US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల చరిత్రాత్మక విజయం.. తొలి ముస్లిం సెనేటర్, తొలి నల్లజాతి మహిళా గవర్నర్..
US Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో 57 మంది భారతీయ అమెరికన్లు.. కీలక పదవుల కోసం పోటీ!
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికలు దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలగా.. డెమోక్రాట్లు పలు రాష్ట్రాల్లో సంచలన విజయాలు సాధించారు. సంప్రదాయంగా రిపబ్లికన్లకు పట్టున్న ప్రాంతాల్లోనూ పాగా వేసి తమ సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు చారిత్రక విజయాలు నమోదు చేశారు. అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం సభ్యుడిగా ఎల్-సయీద్ ఎన్నికవగా, తొలి బహిరంగ స్వలింగ సంపర్కుడైన పురుష సెనేటర్‌గా క్రిస్ పప్పాస్ విజయం సాధించారు. మరోవైపు జార్జియాలో తొలి నల్లజాతి మహిళా గవర్నర్, న్యూ మెక్సికోలో తొలి స్థానిక అమెరికన్ మహిళా గవర్నర్ ఎన్నికయ్యారు.
ట్రంప్‌కు షాక్.. రిపబ్లికన్లకు భారీ ఎదురుదెబ్బ
నవంబర్ 3న జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో వైట్‌హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్ట్ రూమ్‌లో కూర్చొని ఫలితాలను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు మూడు గంటల పాటు ఆయన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. డెమోక్రాట్లు వరుస విజయాలు సాధిస్తుండటంతో చివరకు రాత్రి 10.30 గంటల తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను కూడా ఎన్నికల బరిలో ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ మెజారిటీతో గెలిచేవారని పేర్కొన్నారు. ‘నేను బ్యాలెట్‌పై లేను. ఒకవేళ పోటీ చేసి ఉంటే మేము భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం’ అంటూ పోస్ట్ చేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అమెరికా చరిత్రలో తొలిసారిగా కీలక పదవుల్లో మహిళలు, మైనారిటీలు
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాల కంటే చారిత్రకంగా నమోదైన కొన్ని ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిచిగన్ నుంచి ఎల్-సయీద్ అమెరికా సెనేట్‌కు ఎన్నికై తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. న్యూ హాంప్‌షైర్‌లో క్రిస్ పప్పాస్ విజయం సాధించి అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి బహిరంగ స్వలింగ సంపర్కుడైన పురుషుడిగా గుర్తింపు పొందారు.
జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్ గవర్నర్‌గా ఎన్నికై అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. న్యూ మెక్సికోలో డెమోక్రటిక్ అభ్యర్థి డెబ్ హాలాండ్ విజయం సాధించి గవర్నర్‌గా ఎన్నికైన తొలి స్థానిక అమెరికన్ మహిళగా నిలిచారు.
ఇక అమెరికా చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు నల్లజాతి అభ్యర్థులు మాత్రమే గవర్నర్లుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఏకంగా నలుగురు నల్లజాతి అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. మరికొన్ని స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల విశ్లేషణలు పేర్కొన్నాయి.
రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు సాధించిన విజయాల్లో మరో కీలక అంశం సంప్రదాయంగా రిపబ్లికన్లకు బలమున్న రాష్ట్రాల్లోనూ గెలుపొందడం. కాన్సాస్‌లో ఏకంగా 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి సెనేట్‌కు ఎన్నికయ్యారు. టెక్సాస్‌లో జేమ్స్ తలారికో విజయం సాధించి 1988 తర్వాత ఆ రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలిచారు.
టెక్సాస్‌లో గినా హినోజోసా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. దీంతో మూడు దశాబ్దాలకు పైగా రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉన్న ఆ రాష్ట్రంలో డెమోక్రాట్లు తిరిగి గవర్నర్ పదవిని దక్కించుకున్నారు. అంతేకాకుండా టెక్సాస్‌కు తొలి లాటినా గవర్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
దక్షిణ కరోలినాలోనూ డెమోక్రాట్లు కీలక విజయం సాధించారు. 1960లలో స్ట్రోమ్ థర్మండ్ పార్టీ మారిన తర్వాత రిపబ్లికన్ల ఆధీనంలోనే ఉన్న సెనేట్ స్థానాన్ని ఈసారి డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో డెమోక్రటిక్ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్ విజయం సాధించారు. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహం సోదరి డార్లీన్ గ్రాహంను ఆమె ఓడించారు. ఈ స్థానానికి డార్లీన్ గ్రాహంకు ట్రంప్ మద్దతు ప్రకటించడం గమనార్హం.
ఒహియోలో వివేక్ రామస్వామికి పరాజయం
ఒహియో ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు మద్దతుగా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డెమోక్రటిక్ ప్రత్యర్థి అమీ ఆక్టన్‌కు సంబంధించిన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ రామస్వామి ప్రచారంలో విడుదల చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమైంది. ఆ ప్రకటనపై విమర్శలు వచ్చినప్పటికీ దాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించకుండా ట్రంప్, వాన్స్ సమర్థించడం చర్చనీయాంశమైంది. అలాంటి ప్రకటననే తాను కూడా ఉపయోగించేవాడినని ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు రామస్వామి ఘోర పరాజయాన్ని చవిచూశారు.
మరోవైపు అయోవా, మిచిగన్, మిన్నెసోటా, ఒహియో రాష్ట్రాల్లో గవర్నర్ పదవితో పాటు సెనేట్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించారు. మొత్తంగా ఈ ఎన్నికలు అమెరికా రాజకీయాల్లో డెమోక్రాట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు.. ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి హెచ్చరికగా మారాయి. మైనారిటీలు, మహిళలకు కీలక పదవుల్లో ప్రాతినిధ్యం పెరగడం కూడా ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది.