Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నాహాలు.. డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లులే అజెండా..
Parliament Monsoon Session
Parliament Special Session: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మహిళా రిజర్వేషన్లు , లోక్సభ, రాష్ట్రాల శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) రాజ్యాంగ సవరణ బిల్లులను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక బిల్లులను లోక్సభలో ఆమోదింపజేసేందుకు అవసరమైన పూర్తి మూడింట రెండొంతుల బలం తమకు ఉందనే ధీమాతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో లోపాలు, అక్రమాలు జరిగాయంటూ అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ కీలక ప్రతిపాదిత బిల్లులకు విస్తృత ఆమోదం లభించేలా ప్రతిపక్ష పార్టీలతో కూడా కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సమగ్ర అమలుకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో అవసరమైన మెజారిటీ లభించక వీగిపోయిన సంగతి తెలిసిందే. నాటి ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో సభలో నిలవలేకపోయింది. దీంతో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టి బిల్లును సభలో ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ (Special Majority) సాధించడం అనివార్యం. లోక్సభలో మొత్తం 540 మంది సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో, హాజరై ఓటు వేసే సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమీకరణ ప్రకారం సుమారు 360 మంది ఎంపీల మద్దతు కేంద్రానికి అత్యంత కీలకం కానుంది. ఎన్డీయే (NDA) కూటమికి లోక్సభలో సొంతంగా స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల సంఖ్యాబలాన్ని సాధించడం ప్రభుత్వానికి పెను సవాలుగానే మారింది. అయితే, ఇటీవల మారిన రాజకీయ సమీకరణలతో తమ బలం మరింత పెరిగిందని అధికార పక్ష వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపీలు తమ వైఖరి మార్చుకుని ప్రభుత్వ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు సుముఖత చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తుది స్పష్టత సభలో ప్రత్యక్ష ఓటింగ్ సమయంలోనే రానుంది.
ఈ బిల్లులకు గరిష్ఠంగా మద్దతు కూడగట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం డీఎంకే (DMK) పార్టీతో లోతైన చర్చలు జరుపుతోంది. ఇటీవల తమిళనాడు స్థానిక ఎన్నికల తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీతో విబేధాలు రావడంతో డీఎంకే ‘ఇండియా’ (INDIA) కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మారుతున్న సమీకరణల నేపథ్యంలో డీఎంకేతో జరుపుతున్న సంప్రదింపులకు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత ఏర్పడింది. వీటితో పాటు పార్లమెంట్లోని పలు ప్రాంతీయ, చిన్న ప్రతిపక్ష పార్టీల మద్దతు కోసం కూడా ప్రభుత్వం రాయబారాలు నడుపుతోంది.
గత ఆగస్టు 13న ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రొరోగేషన్ (Prorogation) ప్రకటించకపోవడంతో, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రత్యేక సమావేశాలను పిలిచేందుకు సాంకేతిక వెసులుబాటు ఉంది. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో నిర్వహించతలపెట్టిన 12వ బ్రిక్స్ (BRICS) పార్లమెంటరీ ఫోరమ్ సదస్సును దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక సమావేశాల ఖచ్చితమైన తేదీలను కేంద్రం ఖరారు చేయనుంది. సమావేశాలు ప్రారంభం కావడానికి కనీసం వారం రోజుల ముందే ఎంపీలకు అధికారిక నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.