APMDC IPO Plans: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. ఐపీఓకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
Chandrababu naidu
APMDC IPO Plans: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను (ఏపీఎండీసీ) వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ (ఐపీఓ) చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో భాగంగా, ఏపీఎండీసీని దేశంలోనే అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలని, ఖనిజ వనరులను కేవలం ఆదాయ వనరుగా కాకుండా భవిష్యత్ ఆస్తిగా పరిగణించాలని ఆయన అధికారులకు సూచించారు. ఏపీఎండీసీ పరిధిలోని మొత్తం ఖనిజ వనరుల విలువ సుమారు రూ. 7.8 లక్షల కోట్లుగా, సంస్థ ఈక్విటీ విలువ రూ. 86,290 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ సమీక్షలో రాష్ట్రంలో లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల అన్వేషణ, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (APREDC) ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలపడంతో పాటు, విదేశాల్లోనూ మైనింగ్ ఆస్తుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు 1,774 మిలియన్ టన్నుల నిల్వలున్న ఒడిశా, ఝార్ఖండ్‌లలోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటోంది. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో రాష్ట్రవ్యాప్తంగా 582 ఖనిజ సంభావ్య ప్రాంతాలను గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్ పరిష్కారానికి గడువు పొడిగించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 400 కోట్ల ఆదాయం సమకూరనుందని అధికారులు వెల్లడించారు.