Free ChatGPT Plus for 12 Months: భారతీయ పరిశోధకులకు ఓపెన్ఏఐ బంపర్ ఆఫర్.. ఏడాది పాటు ఉచితంగా ‘చాట్‌జీపీటీ ప్లస్’.. నవంబర్ 23 నుంచి దరఖాస్తులు..
Open AI
Free ChatGPT Plus for 12 Months: దేశంలోని విద్యా, శాస్త్రీయ పరిశోధనా రంగానికి అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను మరింత చేరువ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం ఓపెన్ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రతిష్ఠాత్మక ‘చాట్‌జీపీటీ ఫర్ అకడమిక్ రిసెర్చర్స్’ (ChatGPT for Academic Researchers) కార్యక్రమాన్ని భారత్‌కు విస్తరిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన భారతీయ పరిశోధకులకు 12 నెలల పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ (ChatGPT Plus) సేవలు పూర్తిగా ఉచితంగా లభించనున్నాయి.
ఇటీవల ఓపెన్ఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కార్యక్రమం తదుపరి విడతలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 50,000 కొత్త గ్రాంట్లను కేటాయించనున్నారు. గతంలో అనుసరించిన లాటరీ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి, ఈసారి అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన తొలి 50 వేల దరఖాస్తులకు ‘ముందు వచ్చిన వారికి ముందు’ (ప్రాధాన్యత) ప్రాతిపదికన గ్రాంట్లు మంజూరు చేయనున్నారు. నవంబర్ 23, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒక్కో గ్రాంట్ కింద ఒక ప్రధాన పరిశోధకుడితో పాటు అదే సంస్థకు చెందిన మరో ఇద్దరు సహచరులకు కలిపి మొత్తం మూడు చాట్‌జీపీటీ ప్లస్ సీట్లు ఏడాది పాటు ఉచితంగా అందుతాయి. తద్వారా మొత్తం 2 లక్షల మంది పరిశోధకులకు ఏఐ సేవలను అందించాలన్నది సంస్థ లక్ష్యం. జులైలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇది రెట్టింపు కావడం విశేషం.
ఈ గ్రాంట్ల కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గత మూడేళ్లలో తమ విభాగంలో కనీసం ఒక పరిశోధనా పత్రం ప్రచురితమై ఉండాలనే నిబంధన విధించారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, రసాయన శాస్త్రం, మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, భూగోళ శాస్త్రాలు, ఇంజినీరింగ్, గణితం, భౌతిక శాస్త్రం విభాగాల్లో పరిశోధనలు చేస్తున్న వారికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారులు ఈ సదుపాయాన్ని కేవలం విద్యా, శాస్త్రీయ పరిశోధనా అవసరాల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. సంస్థ నిర్దేశించిన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఎంపిక ఉంటుంది.
ఈ ఏఐ టూల్ అందుబాటులోకి రావడం వల్ల సంక్లిష్టమైన శాస్త్రీయ పత్రాల విశ్లేషణ, కొత్త పరిశోధనా ప్రతిపాదనల రూపకల్పన, హైపోథసిస్ల పరీక్ష, కోడింగ్, డీబగ్గింగ్ , భారీ డేటా విశ్లేషణ వంటి కీలక పనులను పరిశోధకులు మరింత వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. కేవలం సాఫ్ట్వేర్ ఇవ్వడమే కాకుండా దాని సమర్థ వినియోగంపై ప్రత్యేక శిక్షణ, ప్రపంచవ్యాప్త పరిశోధకులతో అనుభవాలు పంచుకునే వేదికలను కూడా ఓపెన్ఏఐ కల్పించనుంది. అయితే, ఈ గ్రాంట్ కింద కేవలం చాట్‌జీపీటీ ప్లస్ సేవలు మాత్రమే లభిస్తాయని, ఓపెన్ఏఐ ఏపీఐ (API) క్రెడిట్లు ఇందులో భాగం కావని సంస్థ స్పష్టం చేసింది.