CM Revanth vs Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న అంతర్గత పోరు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్..
rajagopal reddy
Revanth vs Rajagopal Reddy: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, ఆయన చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. కొడంగల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కలిసి చెప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని, సీఎం తన అహంకారాన్ని పక్కనపెట్టి నిజాయితీతో పాలన సాగించాలని ఆయన హితవు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి, రాష్ట్రంలో అసలు అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారా అని ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. గుండెపై చేయి వేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీసిన ఆయన, ముఖ్యమంత్రి తన పాలనపై తానే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గత మూడేళ్లుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని దొంగలకు, పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టకూడదని ఘాటుగా విమర్శించారు. తాను ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిధులు అడుగుతున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌కు నిధులు కేటాయించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య కొంతకాలంగా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపు అంశంపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. కేవలం కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, నిధుల కొరతతో మునుగోడులో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
మరోవైపు, సొంత పార్టీ ఎమ్మెల్యేల బహిరంగ విమర్శలపై అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సైతం అంతే ఘాటుగా స్పందించారు. కొంతమంది నేతలు మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. లోపాలు లేదా చెడు విషయాలు ఏమైనా ఉంటే చెవిలో చెప్పాలని, మంచి విషయాలను మైకులో చెప్పాలని, కానీ కొందరు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మనవాళ్లలో కొందరికి పిచ్చికుక్కలు కరిచినట్లుందని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించే అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరువురు నేతల పరస్పర విమర్శలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.