Warangal: దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు.. కంటతడి పెట్టిస్తున్న వరంగల్ దంపతులు..
Warangal Tragedy
Warangal Tragedy: రెక్కల కష్టంతో జీవనం సాగిస్తున్న ఒక మధ్యతరగతి దంపతులను అనారోగ్య సమస్యలు, చక్రవడ్డీల అప్పుల భారం నిలువునా బలితీసుకుంది. వారానికి ఒకసారి వడ్డీలు చెల్లిస్తున్నప్పటికీ అప్పు ఇచ్చినవారి నుంచి ఎదురైన అవమానాలు, పరువు తీస్తామన్న బెదిరింపులను తట్టుకోలేక ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు ముందు వారు రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్లోని అక్షరాలు చదివిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
రంగశాయిపేట పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు వీధిలో ఓ అద్దె ఇంట్లో నల్లపోగుల సంజయ్‌కుమార్ (60), ఆయన భార్య శోభ (53) నివసిస్తున్నారు. సంజయ్‌కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య శోభ టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలుస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, ఇద్దరికీ వివాహాలు జరిగి ఉపాధి నిమిత్తం ముంబయిలో స్థిరపడ్డారు. కుమారులపై ఆధారపడకుండా తమ కష్టార్జితంతోనే ఆ దంపతులు ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారు.
అయితే, వయసు మీద పడటంతో ఇద్దరినీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీనికి తోడు పెరిగిన వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో బయట అప్పులు చేయాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగా పనులకు వెళ్లలేక సమయానికి వడ్డీలు చెల్లించలేకపోవడంతో అప్పు ఇచ్చినవారి నుంచి ఒత్తిళ్లు, వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో జీవితంపై పూర్తిగా విరక్తి చెందిన దంపతులు సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఘటనా స్థలంలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్లో దంపతులు తమ ఆవేదనను అక్షరబద్ధం చేశారు. వారానికి ఒకసారి వడ్డీలు కడుతున్నప్పటికీ చక్రవడ్డీల పేరుతో అప్పు ఇచ్చినవారు తీవ్రంగా వేధించారని, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నలుగురిలో గొడవ చేసి పరువు తీస్తామని బెదిరించారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇంట్లో ఉన్న పెంపుడు శునకాన్ని ఉద్దేశించి మీకే తిండికి దిక్కులేదు.. మీకు పెంపుడు కుక్క అవసరమా? అంటూ అసభ్యంగా దూషించి, తీవ్ర అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
సూసైడ్ నోట్ చివరలో వారు రాసిన మాటలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. అప్పు ఇచ్చినవారి అవమానాలను మేము తట్టుకోలేకపోతున్నాం. మా కష్టాలు, అప్పులు మా కుమారులకు భారం కావొద్దనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం. మాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. మేము చనిపోయాక మా అవయవాలను అవసరమైన వారికి దానం చేయండి. అలాగే ఏళ్లుగా మాతో పాటు కుటుంబ సభ్యుడిలా కలిసి జీవించిన మా పెంపుడు శునకానికి కూడా మాతోపాటే అంత్యక్రియలు నిర్వహించండి.
దేవుడా.. మరుజన్మ అంటూ ఉంటే మమ్మల్ని మధ్యతరగతి కుటుంబంలో మాత్రం పుట్టించకు అంటూ దంపతులు లేఖలో వేడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, సూసైడ్ నోట్ ఆధారంగా వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.