ఢిల్లీలో రాంలీలా మైదాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి భారీ ర్యాలీ
ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా విపక్షాలు ఈ సభను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నాయి.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ తదితరులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం రాంలీలా మైదాన్‌లో జరగనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బయలుదేరారు.
రైళ్లు ఆపినా వెనక్కి తగ్గలేదు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నుంచి ఢిల్లీకి రావాలనుకున్న సుమారు 17 వేల మందికి ప్రత్యేక రైళ్లు కేటాయించకుండా చివరి నిమిషంలో నిరాకరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైళ్లను నిలిపివేసినా, రవాణా పరంగా ఇబ్బందులు సృష్టించినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వేలాది మంది ఢిల్లీకి తరలివచ్చారని పేర్కొన్నారు.
రాంలీలా మైదాన్‌లో ఓటు చోరీపై పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల ఓట్లను తొలగిస్తున్నారని, మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రావణుడి వంటి మోదీని ఓడించేందుకు తమ వానర సైన్యం ఢిల్లీకి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రైళ్లు ఆపినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని, వారందరి పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు.
పేదల ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీఎం అన్నారు. ఈ పోరాటంలో అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ భవన్ వేదికగా పిలుపునిచ్చారు.
ఢిల్లీ వీధుల్లో ‘చలో ఢిల్లీ’ నినాదాలు
మరోవైపు, ఆదివారం ఉదయం ఢిల్లీలోని కనాట్ ప్లేస్ పరిసరాల్లో ‘చలో ఢిల్లీ’ ర్యాలీ సందడి కనిపించింది. దీపావళికి ముందు ఆదివారం కావడంతో సాధారణంగా ఉండే రద్దీ కంటే రోడ్లపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయి. ఉదయం 11 గంటల సమయానికి దుకాణాలు తెరుచుకుంటుండగా, ర్యాలీలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గుంపులుగా మింటో రోడ్ వైపు కదిలారు.
వారిలో కొందరు జాతీయ జెండాలు పట్టుకోగా, ఎక్కువ మంది త్రివర్ణ పతాకం రంగులతో కూడిన కండువాలు ధరించారు. నినాదాలు చేస్తూ రాంలీలా మైదాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ టోపీలు, రాజస్థాన్ తలపాగాలు, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల ఎర్ర టోపీలు, తమిళనాడుకు చెందిన నాయకుల తెల్లటి దుస్తులు ఇలా వివిధ రాష్ట్రాల సంస్కృతులు ఢిల్లీ వీధుల్లో కనిపించాయి. ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చిన విపక్ష శ్రేణుల ఐక్యత ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది.
మింటో రోడ్ వైపు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఐటీఓ కూడలి వద్ద ట్రాఫిక్‌ను మళ్లించారు. రాహుల్ గాంధీ ఫొటోలు, ‘ఢిల్లీ చలో’ స్టిక్కర్లు ఉన్న వాహనాలను బహదూర్ షా జఫర్ మార్గ్ వైపు మళ్లించారు. మరోవైపు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలు మింటో రోడ్ వద్దకు చేరుకుని ఇండియా కూటమి నేతలతో కలిసి రాంలీలా మైదాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఆయనపై ప్రతీకాత్మకంగా ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం నిర్వహించిన విపక్షాలు, ఆదివారం ర్యాలీ ద్వారా తమ నిరసనను మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ర్యాలీకి నిర్వాహకులు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండగా, ఢిల్లీ పోలీసులు సుమారు 50 వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ జనసందోహం నేపథ్యంలో పోలీసులు భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ వీధుల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్, ఇండియా కూటమి కార్యకర్తల నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.