లో పోలీసులు సోమవారం తొలగించిన నిరాహారదీక్ష శిబిరాన్ని నిరసనకారులు మంగళవారం ఉదయం తిరిగి ఆక్రమించుకుని దీక్ష కొనసాగిస్తుండగా, కాంగ్రెస్‌పార్టీ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావాన్ని నాటకీయమైన మలుపుతో తారాస్థాయికి తీసుకెళ్లింది. విద్యార్థులపై పాశవికమైన బలప్రయోగం, పరీక్షల సంక్షోభంపై ప్రభుత్వంలో పూర్తిగా కొరవడిన జవాబుదారీతనంపై సభలో చర్చ చేబట్టాలని స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధి, ఇతర ఎంపిలు కోరగా, ప్రభుత్వ అనుమతి కావాలంటూ ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. సభ వాయిదా తదుపరి కాంగ్రెస్‌ నాయకులు మల్లిఖార్జున ఖర్గె, రాహుల్‌గాంధి, ప్రియాంకాగాంధి వాద్రా, కె.సి.వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, ఇతర ఎంపిలు, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు డి.కె.శివకుమార్‌; సతీశన్‌, వందలాదిమంది కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోదీ నివాస గృహం వద్దకు వెళ్లి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లకు ప్రతీకగా చేతులు బంధించుకుని ఆకస్మికంగా రోడ్డుపై ధర్నాకు ఉపక్రమించి తమ ఆందోళన పట్ల దేశం దృష్టిని ఆకర్షించారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను కోరుతున్న విద్యార్థుల డిమాండ్‌ను, సోమవారంనాటి పోలీసు దారుణ కృత్యాలకు జవాబుదారీగా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా డిమాండ్‌కు విస్తరించారు. నీట్‌ ప్రశ్నా
పత్రాల లీకేజి సంబంధిత ఘటనలు, విద్యార్థులపై పోలీసు అకృత్యాలను పార్లమెంటులో చర్చించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. దాదాపు 3గంటలపాటు జరిగిన ఈ ఆందోళన సందర్భంలో ప్రభుత్వం తరఫున పిఎంఒ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ వచ్చి రాహుల్‌తో జరిపిన చర్చ లు ఫలించలేదు. పార్లమెంటులో చర్చకు ఆయన అంగీకరించారుగాని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించాడు. అనంతరం పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అక్కడినుంచి బలవంతంగా తరలించారు.
కేంద్ర ఆరోగ్యమంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు జె.పి.నడ్డాను సోమవారం కలుసుకున్న కాక్రోచ్‌ జనతాపార్టీ ప్రతినిధులు మూడు డిమాండ్‌లు ఆయనకు అందజేశారు. ఒకటి, 21రోజుల నిరాహారదీక్షనుంచి బలవంతంగా సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించిన ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు స్వేచ్ఛ. (ఆయన ఇష్టానుసారం ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కోర్టు మంగళవారం అనుమతించింది). రెండు, నీట్‌ పేపర్‌ లీకేజికి జవాబుదారీతనం వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా. మూడు, పేపర్‌ లీకేజి దరిమిలా నిరాశోపహతులై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లింపు. “నిరసనకారుల అభ్యర్థన”పైనే తాను వారితో సంభాషించానని, కోర్కెల పత్రం తీసుకున్నానని నడ్డా చెప్పటంలోనే ప్రభుత్వ అహంకారం వెల్లడవుతున్నది. నెలరోజులపైబడి నిరసన ఆందోళన ఉధృతంగా జరుగుతున్నా వారివద్దకు వెళ్లి లేదా వారి ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడాలన్న సున్నితత్వం కొరవడిన ప్రభుత్వం, వీధుల్లో రణరంగం జరుగుతుండగా విద్యార్థి ప్రతినిధులకు నడ్డాను కలుసుకునే అవకాశం ఎందుకు కల్పించినట్లు?
అమిత్‌ షా పోలీసుల తీరే ప్రత్యేకం. నిరాహారదీక్ష శిబిరం వద్ద ఎన్నో అవాంతరాలు కలిగిస్తూ వచ్చిన, అక్కడకు వచ్చి సంఘీభావం తెలియజేసే వారిగూర్చి కూపీలు లాగుతున్న ఢిల్లీ పోలీసులు, ఇప్పుడు విద్యార్థుల ఆందోళన వెనుక ఎవరున్నారని ఆరాతీస్తున్నారట. విద్యార్థులు 60మందికిపైగా గాయపడితే 118 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని లెక్కలు వెల్లడించి తమ అమానుష దాడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘చలో పార్లమెంట్‌’ కు పర్మిషన్‌ లేదనేది వారు చెప్పే కారణం. పర్మిషన్‌ ఇచ్చి ఉంటే ప్రశాంతంగానే నిరసన ప్రదర్శన జరిగేది కాదా? పర్మిషన్‌ నిరాకరించమని ఆదేశించిందెవరు?
చివరగా, మోదీ ప్రభుత్వానికి ప్రజల నిరసనలు గిట్టవు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరిగిన సుదీర్ఘ ఆందోళనలో పాల్గొన్న మహిళలను హింసించారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకం గా ఆందోళనకు దిగిన రైతులను ఢిల్లీలోకి రానివ్వకుండా హర్యానా, యుపి సరిహద్దులోనే నిలువరించి సంవత్సరంపైగా అడ్డుకుందీ ప్రభుత్వం. చివరకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ చట్టాలు ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఇప్పుడు అమెరికాతో తుదిదశకు చేరిన వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ ప్రదర్శనకు బయలుదేరిన పంజాబ్‌, హర్యానా రైతులను ఈ రోజు (మంగళవారం) హర్యానా పోలీసులు శంభు కేంద్రంవద్ద అటకాయించారు.
ఈ బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వానికి నిరంకుశత్వంలో తప్ప ప్రజల ప్రజాస్వామిక హక్కుల్లో విశ్వాసం లేదని వెల్లడవుతున్నది. సిజెపి విద్యార్థి ఆందోళనపట్ల మొండివైఖరి కూడా ఈ ప్రజావ్యతిరేక మానసిక స్థితిలో భాగమే. పార్లమెంటులో కూడా ప్రజాసమస్యలు చర్చించే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వటం లేదు. దేశ ప్రజాస్వామిక సాంప్రదాయాలు ఈ నిరంకుశ లక్షణాన్ని ఎంతో కాలం అనుమతించవు.

ట్యాగ్‌లు: CJP Delhi Modi Rahul Gandhi