Skip to content
జాతీయం › వార్తలు

Delimitation Bill: లోక్‌సభలో ఇక 850 సీట్లు? డీలిమిటేషన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 25 ఏళ్ల పాటు రాష్ట్రాల వాటా ఫ్రీజ్‌..

jagan 27 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Delimitation Bill: లోక్‌సభలో ఇక 850 సీట్లు? డీలిమిటేషన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 25 ఏళ్ల పాటు రాష్ట్రాల వాటా ఫ్రీజ్‌..

Modi Cabinet

Delimitation Bill: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కొత్త బిల్లు మహిళా రిజర్వేషన్ల సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం మూడు కీలక సవరణలకు ఆమోద ముద్ర వేసింది.

మొదటిది: జనాభాతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచడం.

రెండోది: లోక్‌సభ స్థానాల కేటాయింపులో రాష్ట్రానికి దక్కే నిష్పత్తి మారకుండా (1971 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉన్న ఫ్రీజ్‌ను) మరో 25 ఏళ్ల పాటు, అంటే 2051 వరకు పొడిగించడం.

మూడోది: ఆయా రాష్ట్రాల పరిధిలో నియోజకవర్గాల పునర్విభజన (Boundaries redrawing) ప్రక్రియకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రధాన ఆందోళనగా మారింది. అధిక జనాభా వృద్ధి నమోదైన ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన తమ రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటం మధ్య సమతుల్యత సాధించేందుకు లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచాలని 2051 వరకు సీట్ల నిష్పత్తిపై నిలుపుదలను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 13న పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సమావేశాల ముగింపునకు (ప్రోరోగ్) సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ ప్రత్యేక భేటీలను నిర్వహిస్తున్నారు. కాగా, గత ఏప్రిల్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలనే లక్ష్యంతో రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీని అప్పట్లో కేంద్రం సాధించలేకపోయింది. అయితే, అప్పటి నుంచి లోక్‌సభలో పార్టీల బలాబలాల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లును సభ ముందుకు తెస్తోంది.

ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే శనివారం తన నివాసంలో విపక్ష పార్టీల సభాపక్ష నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ప్రతిపాదనను బీజేపీ చేసిన అతిపెద్ద తప్పిదంగా అభివర్ణిస్తూ, వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలవాలనే రాజకీయ లక్ష్యంతోనే దీనిని తీసుకొస్తున్నారని విమర్శించారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రతిపాదిత 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటరీ వ్యవస్థలో మార్పుల ద్వారా బీజేపీ తమ రాజకీయ అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు.