ఆర్థిక లావాదేవీలు… అక్రమ సంబంధాలు.. అడ్డు వస్తే హత్యలు…పెరుగుతున్న హింసాత్మక ధోరణి
ఆర్థిక లావాదేవీలు... అక్రమ సంబంధాలు.. అడ్డు వస్తే హత్యలు...పెరుగుతున్న హింసాత్మక ధోరణి
ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టినవారు దశాబ్దాల పాటు కలిసి పెరిగారు. నాలుగు కుంటల స్థలం కోసం సొంత సోదరున్నే హతమార్చారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రక్త సంబంధాలు, స్నేహితులు, బంధుత్వాలు ఇవేవీ హింసాత్మక చర్యలకు అడ్డుగా నిలవడం లేదు. పట్టుమని 15 ఏళ్లు నిండని ఓ కుర్రాడు 19 సంవత్సరాల వివాహిత అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ చాటు వ్యవహారాన్ని తన స్నేహితుడు చూశాడని కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి హతమార్చారు. ఇటీవల కాలంలో ఏదైనా తేడా వస్తే సంప్రదింపులు, చర్చలు ఏమి ఉండడం లేదు. తేడా వస్తే అడ్డు తొలగించుకోవడమే అన్న భావన రోజు రోజుకు బలపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు మాసాల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 హత్యలు జరిగాయి. ఇవన్నీ ఆర్థిక, అక్రమ సంబంధాల నేపథ్యంలో జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో సగం హత్యలు రక్త సంబంధీకుల మధ్యే జరిగాయి. కొన్ని హత్యలైతే కేవలం మూడు నాలుగు గుంటల భూములు, గెట్టు పంచాయతీలు నేపథ్యంలోనే జరిగాయి. నేలకొండపల్లి మండలంలో ఓ హత్య రెండు స్థలాల మధ్యలో ఉన్న చెట్టు కోసం జరిగిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు.
ఇక భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాల నేపథ్యంలో హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లలను హతమార్చి రోడ్డు ప్రమాదం జరిగిందని భ్రమింపజేసేందుకు ప్రయత్నం చేశాడు. మరికొందరు విషమిచ్చి చంపుతున్నారు. లేకపోతే ప్రియుడినో, ప్రియురాలినో కలుపుకుని హతమారుస్తున్నారు. ఇటీవల తాను వండిన కూర రుచిగా లేదని భర్త అన్నాడని ఏకంగా భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. మైనర్ బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు చివరకు బాలికను నాలుగు అంతస్తుల భవనం పై నుంచి నెట్టివేయడంతో ఇప్పుడు ఆ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. జీవితమంతా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.
కొద్ది రోజుల క్రితం కల్లూరు మండలంలో సంచలనం సృష్టించిన ఓ ఘటన ఇప్పుడు మరింత ఆలోచింపజేస్తుంది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి 19 సంవత్సరాల ఒక వివాహిత మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ బాలునికి 15 సంవత్సరాలు కూడా నిండలేదు. ఆ యువతికి వివాహం కాగా భర్తను వదిలి ఇంటి వద్దనే ఉంటుంది. పదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. వివాహితతో చనువుగా ఉండటాన్ని ఆ విద్యార్థి ప్రాణ స్నేహితుడు చూశాడు. ఈ విషయం పది మందికి చెబుతాడని భావించి ఆ విద్యార్థిని హతమార్చేందుకు ఇద్దరు ఓ ప్రణాళిక రూపొందించారు. కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించి ప్రాణాలు తీశారు. 19 ఏళ్ల యువతి, 15 ఏళ్ల యువకుడు ఇప్పుడు హత్యా నేరం కింద జైలులో ఉన్నారు. ఇటువంటి ఘటనలు పెరుగుతున్న హింసాధోరణికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
క్షణికావేశం కూడా ఈ హింసాత్మక ఘటనలకు కారణమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణుగూరు డిపో కండక్టర్ మృతి విషయంలోనూ క్షణికావేశమే రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. కండక్టర్ ప్రవళిక తండ్రి ఆర్టీసీ ఉద్యోగి. ఆయన మృతిచెందడంతో ఆ కుటుంబ భారాన్ని మోసేందుకు ప్రవళికకు సంస్థ కండక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చింది. విధి నిర్వహణలో ఉండగా చిల్లర విషయంలో వచ్చిన చిన్న తేడాతో ఓ ప్రయాణికురాలికి కండక్టర్‌కు మధ్య ఘర్షణ జరిగింది. పది రూపాయల టికెట్, రూ.100లకు చిల్లర ఈ రెండింటి నేపథ్యంలో ప్రయాణికురాలు కండక్టర్‌ను కిందకు తోసివేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి కండక్టర్‌ను నెట్టి హత్యకు కారణమైనందున ఇప్పుడు జైలుపాలైంది. ఈ క్షణికావేశంలో జరిగే హింసాధోరణిని తగ్గించేందుకు ప్రయత్నం జరగాలి. లేకపోతే కూర్చోవడం, చర్చించుకోవడం, శాంతియుత మార్గాల అనుసరణ మొదలైనవి కనుమరుగై హతమార్చడమే సమస్యకు పరిష్కారం అన్న రీతి ప్రబలుతుంది.
మంత్రగాళ్ల నెపంతో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కాలంలో మంత్రగాళ్ల నెపంతో హత్యలు జరుగుతున్నాయి. ఒక కరకగూడెం మండలంలోనే ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా ఇద్దరిని మంత్రగాళ్లు అన్న నెపంతో హతమార్చారని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు వృద్ధులు ఆళ్లపల్లి మండలంలో దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరిని మంత్రగాళ్లు అనే నెపంతో హతమార్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఐదుగురు వ్యక్తులు పదం మాసయ్య, మడకం భీమయ్య అనే వ్యక్తులను హతమార్చి పూడ్చిపెట్టారు. మడకం భీమయ్య కుమార్తె నందిని ఫిర్యాదుతో ఈ హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక పక్క అక్రమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, మంత్రాల నెపంతో జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలకు స్వస్తి పలకకపోతే ప్రతి ఒక్కరూ భయంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఏ వైపునుంచి ప్రమాదం వస్తుందో తెలుసుకోలేని స్థితి. తస్మాత్ జాగ్రత్త.