Air Pollution Row: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేస్తున్నారు..కేంద్రంపై విరుచుకుపడిన మల్లికార్జున ఖర్గే..
Mallikarjun Kharge: రాష్ట్రపతి, సీజేఐకి కూడా లేని రక్షణ ఎన్నికల కమిషనర్‌కు ఎందుకు? కేంద్రంపై ఖర్గే ప్రశ్నలు
Air Pollution Row: దేశవ్యాప్తంగా రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న వాయు కాలుష్యంపై.. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలనలో కాలుష్య నియంత్రణకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఉత్తుత్తి ప్రచార ఆర్భాటాలు, వాగ్దానాలు , ఎదుటివారిపై నిందారోపణలకే పరిమితమయ్యారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
గతేడాది కాలుష్య తీవ్రతను దాచిపెట్టేందుకు ఏక్యూఐ (AQI) పర్యవేక్షణ కేంద్రాల చుట్టూ నీటిని స్ప్రే చేశారని.. ఈసారి ఏకంగా 36 కేంద్రాల్లో పీఎం2.5 (PM2.5) రీడింగ్స్ కనిపించకుండా పోయేలా చేశారని ఖర్గే విమర్శించారు. 2019లోనే వాయు కాలుష్యాన్ని దేశానికి ప్రధాన సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నప్పటికీ.. ఆయన సుదీర్ఘ పాలనలో ఆశించిన స్థాయి చర్యలు మాత్రం శూన్యమని వ్యాఖ్యానించారు.
మనుషుల ప్రాణాలపై కాలుష్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఖర్గే పలు కీలక గణాంకాలను ప్రస్తావించారు. ఢిల్లీలో 2023 ఒక్క సంవత్సరంలోనే కాలుష్యం కారణంగా ఏకంగా 17,188 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతకుముందు 2021 నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల్లో 1.69 లక్షల మరణాలు కాలుష్యం మూలంగానే నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణ కోసం కేటాయించిన క్లీన్ ఎయిర్ నిధుల్లో ఢిల్లీకి చెందిన రూ.1,154 కోట్లను ఖర్చు చేయకుండా నిరుపయోగంగా వదిలేశారని, ఇప్పటివరకు అందులో కేవలం 17 శాతం నిధులను మాత్రమే వినియోగించారని ఆయన ఎండగట్టారు.
కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసి కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంతో పాటు సంబంధిత నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయాలని మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన గాలిని పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే దానమో లేదా వరమో కాదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో క్రమంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత, దానివల్ల ప్రజారోగ్యానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.