సింగరేణిలో చారిత్రక సమ్మె పోరాటానికి 30 ఏళ్లు
జీవించే హక్కు కోసం తిరుగుబాటు; ఎఐటియుసి ప్రతినిధుల కాల్చివేత
రచయిత: ఏబూసి ఆగయ్య
సింగరేణి గనులలో తవ్విన కొలది బొగ్గు బయటికి వచ్చినట్లుగానే బొగ్గు పొరల కింద కార్మికులు జరిపిన పోరాట చరిత్రలెన్నో వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక వినూత్నమైన చారిత్రక సమ్మె పోరాటం సింగరేణిలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం శ్రీరాంపూర్ కేంద్రంగా జరిగి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు వెన్నులో చలి పుట్టించింది.
అణగారిన కార్మికుల నెత్తురులోనుంచి పుట్టిన ధిక్కార పోరాట బావుటా, నల్ల నేలపై సింగరేణి కార్మికులు ఐక్యతతో సాగించిన మరో పోరాట గాథ. పశువులను వేటాడి చంపినట్లుగా ఇక్కడ కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి. అది 1996 నవంబర్ నెల. అప్పటి వరకు జీతాల పెరుగుదల, గనులలోని సమస్యలు, సౌకర్యాల గురించి సమ్మె పోరాటాలు జరిపిన సింగరేణి కార్మికులు ‘మాకు జీవించే హక్కు కల్పించాలి, మా ప్రాణాలకు భద్రత కావాలి, కోల్‌బెల్ట్‌లో స్వేచ్ఛగా బతికే హామీ ప్రభుత్వం ఇవ్వాలి, అసలు కారణం లేకుండా కాల్చివేసిన ఇద్దరు సింగరేణి కార్మికుల మరణంపై న్యాయ విచారణ జరపాలి’ అని కోరుతూ కార్మికులు శ్రీరాంపూర్ ఏరియాలో జరిపిన సమ్మె సింగరేణిలో విభిన్నమైనది. ప్రజాస్వామిక వాదులను కదిలించింది. సమ్మెకు క్రమంగా అన్ని పక్షాలు మద్దతుగా నిలిచాయి.
1996 సంవత్సరంలో శ్రీరాంపూర్, మంచిర్యాల ఏరియాలో రోజుకో సంఘటనతో ఈ ప్రాంతమంతా అలజడిగా మారింది. ప్రతి దినం హత్యలు, ప్రతీకార దాడులు, ఎన్కౌంటర్లతో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని వాతావరణంలో ప్రజలు, కార్మికులు టెన్షన్‌తో కాలం గడుపుతున్నారు. ఆ ఏడాది అప్పటికే జూన్ 23న సికాస నాయకుడు సమ్మిరెడ్డి (రమాకాంత్)కి పోలీసులకు మధ్య 15 వేల మంది జనం చూస్తుండగా సింగరేణి క్వార్టర్లో ఎదురుకాల్పులు జరుగగా రమాకాంత్ సహా నలుగురు మృతి చెందారు. కొద్ది రోజులలో శివసేనకు చెందిన గ్యాంగ్‌స్టర్ శివకుమార్‌ను సిసిసిలో పోలీసులు కాల్చిచంపారు. అంతకు ముందే పిట్టల రాజేందర్‌ను ఆర్కే 7 గనిపై, సదానందంను ఆర్కే 6పై నక్సలైట్లు కాల్చి చంపారు. వీరిద్దరూ శివసేనకు చెందిన వారే. చిలుకయ్య కలప స్మగ్లర్‌ను అదే సమయంలో చంపివేశారు. ఇలా పోలీసులకు, నక్సలైట్లకు, శివసేన అనే ఇల్లీగల్ టీమ్‌కు మధ్య హత్యల ఘటనలు నిత్యం జరుగుతూ శ్రీరాంపూర్ ఏరియా అంతా ఒక అగ్నిగోళంగా మారింది. ఇవే రోజులలో శ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి వైపు టూవీలర్‌పై వెళుతున్న ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లను సైకిల్ మోటార్ ఆపలేదని ఇందారం కార్నర్ వద్ద పోలీసులు వారిపై నక్సల్స్ అనే అనుమానంతో కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై ఎలాంటి సమాధానం కూడా పోలీసులు చెప్పలేదు. అనామకులను కాల్చిచంపి నక్సల్స్‌గా కట్టుకథలు అల్లుతున్నారని పత్రికలు వార్తలు రాశాయి, పౌరహక్కుల సంఘాలు విమర్శించాయి.
ఇలా నడుస్తున్న హత్యాకాండలో భాగంగా 1996 నవంబర్ మొదటి వారంలో మరో ఉలికిపాటుకు ఈ ప్రాంతం గురయ్యింది. శివసేన జిల్లా నాయకుడు సత్యకామ్ దండేకర్‌ను మంచిర్యాలలోని తన నివాసానికి దగ్గర రైల్వే గేట్ సమీపంలో నక్సలైట్లు హత్య చేశారు. దండేకర్ వివాదాస్పదమైన వ్యక్తి. అన్ని రాజకీయ పక్షాలతో వైరం ఉన్నది. అంతకు కొద్దిరోజుల క్రితమే భూ తగాదాలో న్యూ డెమోక్రసీ గ్రూప్ వారితో విభేదాలు, గొడవలు జరిగాయి. అయితే దండేకర్‌ను న్యూ డెమోక్రసీ వారే చంపి ఉండవచ్చునని పోలీసులు మొదట భావించారు. కానీ హత్యను న్యూ డెమోక్రసీ వాళ్లు ఖండించారు. తర్వాత రెండు రోజులకు పీపుల్స్ వార్ నక్సల్స్ దండేకర్‌ను మేమే చంపామని ప్రకటించారు. దండేకర్ శివసేనలో ఉంటూ అనేకమంది అనుచరులతో ఇన్ఫార్మర్ వ్యవస్థను నడిపిస్తున్నాడని, అందరినీ అణిచి వేస్తున్నాడని ప్రకటించారు. ఇంకా ఇతర రాజకీయ నేతలతో విభేదాలున్నాయి. వార్ నేతలు ప్రకటించడంతో పోలీసులు మంచిర్యాల, శ్రీరాంపూర్ ఏరియాలలోని రాడికల్, సికాస సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పి 2 గనిలో పనిచేసే ఇద్దరు సింగరేణి కార్మికులైన దాడి శ్రీనివాస్, కొప్పుల రవిలను నవంబర్ 10న అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బెల్లంపల్లికి చెందిన వారు కావడంతో బెల్లంపల్లికి వెళ్లి అదుపులోకి తీసుకుని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పెట్టారు. వీరు ఇద్దరూ ఎఐటియుసిలో పనిచేస్తున్నారు. దాడి శ్రీనివాస్ ఎఐటియుసి పిట్ సెక్రటరీ కాగా, కొప్పుల రవి మైన్ కమిటీ సభ్యుడు. వీరు రెగ్యులర్‌గా డ్యూటీలు చేసుకుంటారు. మైన్ మీద కార్మికులకు అందుబాటులో ఉంటూ ఎఐటియుసి యూనియన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఇద్దరూ కలిసే తిరుగుతుంటారు. వీరి అరెస్ట్‌పై వెంటనే సిపిఐ, ఎఐటియుసి నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విడిచిపెట్టాలని మాట్లాడారు. నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఇంటరాగేషన్ చేసి నవంబర్ 15నాడు దండేకర్ హత్య కేసులో అరెస్ట్ చూపిస్తూ లక్సెట్టిపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జడ్జి రిమాండ్‌కు రాశారు. వారిని ఆసిఫాబాద్ జైలుకు తరలించాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతున్నదని చెప్పి లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి స్టేషన్లో పెట్టారు. కొద్దిసేపటికి సాయంత్రం లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ నుంచి దాడి శ్రీనివాస్, కొప్పుల రవిలు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి తెలిపారు. దీనిపై యూనియన్ నాయకులు వెళ్లి పోలీసులను అడిగినప్పటికీ పారిపోయినట్లు చెప్పారు. ఇది పోలీసులు అల్లుతున్న కట్టుకథేనని అందరికీ స్పష్టంగానే అర్థమవుతున్నది. పోలీసుల అదుపులో పెట్టుకొని పారిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని, వారికి ఏదో ప్రమాదం జరగబోతున్నదని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. విలేకరులు ఒక అడుగు ముందుకేసి ఈ రాత్రికి వారిని ఎన్కౌంటర్ పేరిట చంపేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని రాశారు. మరణ సమాచారం తెల్లారేలోగా ఏ సమయంలోనైనా రావచ్చునని అందరూ భావించారు.
అందరూ అనుకున్నట్లుగానే తెల్లవారక ముందే దాడి శ్రీనివాస్, కొప్పుల రవిలను కాల్చివేసిన వార్త గుప్పుమంది. లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి పారిపోతుంటే పట్టుకునే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపారని, ఎదురు కాల్పులు జరిపితే మృతి చెందారని ప్రకటించారు. పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన వారికి అప్పుడే ఆయుధాలు ఎలా వచ్చాయని అడిగితే సరైన వివరణ లేదు. శవాలు శ్రీరాంపూర్ సింగరేణి జి.ఎం కార్యాలయం సమీపంలో పడి ఉన్నాయి. విలేకరులు అక్కడికి వెళ్లేసరికి పడి ఉన్న మృతదేహాల వద్ద కాపలా ఉన్న దాస్ ఎస్.ఐ అప్పటికే మొత్తుకుంటుండు. ఈ సంఘటన గురించి మాకేమీ తెలియదు. తెల్లవారుజామున మమ్ములను కాపలా ఉండమంటే ఉన్నాం తప్ప వారు ఎలా చనిపోయింది మాకు తెలియదు అని ప్రెస్‌తోపాటు కార్మికులకు, యూనియన్ ప్రతినిధులకు వెల్లడిస్తున్నాడు. ఆగ్రహించిన కార్మికులు కొందరు అరుస్తున్నారు. అరే, పట్టుకుని పోయి కేసుపెట్టి, కోర్టుల పెట్టి తీసుకొచ్చి కాల్చి చంపే అధికారం పోలీసులకెక్కడిదని. అసలు డ్యూటీలు చేసుకునే కార్మికులను, జాతీయ యూనియన్‌లో ముఖ్యులుగా పనిచేసే వారిని పట్టుకెళ్లి, కోర్టులలో పెట్టిన వాళ్లను దారుణంగా కాల్చి చంపడం పోలీసుల అమానుష చర్య అని అందరూ నిరసించారు. యూనియన్లు, రాజకీయ పార్టీల నాయకులు ఖండించారు. గనుల వద్ద నిరసనలు వెల్లువెత్తాయి.
దాడి శ్రీనివాస్, కొప్పుల రవిల కాల్చివేతపై మరుసటి రోజు గనులు బంద్ పెట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు. అన్ని కార్మిక సంఘాలు, పార్టీలు ప్రదర్శనలో పాల్గొని పోలీసులపై తగిన చర్య తీసుకోవాలి, సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు భద్రత లేదని, ఎవరిని ఎప్పుడు మాయం చేస్తారో, ఎక్కడ చంపి ఎన్కౌంటర్ కథ అల్లుతారోనని కార్మిక నాయకులు ఆందోళనతో ప్రసంగించారు.
గనులలో నవంబర్ 17 నుంచి సమ్మె మొదలయింది. తర్వాత రోజు జి.ఎం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి వినతిపత్రం అందజేశారు. అన్ని యూనియన్లతో జెఎసిని ఏర్పాటు చేసి న్యాయం జరిగే వరకు సమ్మె కొనసాగించాలని తీర్మానం చేశారు. ఎఐటియుసి, ఐఎన్టియుసితో పాటు హెచ్ఎంఎస్, బిఎంఎస్, సాజక్, ఐఎఫ్టియు, ఎఐఎఫ్టియులు జెఎసిగా ఏర్పడ్డాయి. సమ్మె మరింత ఉధృత రూపం దాల్చింది. కార్మికులపై పోలీస్ అణిచివేత ఉండరాదని, కార్మికులను కాల్చి చంపిన దానిపై న్యాయ విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్కె 6 ఏరియాలో సమావేశం నిర్వహించి అన్ని కార్మిక సంఘాల నాయకులు, పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇది వేజ్‌బోర్డు కోసం కాదు, గని లోపల రక్షణ కోసమో, సౌకర్యాల కోసమో కాదు, సింగరేణి కార్మికుల జీవించే హక్కు కోసం జరుగుతున్నదని నాయకులు మాట్లాడారు.
సింగరేణిలో పెద్ద డివిజన్ శ్రీరాంపూర్ కావడంతో సమ్మె ప్రభావం కంపెనీపై పడినందున దీనిపై ఎవరు బాధ్యత వహించాలనే దాని గురించి అధికారులు సంకటంలో పడ్డారు. సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. పది రోజులు దాటిన తర్వాత అప్పటి ఆసిఫాబాద్ సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ శ్రీరాంపూర్ వచ్చి కార్మికులను కలిసి ఈ ఘటనపై అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కార్మికులను కాల్చివేసిన సంగతి, సమ్మె పరిస్థితిని తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఏమీ లభించలేదు. జీతాలు నష్టపోయినా రాజ్యహింసపై, అన్యాయంగా కాల్చి చంపిన తీరుపై కార్మికులు పట్టుదలతో పోరాడారు. సమ్మె 16 రోజులకు చేరుకుంది.
సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నేతలకు బెదిరింపులు తప్పలేదు. అన్యాయంపై ఆగ్రహంతో పోరాడుతున్నారు తప్ప పరిష్కారానికి ఎటువైపు నుంచి కూడా అనుకూల ద్వారాలు తెరవడం లేదు. నిర్దాక్షిణ్యంగా ఇద్దరినీ కాల్చి చంపడం పట్ల ధిక్కార స్వరాన్ని వినిపించి మహత్తర సమ్మె పోరాటంతో అటు ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రశ్నించిన కార్మికులు, జెఎసి ఆధ్వర్యంలో తప్పని పరిస్థితులలో సమ్మె విరమించాల్సి వచ్చింది. ఈ సమ్మె నల్ల నేలపై మరో చారిత్రక పోరాటంగా నిలిచింది.