Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: ప్రజలపట్ల మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణి

Prajapaksham 17 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ప్రజలపట్ల మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణి

Modi

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రజలపట్ల చిన్నచూపు. వారి ఆందోళనలపట్ల నిరంకుశ ధోరణి సమస్యలను జఠిలం చేస్తున్నది. తాము అనుకున్నది అమలు చేయాలన్న యావ తప్ప, ఆందోళన చేస్తున్న ప్రజలతో చర్చించి వారి మనోభావాలను గ్రహించి, పరిష్కార సాధనలో వాటికి స్థానం కల్పించే అలవాటు లేదు. ఏ ప్రధాన సమస్యపైన, బిల్లులపైన ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకున్న సందర్భం ఈ పుష్కర కాలంలో కనిపించదు. ప్రతిపక్షాలపై లేదా సమస్యలపై వీధుల్లోకి వచ్చిన ప్రజాశ్రేణులపై ఎదురుదాడి తప్ప వారితో ఒకటికి నాలుగుసార్లు మాట్లాడి స్థూల ఏకాభిప్రాయం సాధించటానికి ఈ ప్రభుత్వం ముందుకు రాదు.

ప్రజా ఒత్తిడికింద ఈ ప్రభుత్వం తలవంచిన సందర్భాలు రెండే రెండూ. ఒకటి, రైతులను పణంగా పెట్టి వ్యవసాయ రంగంపై కార్పొరేట్‌ పెత్తనం విధించే తలంపును సంస్కరణ పేరుతో అమలు చేయటానికి తెచ్చిన మూడు నల్లచట్టాలను సంవత్సరంపైగా రైతాంగం నిరంతర ఆందోళన తదుపరి, ఉపసంహరించుకున్న సందర్భం. ప్రధాని మోదీజీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన తొలి సందర్భం అది. ఆయన వెనకడుగు తాత్కాలికం, వ్యూహాత్మకం (యుపి అసెంబ్లీ ఎన్నికలు) అనే అనుమానాలు రైతాంగంలో లేకపోలేదు. ఆ చట్టాలను పునరుద్ధరించే ఆలోచనలు సాగుతున్నట్లు ఇటీవల వార్తలు తెలుపుతున్నాయి.

రెండు, నీట్‌ యుజి ప్రశ్నాపత్రం లీకేజికి, విద్యార్థుల, వారి తల్లిదండ్రుల క్షోభ, ఆర్థిక నష్టానికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని జెన్‌ జీ తరం, ఇతర విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఎడతెగని ఆందోళనకు దిగినప్పుడు, దాన్ని అణచివేసేందుకై వారి పార్లమెంట్‌ మార్చ్‌పై అమిత్‌ షా పోలీసులు క్రూరమైన హింసాకృత్యాలకు పాల్పడగా, దానిపై వ్యక్తమైన ప్రభుత్వ వ్యతిరేకతను గ్రహించి ప్రధాన్‌ చేత రాజీనామా చేయించటం. అయితే బిజెపి కేంద్ర కార్యాలయంలో ప్రధాన్‌కు పూలజల్లు స్వాగతం బిజెపి వారి మనోగతానికి అద్దం పట్టింది.

పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ తోడ్పాటు లేకపోయినా మహిళలను ముందుపెట్టి వారికి సీట్ల రిజర్వేషన్‌ గురించి మొసలి కన్నీరు కారుస్తూ, డీలిమిటేషన్‌ తదితర బిల్లులు ప్రవేశపెట్టి భంగపాటుకు గురైంది. ముందుగా అఖిలపక్ష సమావేశం జరిపి సంబంధిత బిల్లులను చర్చించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన విజ్ఞప్తిని అప్పుడు, ఇప్పుడు నిరాకరిస్తున్నది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిసి 90 రోజులు దాటినా ప్రోరోగ్‌ చేయకుండా డీలిమిటేషన్‌ బిల్లుకు మెజారిటీ కూడగట్టి సభను సమావేశపరచాలని చూస్తున్నదేగాని ప్రతిపక్షాలతో చర్చించి స్థూల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించటం లేదు. ఇవి మోదీ ప్రభుత్వ ఒంటెత్తు పోకడకు మచ్చుతునకలు.

ఇక, మణిపూర్‌లో మూడేళ్లకు పైబడి సాగుతున్న జాతి కలహాల విషయంలో సకాలంలో ఉన్నతస్థాయి నుంచి జోక్యం లేనందున పరిస్థితి మరింత దిగజారింది. కుకీలు, మైతీల నుంచి జాతివైరం నాగాలకు విస్తరించింది.

ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్మును కేంద్ర పాలిత ప్రాంతంగా దిగజార్చి, లద్ధాక్‌ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం, జమ్మూ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని మూడేళ్లయినా కేంద్ర ప్రభుత్వం అమలు జరపలేదు. టెర్రరిస్టుల బూచిని చూపుతోంది. అదొక శాశ్వత సమస్య. దానితో రాష్ట్ర ప్రతిపత్తిని ముడిపెట్టటం ప్రజల అభిప్రాయాన్ని ఖాతరు చేయకపోవటమే.

లద్ధాక్‌ ప్రజలు శాసనసభతో కూడిన యుటి (ఢిల్లీ, పుదుచ్చేరి లాగా) కోరుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే అభివృద్ధి మండళ్లు, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలంటూ మోదీ ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టిస్తున్నది. కేంద్ర అధికారులు చర్చల్లో అంగీకరించిన విషయాలను కూడా దాటవేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యావేత్త, వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను కొంతకాలం జైల్లో పెట్టి ప్రభుత్వం వ్యతిరేకత కొనితెచ్చుకుంది. ఢిల్లీలో కాక్రోచ్‌ జనతాపార్టీ ఆందోళన సందర్భంలో వారికి సంఘీభావంగా ఆయన నిరాహారదీక్ష జరిపారు. ప్రస్తుతం ఆయన అప్రకటిత గృహనిర్బంధంలో ఉన్నారు. ఎందుకు? హిల్‌ కౌన్సిళ్లు, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల కన్నా ముందు తమ కోర్కెలను అంగీకరించాలని ఆయన ఆందోళన చేస్తున్నారు.

కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (కెడిఎ) సహ అధ్యక్షుడు సజ్జాద్‌ కార్గిలీ, వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని అధికారుల అహంకారపూరిత చర్యగా ఖండించారు. ఆయన్ను కలుసుకోవటానికి ఆయన్ను అనుమతించలేదు. అరెస్టు చేశారా అంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛాయుత సంచారం, ఆయన్ను కలుసుకునేందుకు అనుమతి నిరాకరణ, అరెస్టు చేశారా అని ప్రశ్నిస్తే సమాధానం లేకపోవటాన్ని అప్రజాస్వామికంగా విమర్శించారు. లద్ధాక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సోనం వాంగ్‌చుక్‌పై బిఎన్‌ఎస్‌ఎస్‌ కింద 60 రోజుల నిర్బంధం విధించింది. ఆయన తీవ్రవాది కాదు, టెర్రరిస్టు సానుభూతిపరుడు కాదు. సామాన్య ప్రజాతంత్రవాది. పౌరహక్కుల కోసం తపిస్తున్నాడు. మరి ఎందుకీ నిర్బంధం. అది ప్రజా ఉద్యమాలపట్ల, ప్రజాతంత్రవాదులపట్ల మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం.

ట్యాగ్‌లు: editorial