కూటమిలో ముసలం రాజేస్తున్న స్థానిక ఎన్నికలు…ఎవరి దారి వారిదే అంటున్న జన సైనికులు
తెలుగుదేశం, జనసేన మధ్యలో ముసలం...
ఆంధ్రప్రదేశ్ లోని అధికార కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనుమానాలు, మనస్పర్థలు మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి 85%, జనసేన 15%, బిజెపి 5% చొప్పున పోటీ చేస్తాయని లోకేష్ చేసిన ప్రతిపాదన కూటమిలో చర్చకు దారితీసింది.
లోకేష్ వ్యాఖ్యలపై జనసేన, బిజెపి క్షేత్రస్థాయి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో టిడిపికి 50 శాతం, మిగతా 50 శాతం సీట్లు జనసేన-బిజెపికి కేటాయించాలని వారు నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. బిజెపి నాయకులు పోలవరం పర్యటనకు వెళ్లి, ఇది కేంద్ర నిధులతో జరుగుతున్నందున “మోడీ వరం పోలవరం”గా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
నిజానికి పోలవరం ప్రాజెక్టు అనేది 2014 విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన చట్టబద్ధమైన హక్కు మాత్రమేనని, ఇది మోడీ ఇచ్చిన దానమో లేక వరమో కాదని మరోవైపు టీడీపీ కింది స్థాయి నాయకత్వం కుండ బద్దలు కొట్టి మరీ చెబుతోంది. కూటమి నేతలు వ్యక్తిగత ఇమేజ్ లేదా స్వార్థం కోసం ప్రాకులాడితే ప్రజలు గమనిస్తారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ తర్వాత ఎదురైన అనుభవాలే దీనికి ఉదాహరణ అని టీడీపీకి చెందిన నేత ఒకరు సోషల్ మీడియా చర్చా వేదికలో తన అభిప్రాయం పంచుకున్నారు.
మరోవైపు బిజెపి, జనసేన పార్టీలకు అనేక గ్రామాల్లో, మండలాల్లో పోటీ చేయడానికి కనీస ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఉంది. అయినా సరే ఎంపిటిసి, జెడ్పిటిసి సీట్లు కావాలని వారు పట్టుబట్టడం సబబు కాదని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు టిడిపి అంతర్గతంగా 75% సీట్లలో తాము పోటీ చేసి, మిగతా 25% సీట్లను జనసేన, బిజెపికి ఇవ్వాలని మొదట్లో కూటమి నేతల మధ్య సయోధ్య కుదిరినా తాజాగా లోకేష్ ప్రతిపాదనతో సమస్య ముదిరింది. .
జనసైనికులు ఒత్తిడి…
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రాష్ట్ర స్థాయిలో తప్ప జిల్లా, మండల, లేదా గ్రామ స్థాయిలో మూడు పార్టీలను కలుపుపోయే “సమన్వయ కమిటీలు” ఏవీ ఏర్పాటు చేయలేదు.మరోవైపు నామినేటెడ్ పదవుల కేటాయింపులోనే జనసేనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పునాది వేసుకోకపోతే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ పై జనసేన క్యాడర్ తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
టిడిపి, జనసేనలలోని ముఖ్య నేతలందరూ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతల్లో మునిగిపోవడం వల్ల పార్టీ వ్యవహారాలను, స్థానిక కమిటీలను పర్యవేక్షించే నాథుడే లేకుండా పోయారు. బిజెపికి మాత్రం ప్రభుత్వం బయట ప్రత్యేక పార్టీ నిర్మాణం ఉండి కార్యక్రమాలు చూసుకుంటోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ లేదా ఇతర నేతలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలు నోరు విప్పకుండా మౌనంగా ఉంటున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం:
పవన్ కళ్యాణ్ ఇష్యూ లాంటి సందర్భాల్లో కూటమి నేతలు ఒకరికొకరు మద్దతుగా మాట్లాడకపోవడంతో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే జోక్యం చేసుకుని మంత్రులను మందలించాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ విభేదాలు, అనుమానాలు సరిదిద్దుకోకపోతే కూటమిలో చీలికలు వచ్చి, అది రాజకీయంగా వైఎస్సార్సీపీ, జగన్మోహన్ రెడ్డి కి లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి భవిష్యత్తు ఏమవుతుందో వేచి చూడాలి.