Software Employee’s Tragic Story: పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులు.. ఒంటరితనం భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. నా ఆస్తి అనాథ పిల్లలకే చెందాలని నోట్..
Software Employee Tragic Story
Software Employee’s Tragic Story: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గోవిందపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, పద్మ దంపతులకు కుమార్తె బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36), ఒక కుమారుడు ఉన్నారు. సింధూజ హైటెక్ సిటీలోని ‘నెక్స్ట్‌టర్న్’ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని ‘ప్రజయ్ మెగాపోలిస్’ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది.
2015లో సింధూజకు వివాహం జరిగింది. అయితే, ఏడాదిన్నర తర్వాత వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, అప్పటి నుంచి ఒంటరిగానే జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సింధూజ పనిచేస్తున్న కంపెనీలో ఆమె సహోద్యోగి, స్నేహితుడైన రాజీరెడ్డి ఫోన్ చేయగా ఎంతసేపటికీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన రాజీరెడ్డి నేరుగా ఆమె నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, సింధూజ సీలింగ్ ఫ్యాన్ రాడ్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల తనిఖీల్లో సింధూజ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. గత నాలుగు నెలలుగా తాను తీవ్రమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నానని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని పేర్కొంటూ, తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులన్నింటినీ అనాథ పిల్లల సంక్షేమానికి అందజేయాలని కోరింది. కోర్టులో వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించిన కేసులను కొనసాగించి, తన ఆస్తి మొత్తాన్ని ‘కేర్ ట్రస్ట్’కు చెందేలా చూడాలని తన చివరి కోరికగా సూసైడ్ నోట్‌లో రాసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.
ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనం లేదా నిరాశతో బాధపడుతుంటే దయచేసి నిపుణుల సహాయం తీసుకోండి. మీ బాధను కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో పంచుకోండి. సహాయం కోసం భారత ప్రభుత్వ టెలి-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ నంబర్ 14416 లేదా 1800-891-4416 (24/7 ఉచిత సేవ) కు కాల్ చేయండి.