Manuguru Tremors: మణుగూరులో వరుస భూప్రకంపనలు.. భయాందోళనలో స్థానికులు.. అసలేం జరిగింది?
Manuguru
Manuguru Tremors: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం (నవంబర్ 17) ఉదయం వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఉదయం వేళల్లో స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక జనం తమ ఇళ్ల నుంచి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి ఓపెన్ కాస్ట్ గని సమీపంలో ఉదయం 11:28 గంటల సమయంలో మొదటిసారి భూమి కంపించింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే, కొద్ది నిమిషాల వ్యవధిలోనే అంటే 11:40 గంటల ప్రాంతంలో మరోసారి ప్రకంపనలు సంభవించాయి. మణుగూరు పట్టణంతో పాటు సమీప ప్రాంతాలైన రాజుపేట, విఠల్రావు నగర్, పీకే-1, బాపనకుంట, కొత్త కొండాపురంలలో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా భూగర్భ గనులకు అత్యంత సమీపంలో ఉండే శివలింగపురంలో వరుసగా మూడుసార్లు భారీ శబ్దాలు వినిపించాయని, ఇళ్ల పైకప్పులు , ఇంట్లోని సామాన్లు తీవ్రంగా కంపించాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా సింగరేణి కాలరీస్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత కోసం చేసే బ్లాస్టింగ్ ప్రక్రియ ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరుగుతుంటుంది. ఆ సమయంలో వచ్చే శబ్దాలు, స్వల్ప ప్రకంపనలకు స్థానికులు అలవాటుపడ్డారు. అయితే, మంగళవారం ఉదయం పూటనే ఇలా భారీ శబ్దాలు రావడం, భూమి కంపించడంతో ఇది సింగరేణి గనుల్లో జరిపిన బ్లాస్టింగా లేక సహజంగా సంభవించిన భూకంపమా అనే దానిపై ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
ఈ ప్రకంపనల తీవ్రత, భూకంప కేంద్రానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. మణుగూరు పరిసరాల్లో స్థానికంగా రిక్టర్ స్కేలు కొలిచే వ్యవస్థలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) అధికారిక పోర్టల్లో కూడా సాయంత్రం వరకు ఈ ప్రకంపనలకు సంబంధించిన ఎటువంటి డేటా నమోదు కాలేదు. భౌగోళికంగా గోదావరి లోయ పరివాహక ప్రాంతాల్లోని ప్రాచీన ఫాల్ట్ లైన్స్ కారణంగా అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు నమోదు కావడం సహజమేనని నిపుణులు చెబుతుంటారు. గతంలో 2026 జూన్ నెలలో కూడా మణుగూరు పరిసరాల్లో రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రస్తుత ఘటనపై స్పష్టత కోసం స్థానిక ప్రజలు సింగరేణి యాజమాన్యంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, సిస్మాలజీ విభాగం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.