Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఓట్ల తొలగింపుకు ఎన్నో కుతంత్రాలు

Prajapaksham 06 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఓట్ల తొలగింపుకు ఎన్నో కుతంత్రాలు

Telangana SIR

అధికారంలో ఉన్నవారు ఓటర్ల అభిమానాన్ని చూరగొని కాకుండా తమకు ఓటు చేయరని అనుమానమున్న వేల ఓట్లను ఓటరు జాబితానుంచి తొలగించి ఎన్నికలలో విజయం, తద్వారా అధికారం సంపాదించే దుర్మార్గమైన, దేశ ద్రోహ కళను అభివృద్ధి చేసినట్లున్నారు. బిజెపి వారు ఇందులో ఆరితేరినట్లు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి సంవత్సరం పైబడి నెత్తీనోరు బాదుకుంటున్నాడు. అంతకన్నా పెద్ద నోర్లుగల బిజెపి నాయకులు, అధికార ప్రతినిధులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి కూడా రాజకీయ నాయకునిలా రాహుల్‌ వాదనలను త్రోసిపుచ్చటం మినహా ఏ ఒక్క నిర్దిష్ట ఆరోపణపైనా విచారణకు ఆదేశించకపోవడం గమనార్హం. క్రితం ఎన్నికల్లో 5వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లను గుర్తించి, కొన్ని వేల ఓట్ల తొలగింపునకై ఫారం గుండుగుత్తగా సమర్పించటం, మరికొన్ని వేల ఓటర్లను పక్క జిల్లాలు, రాష్ట్రాలనుంచి చేర్పుతూ ఫారం సమర్పించటం, ఎన్నికల అధికారులు విచారణ లేకుండా ఆ మార్పులను జాబితాల కెక్కించటం తద్వారా మైనారిటీని మెజారిటీగా మార్చుకుని సీటు గెలుచుకోవటం బిజెపి వారు అనుసరించిన తంత్రం. సోషల్‌ మీడియా నిర్వహణకే కాదు, ఎన్నికలో ‘ఓటు చోరీ’కి కూడా ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారని అర్ధమవుతున్నది. మహారాష్ట్ర ఇందుకు తిరుగులేని ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆరునెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 16లక్షలకు పైగా ఓటర్లు పెరిగారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్షం అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడింది అధికారం బిజెపి కూటమి చేతికి అందింది. ఇటీవల ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన ‘సర్‌’లో అన్ని రాష్ట్రాల కన్న మిన్నగా 2కోట్లకు పైగా ఓట్లు తగ్గిపోయాయి.
తాజాగా 30రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముగిసిన, ముగింపు దశలో ఉన్న ఓటర్ల జాబితాల ప్రక్షాళన (సర్‌)లో 13 కోట్లకు పైగా ఓటర్ల తొలగింపు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలపై ఆరోపణలు, సుప్రీంకోర్టులో కేసులు, రెండోవైపున ఆయన రాజీనామా చేయాలని లేదా బర్తరఫ్‌ కోరుతూ ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు, వెలుపల ఉన్న ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, స్వతంత్ర ప్రజా, పౌర సంఘాలు, సిజెపి సాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో బిజెపి ఎన్నికల కమిషన్‌ను వెనకేసుకు రావటం సిఇసితో దాని బంధాన్ని బహిర్గతం చేస్తున్నది. సర్‌ ముగిసిన రాష్ట్రాల్లో ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆక్షేపణలు ఏలాగూ ఉండగా, ఆ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ‘అభ్యంతరాలు ఫిర్యాదుల’ సమయాన్ని ఉపయోగించుకుని బిజెపి వారు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు ఫారం పత్రాలు గుండుగుత్తగా సమర్పించిన, సిద్ధం చేసిన ఉదంతాలు కర్నాటక, హైదరాబాద్‌లలో వెలుగులోకి వచ్చాయి.
కర్నాటకలోని బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 7,561ఓట్ల తొలగింపునకు బిజెపికి చెందిన బిఎల్‌ఎ టి.శ్రీనివాస మోత్కూర్‌ తీవ్ర ప్రయత్నం చేసినట్లు బయటపడింది. ఆ ఓటర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నారు. కాగా వారు “వారి చిరునామాల్లో లేరు, వేరే చోటకు నివాసం మార్చారు” అని ఆరోపణ చేస్తూ, వారు పేర్లు తొలగించాలని ఫారం దరఖాస్తులు దాఖలు చేయగా ఎన్నికల అధికారి త్రోసిపుచ్చారు. మళ్లీ అభ్యంతరాలు దాఖలు చేస్తూ ‘రివిజన్‌’ కోరాడు. కాంగ్రెస్‌ బిఎల్‌ఎ ఫిర్యాదుపై అక్టోబర్‌ 1న బ్రూస్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అంతకుముందు నమోదైన ఐదు ఎఫ్‌ఐఆర్‌లలో బెళగావిలో 2, మైసూర్‌లో ఒకటిలో బిజెపి సభ్యులు నిందితులు. ఇదిలావుండగా, విజయపురలో కొందరు అభ్యంతరపరులు తప్పుడు మరణ సర్టిఫికేట్‌లు సంపాదించి ఓటర్ల తొలగింపును కోరారు. వాటిపై సంబంధిత అధికారి సంతకం లేదు. ఆ విషయం తెలిసి కనీసం 8మంది తాము బతికే ఉన్నామని, తప్పుడు మరణ సర్టిఫికేట్‌లు సృష్టించిన వారిని శిక్షించాలని జిల్లా ఎన్నికల అధికారిని శనివారంనాడు స్వయంగా హాజరై కోరారు. ఇది బహిష్కరించబడిన బిజెపి ఎంఎల్‌ఎ బసన్‌గౌడ పాటిల్‌ యత్‌నాల్‌ అనుయాయుల పనిగా కాంగ్రెస్‌ వారు కనుగొన్నారు. వారు తొలగింపు కోరిన వారంతా ముస్లిం ఓటర్లు. బిజాపూర్‌ సిటీ నియోజకవర్గంలో సుమారు 1046 మంది మైనారిటీల ఓట్లను తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలతో తొలగించేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ ముష్రిఫ్‌ చెప్పారు.
మైనారిటీల ఓట్ల తొలగింపు ప్రయత్నాల కలకలం మన హైదరాబాద్‌నూ తాకింది. బహదుర్‌పుర, ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నం జరిగినట్లు బయటపడిన ప్రీ ఫారం పత్రాలు తెలియజేస్తున్నాయి. దీంతో మైనారిటీల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటన తొలుత అక్టోబర్‌ 1న ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బహిర్గతమైంది. మొత్తం 31 ఓటర్ల పేర్లు తొలగింపును కోరుతూ బిజెపికి చెందిన బూత్‌స్థాయి ఏజంట్‌ ప్రి దరఖాస్తులు దాఖలు చేశాడు. వారిలో కాంగ్రెస్‌ పార్టీ బిఎల్‌ఎ, ఆయన కుటుంబ సభ్యులు ఉండటం ఆసక్తిదాయకం. దీంతో టిపిసిసి ఎలక్షన్‌ సెల్‌ అన్ని నియోజకవర్గాల్లో దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నంపై ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ అగ్గిమీద గుగ్గిలమైనారు. మైనారిటీల ఓట్లు తొలగించటం జరిగితే జంతర్‌మంతర్‌ను మించిన ఆందోళన హైదరాబాద్‌ లో జరుగుతుందని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ‘సర్‌’ను సమర్థిస్తూ తప్పులు జరిగితే కోర్టుకు వెళ్లమని ఒవైసీకి సలహా ఇచ్చారు.
ఇటువంటివి చెదురుమదురు ఘటనలుగా, ఆకతాయి చేష్టలుగా భావించకూడదు. సర్‌ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితాల ప్రచురణ తదుపరి అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు తమ పేర్లను తనిఖీ చేసుకుని, తప్పులు జరిగినచోట దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తరువాత చింతించి లాభం ఉండదు. మీ ఓటును మీరు కాపాడుకోవలసిందే!

ట్యాగ్‌లు: editorial SIR SIR issue SIR News