Skyroot Vikram 1 Success Story: టీహబ్ లో వికసించిన భారత కీర్తి పతాకం…స్కై రూట్ ఏరోస్పేస్ విజయగాథలో హీరోలు వీళ్లే…
Skyroot Vikram 1 Success Story: టీహబ్ లో వికసించిన భారత కీర్తి పతాకం...స్కై రూట్ ఏరోస్పేస్ విజయగాథలో హీరోలు వీళ్లే...
నేడు శ్రీహరికోట నుండి స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) వారి ‘విక్రమ్-1’ అంతరిక్షంలోకి దూసుకెళ్లినప్పుడు, అది కేవలం ఒక రాకెట్ ప్రయాణం మాత్రమే కాదు. ఎనిమిది సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరు వ్యక్తుల ఒక ఆలోచనతో మొదలై, ప్రైవేట్ రంగం నుండి ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించిన ప్రపంచంలోనే మూడవ దేశంగా భారతదేశం నిలిచే వరకూ కొనసాగింది. ఈ ఘనత వెనుక ఉన్న ప్రధాన శక్తులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా. వీరిలో పవన్ కుమార్ చందన మన తెలంగాణ ముద్దు బిడ్డ కావడం విశేషం.
2018 అంటే సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం, కేవలం ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లోని టీ హబ్ లో ఒక చిన్న కార్యాలయంలో ఇద్దరు యువ మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా, స్కైరూట్ ఏరోస్పేస్‌కు పునాది వేశారు. ఆ సమయంలో, భారతదేశంలో అంతరిక్ష రంగం ప్రైవేట్ కంపెనీలకు ప్రవేశం లేదు. అటువంటి విధానం గానీ, స్పష్టమైన నిబంధనలు గానీ లేవు. ఇన్వెస్టర్లకు కూడా అవగాహన లేదు. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు పవన్ చందన స్వయంగా తన ఎక్స్ ఖాతాలో రాసినట్లుగా, అప్పట్లో వారి దగ్గర ఆలోచనలు తప్ప మరేమీ లేవు. విజయావకాశాలు చాలా తక్కువగా కనిపించినప్పటికీ, వారు వెనక్కి తగ్గకుండా చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇస్రో లాంటి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని కూడా కేవలం ఆరు సంవత్సరాల్లోనే ముగించి రాజీనామా చేసి బయటకు వచ్చి గమ్యం తెలియని రంగంలో అడుగుపెట్టడం అనేది ఒక పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే 60 సంవత్సరాలు హాయిగా బతికేయొచ్చు అని చాలామంది అనుకుంటారు కానీ అందుకు వీరిద్దరూ భిన్నం అని చెప్పవచ్చు.
వీరిద్దరిలో పవన్ కుమార్ చందన జీవితం ఎంతో స్ఫూర్తి దాయకం. ఎందుకంటే రాకెట్ సైన్స్ అంటే మొత్తం లెక్కలతో నిండి ఉంటుంది. ఎంతో కచ్చితమైన గణాంకాలు, సంక్లిష్టమైన సూత్రాలు ఉంటాయి. మరి ఇంత సంక్లిష్టమైన మేథమేటిక్స్ సబ్జెక్టులో పవన్ కుమార్ కు పదో తరగతిలో కేవలం 51 మార్కులు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్‌లోని 1991లో జన్మించి పవన్ కుమార్ మధ్యతరగతి కుటుంబంలో పెరిగి చిన్నప్పటి నుండే యంత్రాలు, ఆధునిక సాంకేతికత అంటే అమితమైన ఆసక్తి ఉండేది.
తండ్రి ప్రోత్సాహంతో 10వ తరగతిలో మేథ్స్ లో తక్కువ మార్కలు వచ్చినా ఆ తర్వాత ఐఐటీ కోచింగ్ తీసుకొని, మొదటి ప్రయత్నంలోనే ఐఐటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఐఐటీ ఖరగ్‌పూర్ లో బీటెక్, ఎంటెక్ డ్యుయెల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, నేరుగా ఇస్రోకు ఎంపికయ్యాడు. అక్కడ, అతను భారతదేశపు అత్యంత ప్రతిష్ట్మాతక రాకెట్ అయిన జిఎస్‌ఎల్‌వి మార్క్-III పై పనిచేశాడు.
ఇక విజయ యాత్రలో మరో వ్యక్తి నాగ భరత్ డాక… ఐఐటి బొంబాయి పూర్వ విద్యార్థి అయిన నాగ భరత్ కూడా ఇస్రోలో రాకెట్ టెక్నాలజీపై పనిచేస్తున్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశం తదుపరి ముందడుగు వేయాలంటే, ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. తన స్నేహితుడు పవన్ కుమార్ తో కలిసి ఇప్రోలో ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నారు. ఆ సమయంలో, ఈ నిర్ణయం చాలా మందికి ప్రమాదకరంగా అనిపించినప్పటికీ, రిస్క్ అవసరమని వారికి తెలుసు. అలాగే మొదలైంది స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్థానం.
నిజానికి చేతిలో డబ్బు లేదు..ఆ సమయంలో, ఒక స్పేస్ స్టార్టప్‌లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అప్పుడే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ వారిపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టిన మొదటి వ్యక్తి అయ్యారు. అలాగే గ్రీన్‌కో సంస్థ కూడా వారికి మద్దతుగా నిలిచింది, స్కైరూట్ కలను సజీవంగా ఉంచింది. ఆ తర్వాత, కంపెనీ నిధులను సమీకరించింది. మొదట 51 మిలియన్ డాలర్లు. ఆపై 60 మిలియన్ డాలర్లు. నేడు, GIC, టెమాసెక్ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు కూడా కంపెనీపై నమ్మకం ఉంచారు, కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో కంపెనీ విలువ దాని విలువ 1.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
2020లో కంపెనీ తొలిసారిగా ‘రామన్-1’ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ ఘనత సాధించారు. 2021లో, ఇస్రోతో మొదటి ప్రైవేట్ ఒప్పందం కుదిరింది. 2022 నవంబర్ 18న ‘విక్రమ్-ఎస్’ ప్రయోగించారు, దీనితో భారతదేశం తొలిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లడం చూడవచ్చు. తదనంతరం, ‘విక్రమ్-1’ కోసం పలు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ శ్రీహరికోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఆ రోజు రానే వచ్చింది. ఇది దేశాన్ని అంతరిక్ష పరిశోధనలో ఒక నూతన శకంలోకి అడుగుపెట్టేలా చేసింది.
ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ఒక స్టార్టప్ ఇప్పుడు వెయ్యి మంది నిపుణుల బృందాన్ని కలిగి ఉంది; కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ కంపెనీలో ఇప్పుడు సుమారు వెయ్యి మంది ఇంజనీర్లు, నిపుణులు పనిచేస్తున్నారు. ఇటీవల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ ప్లాంట్ అయిన స్కైరూట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో కూడా తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.