E20 Petrol Row: E20 కాస్తా 420గా మారింది.. పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ కల్తీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Rahul Gandhi
E20 Petrol Row: దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలుపుతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన అధికారిక ల్యాబొరేటరీ పరీక్షల నివేదికలను ఉటంకిస్తూ శనివారం ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “E20 కాస్తా 420గా మారింది – నిత్యం ప్రజల కార్లు, వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారని విమర్శించిన ఆయన.. చమురు సంస్థల నాణ్యతా పరీక్షల్లో పారదర్శకత లేకపోవడాన్ని తప్పుపట్టారు.
ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు – 31% దాటిన ఇథనాల్ మోతాదు
కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల (బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు) నుంచి సేకరించిన 14 పెట్రోల్ శాంపిల్స్‌ను ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షించగా 11 శాంపిల్స్‌లో పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు తేలింది.
వివిధ చమురు కంపెనీల శాంపిల్స్‌లో నమోదైన ఇథనాల్ శాతాల వివరాలు:
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL): అత్యధికంగా 31.2% ఇథనాల్ నమోదు.
- హిందుస్థాన్ పెట్రోలియం (HPCL): 30.5% ఇథనాల్ నమోదు.
- BPCL, నయారా ఎనర్జీ, షెల్ (Shell): శాంపిల్స్‌లో 25.5% నుంచి 26.5% వరకు ఇథనాల్ నమోదు.
మొదట ఈ శాంపిల్స్‌ను ఆయిల్ కంపెనీల సొంత ల్యాబ్‌లకు పంపగా వారు ఫలితాలు వెల్లడించకపోవడంతోనే స్వతంత్ర ల్యాబ్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ దారుణంగా పడిపోవడమే కాకుండా ఇంజిన్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోపణలను తిరస్కరించిన చమురు సంస్థలు
రాహుల్ గాంధీ, కర్ణాటక ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సహా ప్రధాన చమురు కంపెనీలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటక ప్రభుత్వం శాంపిల్స్ సేకరించిన విధానం, పరీక్షించిన తీరు ప్రామాణిక చట్టబద్ధ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని ఆక్షేపించాయి.
దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన జాయింట్ క్వాలిటీ మానిటరింగ్‌లో 893 శాంపిల్స్‌ను పరీక్షించామని, అందులో కర్ణాటకలోని 56 శాంపిల్స్ కూడా ఉన్నాయని ఓఎమ్‌సీలు స్పష్టం చేశాయి. ఈ పరీక్షల్లో ఇథనాల్ మోతాదు 19% నుంచి 21% మధ్యలోనే నమోదైందని, కర్ణాటక శాంపిల్స్ సగటు కేవలం 19.3% మాత్రమేనని తెలిపాయి. ఈ రాజకీయ వివాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న E20 ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం మరియు వినియోగదారుల వాహనాల భద్రతపై దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.