Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Train Passengers Alert: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు..

jagan 10 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Train Passengers Alert: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు..

Train Passengers Alert:

Train Passengers Alert: అత్యంత రద్దీగా ఉండే గూడూరు-రేణిగుంట-తిరుపతి సెక్షన్‌లో యార్డు రీమోడలింగ్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతుండటంతో రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వేతో పాటు వివిధ జోన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆధునికీకరణ పనుల కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారిమళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రైల్వే భద్రతను మెరుగుపరచడం , రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల వల్ల సుమారు ఒకటిన్నర నెలల పాటు సాధారణ ప్రయాణికులతో పాటు తిరుపతికి వచ్చే భక్తులకు తీవ్ర అసౌకర్యం కలగనుంది. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సరిచూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

రద్దయిన ప్రధాన రైళ్ల వివరాలు పరిశీలిస్తే.. చెన్నై-తిరుపతి మధ్య నడిచే ప్రతిష్టాత్మక సప్తగిరి ఎక్స్‌ప్రెస్ దాదాపు 27 రోజుల పాటు రద్దు కానుంది. తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 9 నుంచి 26 వరకు అందుబాటులో ఉండదు. తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 12-14, 19-21, 26-27 తేదీల్లో రద్దయింది. రేణిగుంట-మైసూరు ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 11, 12, 18, 19, 25 తేదీలతో పాటు సంబంధిత తిరుగు ప్రయాణ రోజుల్లో నిలిచిపోనుంది. వీటితో పాటు తిరుచానూరు నుంచి నాందేడ్, జాల్నా, కాచిగూడ-చర్లపల్లి తదితర మార్గాల్లో నడిచే పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిర్దిష్ట తేదీల్లో రద్దయ్యాయి. ఇక కడప-అరక్కోణం, తిరుచానూరు-అరక్కోణం, చెన్నై-తిరుచానూరు, గూడూరు-రేణిగుంట, నెల్లూరు-రేణిగుంట మార్గాల్లో నడిచే సాధారణ ప్యాసింజర్ రైళ్లు దాదాపు 48 రోజుల పాటు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

మరోవైపు.. ముంబై, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుంచి రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించే దాదాపు 50 నుంచి 73 ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. ముంబై, చెన్నై వైపు వెళ్లే రైళ్లను గుత్తి-అనంతపురం-ధర్మవరం మార్గంలోనూ, గూడూరు-చెన్నై వైపు వెళ్లే రైళ్లను సూళ్లూరుపేట మీదుగానూ నడిపిస్తున్నారు. కొన్ని ప్రధాన సర్వీసులను అరక్కోణం, పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం మార్గాల ద్వారా దారిమళ్లించారు. రైళ్లు దారిమళ్లడం వల్ల రేణిగుంటతో పాటు మార్గమధ్యంలోని కొన్ని సాధారణ స్టేషన్లలో ఆయా రైళ్లకు హాల్టింగ్ ఉండదని స్పష్టం చేశారు.

ఈ రద్దులు, దారిమళ్లింపుల నేపథ్యంలో స్టేషన్లకు బయలుదేరే ముందే ప్రయాణికులు తమ రైలు తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే అధికారిక వెబ్‌సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలో రైళ్ల వేగం, నిర్వహణ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడతాయని రైల్వే వర్గాలు తెలిపాయి.