TG RERA: టైమ్‌కు ఫ్లాట్లు అప్పగించని బిల్డర్లపై టీజీ-రేరా పంజా.. రూ.60.22 లక్షల రిఫండ్‌కు ఆదేశం.. మరో సంస్థకు రూ.20.05 లక్షల జరిమానా!
TG RERA
TG RERA: ఇళ్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు ఆశచూపి, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిబంధనలను ఉల్లంఘించిన నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (టీజీ-రేరా) కొరడా ఝుళిపించింది. నవంబర్ 10వ తేదీన జారీ చేసిన నాలుగు వేర్వేరు ఉత్తర్వుల్లో బాధితులకు న్యాయం చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇద్దరు బిల్డర్లు.. బాధితులకు మొత్తం రూ.60.22 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించగా, మరో సంస్థకు రూ.20.05 లక్షల జరిమానా విధించింది. నాలుగో సంస్థపై జరిమానా విధించే ప్రక్రియను ప్రారంభించింది.
నాలుగు సంస్థలపై తీసుకున్న చర్యల పూర్తి వివరాలు
| సంస్థ పేరు | ప్రాజెక్ట్ & ప్రాంతం | ప్రధాన ఉల్లంఘన | టీజీ-రేరా ఉత్తర్వులు |
| భువన్ తేజా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ | హ్యాపీ హోమ్స్ ఫేజ్-2 | రేరా నమోదు లేకపోవడం; రూ.22.22 లక్షలు వసూలు చేసి ఫ్లాట్ అప్పగించకపోవడం. | పూర్తి సొమ్మును 10.85% వడ్డీతో తిరిగి చెల్లించాలి. |
| జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ | వెస్ట్రన్ వేవ్స్ (నానక్‌రామ్‌గూడ) | అనుమతులు లేకుండా వాణిజ్య యూనిట్ల పేరిట రూ.38 లక్షల వసూలు; నిర్మాణ జాప్యం. | రూ.38 లక్షలను 10.85% వడ్డీతో వాపసు చేయాలి. |
| మోదీ బిల్డర్స్ | గోల్డెన్ కౌంటీ (రాంపల్లి దాయరా) | ప్లాట్ల అనుమతితో విల్లాల ప్రచారం; క్లబ్‌హౌస్, ఇతర వసతులు అసంపూర్తిగా వదిలేయడం. | సంస్థపై రూ.20.05 లక్షల జరిమానా విధింపు. |
| స్టార్‌లైట్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ | స్టార్‌లైట్ సెరెనా (కొండాపూర్) | వివాదాస్పద భూమిని కలుపుకుని, రేరా నమోదు లేకుండానే ప్రాజెక్ట్ ప్రచారం. | సెక్షన్ 59 ప్రకారం జరిమానా ప్రక్రియ ప్రారంభం. |
ఫ్లాట్ ఇవ్వకుండా రూ.22.22 లక్షలు వసూలు : భువన్ తేజా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ‘హ్యాపీ హోమ్స్ ఫేజ్-2’ ప్రాజెక్టులో 2021 అక్టోబరులో వినుకొండ రవి రూ.20.79 లక్షలకు ఫ్లాట్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. 36 నెలల్లో (అదనంగా ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌తో) ఫ్లాట్ అప్పగిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. అయితే, కొవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని నమ్మించి ఫేజ్-1లో మరో ఫ్లాట్ తీసుకోవాలని సూచిస్తూ అదనంగా రూ.1.43 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ.22.22 లక్షలు తీసుకున్నా కనీసం నిర్మాణమే ప్రారంభించలేదు. ఈ ప్రాజెక్టుకు రేరా నమోదు, తగిన అనుమతులు లేవని తేల్చిన అధికారులు, కొనుగోలుదారుడికి మొత్తం డబ్బును 10.85 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేశారు.
వాణిజ్య స్థలం పేరిట రూ.38 లక్షల మోసం: నానక్‌రామ్‌గూడలోని జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ‘వెస్ట్రన్ వేవ్స్’ ప్రాజెక్టులో ముగ్గురు పెట్టుబడిదారులు రూ.38 లక్షలు చెల్లించారు. 500 చదరపు అడుగుల సెమీ ఫినిష్డ్ వాణిజ్య యూనిట్‌తో పాటు 11.5 చదరపు గజాల అవిభాజ్య భూమి వాటాను 2024 డిసెంబరులోగా అప్పగిస్తామని సంస్థ ఒప్పందం చేసుకుని మోసగించింది. రేరా నమోదు లేకుండానే విక్రయాలు జరిపిన ఈ సంస్థపై గతంలోనూ రూ.5 లక్షల జరిమానా విధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజా బాధితులకు రూ.38 లక్షలను 10.85 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని రేరా ఆదేశించింది.
అసంపూర్తి వసతులపై మోదీ బిల్డర్స్‌కు జరిమానా: కీసర మండలం రాంపల్లి దాయరాలోని మోదీ బిల్డర్స్ ‘గోల్డెన్ కౌంటీ’ ప్రాజెక్టులో క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కులు కల్పిస్తామని నమ్మించి 2019–2023 మధ్య ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారు. కానీ, 2021లోనే నివాసాలు మొదలైనా వసతులను అసంపూర్తిగా వదిలేశారని విల్లాల యజమానులు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ, రేరా అనుమతులు కేవలం ప్లాట్ల అభివృద్ధికి మాత్రమే తీసుకొని, విల్లాల ప్రాజెక్టుగా తప్పుదోవ పట్టించే ప్రచారం చేసినందుకు సంస్థకు రూ.20.05 లక్షల జరిమానా విధించారు.
కొండాపూర్ ప్రాజెక్టుపైనా కొరడా: కొండాపూర్‌లోని తమ భూమిని ఆక్రమించుకుని ‘స్టార్‌లైట్ సెరెనా’ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఇచ్చిన ఫిర్యాదుపై టీజీ-రేరా స్పందించింది. ఈ భూమిపై సివిల్ కోర్టుల్లో యాజమాన్య వివాదాలు ఉండటంతో పాటు, రేరా సెక్షన్ 3(1)ను ఉల్లంఘిస్తూ నమోదు లేకుండానే ప్రచారం చేస్తున్న స్టార్‌లైట్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌పై సెక్షన్ 59 కింద జరిమానా విధించేందుకు చర్యలు ప్రారంభించాలని కార్యదర్శిని ఆదేశించింది.