Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Chalasani Jagannatha Rao: నూరేళ్ల వయసులోనూ ప్రజల కోసమే పోరాటం.. చలసాని జగన్నాథరావు విప్లవ ప్రస్థానం

Prajapaksham 04 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Chalasani Jagannatha Rao: నూరేళ్ల వయసులోనూ ప్రజల కోసమే పోరాటం.. చలసాని జగన్నాథరావు విప్లవ ప్రస్థానం

Chalasani Jagannatha Rao : పేదల హక్కుల కోసం దశాబ్దాల పాటు పోరాడిన సీనియర్ కమ్యూనిస్టు చలసాని జగన్నాథరావు

Chalasani Jagannatha Rao: చలసాని జగన్నాథరావు శత వసంతోత్సవం సందర్భంగా ఆయన కమ్యూనిస్టు ప్రస్థానం, భూ పోరాటాలు, పేదల కోసం చేసిన ఉద్యమాలు, జీవిత విశేషాలు.

రచయిత: మోదుమూడి మురళీకృష్ణ

Chalasani Jagannatha Rao: విప్లవం ఆయన సొంత ఊరు… ఉద్యమం ఆయన ఇంటిపేరు… సమసమాజ నిర్మాణమే ఆయన ధ్యేయం… నవ సమాజ చైతన్యమే ఆయన లక్ష్యం. నిండు నూరేళ్ల వయసులోనూ పేదప్రజల అభ్యున్నతే ఆయన తలంపు. సహృదయత, నిరాడంబరత, వినమ్రత ఈ మూడు స్వాభావిక లక్షణాలకు కమ్యూనిస్టు నిబద్ధత తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి చక్కనైన ఉదాహరణే ఆయన.

ఆయన ఎవరో కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత సీనియర్ కమ్యూనిస్టు చలసాని జగన్నాథరావు. భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల అభ్యున్నతి కోసం నూరేళ్ల జీవితంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా పోరాడిన ఉత్తమ కమ్యూనిస్టు. చిత్తశుద్ధి, నిబద్ధత, నిస్వార్థతకు ఆయన నమూనా. ఆయనది అత్యంత సాధారణమైన జీవనశైలి, నిరాడంబరతకు మారుపేరు.

ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. కమ్యూనిస్టు నైతిక విలువలకు ఆయన సజీవమైన నిలువుటద్దం. అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి, ఆచరించిన కమ్యూనిస్టు నైతిక విలువలు నేటి తరానికి పునరుత్తేజం కలిగిస్తాయి.

భూస్వామ్య వ్యవస్థ భూస్థాపితం కావాలి. దోపిడీ పీడన పీచమణచాలి. సమసమాజాన్ని సృష్టించే విప్లవం వర్ధిల్లాలి అన్న దృఢసంకల్పంతో చలసాని జగన్నాథరావు మొక్కవోని దీక్షతో పనిచేశారు. పల్లెల్లో ఫ్యూడల్ రాక్షసత్వాన్ని అంతం చేయాలి… పేద ప్రజలు, రైతులకు అండగా నిలబడాలన్నదే ఆయన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు అలుపెరగని పోరు సల్పారు.

నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యంగా నూజివీడు ప్రాంతం, ఇతర ప్రాంతాలలో వేలాది మంది సొంత గూడులో నివసిస్తున్నారంటే, బంజరు, అటవీ బంజరు, పోడు భూములను సాగుచేసుకుంటున్నారంటే ఆ అవిశ్రాంత పోరాట ఫలితమే. 1948-51 మధ్య అజ్ఞాత జీవితం గడిపి సాయుధ దళంలో సభ్యునిగా ఉన్నారు. అనేకసార్లు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మహత్తర పోరాట చరిత్ర కలిగిన చలసాని జగన్నాథరావు త్వరలో 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శత వసంతోత్సవం అక్టోబరు 4 (ఆదివారం) నూజివీడులో జరుగుతున్న సందర్భంగా “మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి అంటే జగన్నాథరావులా” అనేలా ఆచరణవాదిగా నిలిచిన ఆ విప్లవకారుడి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

జీవిత విశేషాలు
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన 17 మాసాల తరువాత ఆయన జన్మించారు. నూజివీడు తాలూకా అన్నవరం శివారు వెంకటాద్రిపురం గ్రామంలో చలసాని వెంకట్రామయ్య, వెంకట నర్సమ్మ 7వ సంతానంగా 1927లో చలసాని జగన్నాథరావు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం.

తన రెండో సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు చలసాని రాజగోపాలరావు స్ఫూర్తితో చలసాని జగన్నాథరావు 1946 ఏప్రిల్ 24న నూజివీడు తాలూకా అన్నవరం గ్రామ శాఖలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించి ఇప్పటికి 80 సంవత్సరాల 5 మాసాలు గడిచింది.

నూరేళ్ల వయస్సులో సైతం ఈయన క్రమం తప్పకుండా విశాలాంధ్ర పత్రిక చదువుతారు. విశాలాంధ్ర పుట్టిన 1952 నుంచి విశాలాంధ్ర పత్రిక చందాదారులు.

కమ్యూనిస్టు పార్టీ అన్నవరం గ్రామ శాఖ కార్యదర్శితో ప్రారంభించి, తాలూకా పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ, కార్యదర్శివర్గ సభ్యునిగా, పాతికేళ్ల పాటు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యునిగా, కొంతకాలం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శిగాను జగన్నాథరావు చేశారు.

కృష్ణా జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర రైతు సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. జగన్నాథరావు తాను కమ్యూనిస్టుగా పార్టీకి అంకితం కావటమే కాకుండా తన భార్య, పిల్లలను సైతం పార్టీ హోల్ టైమర్లుగా తీర్చిదిద్దారు.

ఆయన భార్య చలసాని జయప్రద కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం నూజివీడు పట్టణంలోని వారి స్వగృహంలో పెద్ద కుమారుడు, కమ్యూనిజం మాసపత్రిక సంపాదకుడు చలసాని వెంకట రామారావు, కృష్ణ తులసి దంపతుల సంరక్షణలో ఉన్నారు.

భూమి కోసం భుక్తి కోసం

అంటరానితనం, పెత్తందార్ల రాజ్యం, దళితులు గ్రామంలోకి రాకుండా కట్టడి చేసే, ఊరు బావుల్లో నీళ్లు తెచ్చుకోనివ్వకపోవడానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు.

కొన్ని గ్రామాలలో మొఖాసాదార్లదే పెత్తనం. వారు చెప్పిందే వేదం. గ్రామంలో హరిజనులు చెప్పులతో వెళ్లరాదు. చుట్ట తాగటం, తలగుడ్డ చుట్టుకోవటం కూడా నేరమే. రైతుల దొడ్లలోని చింత, మునగ చెట్లపైన హక్కు మొఖాసాదార్లదే. ఫలసాయం వారే తీసుకువెళ్లేవారు.

మొఖాసాదార్ల కచేరీ ముందు ఎవరు గొడుగు, చెప్పులు వేసుకువెళ్లకూడదు. వారి పొలం తడిస్తేనే రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చేవారు. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించాలి అనే ధోరణిని తీవ్రంగా ప్రతిఘటించారు. నిర్బంధ శిస్తు వసూళ్లను వ్యతిరేకించారు.

ఫ్యూడల్ జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నూజివీడు ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ‘దున్నే వాడికే భూమి’ నినాదంతో భూమి కోసం భుక్తి కోసం ఉద్యమాలను ప్రారంభించింది.

1955 నుంచి సీపీఐ అగ్రనాయకులు అమరజీవి దాసరి నాగభూషణరావు నేతృత్వంలో సాగిన భూమి పంపిణీ కార్యక్రమాలన్నింటిలో జగన్నాథరావు అగ్రభాగంలో నిలిచారు. ఈ భూమి పంపిణీ కార్యక్రమం 1962 నుంచి దశాబ్దాల కాలం పాటు నిరంతరాయంగా కొనసాగింది.

ఈ క్రమంలో తాలూకా పార్టీ జగన్నాథరావు నేతృత్వంలో 20 వేలకు పైగా ఎకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ చేసి, అందులో రెండు దఫాలుగా 14 వేల ఎకరాలకు పట్టాలు సాధించారు. ఈ పోరాటంలో రోజుల తరబడి సత్యాగ్రహాలు నిర్వహించారు. ఈ క్రమంలో అనేకసార్లు అరెస్టులు, లాఠీచార్జీలు జరిగాయి.

దిగవల్లి ఖండ్రికలో ఎలమర్రు ఎస్టేట్ ఈనాం భూముల కౌలుదార్ల పోరాటాన్ని ప్రారంభించి 50 ఎకరాల భూమి పంపిణీ చేశారు. దాసరితో సహా అనేకమందిపై కేసులు పెట్టినా చివరకు జమీందారు రాజీకి వచ్చి భూమిని పేదలకు వదిలివేశారు.

తాలూకాలోని సుమారు 50కి పైగా గ్రామాలలో 25 వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఈ భూముల గుండా నాగార్జునసాగర్ నీళ్లు సైతం నేడు పారుతున్నాయి.

సీపీఐ పంచిపెట్టిన భూముల ద్వారా నేడు పేద రైతులు ఒక్కో గ్రామంలో కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు. బంజరు భూముల పోరాటం ద్వారా కమ్యూనిస్టు పార్టీ వేలాది కూలి కుటుంబాలను రైతులుగా మార్చింది.

తొలి రోజుల్లో జమీందారీ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రెండవ దశలో బంజరు భూముల పంపిణీ, అదనపు శిస్తు వ్యతిరేక సత్యాగ్రహ పోరాటం, తరువాత 1980 దశకంలో చెట్టు పట్టాల సాధనకై ఉద్యమం, 1990వ దశకంలో వన సంరక్షణ సమితులకై బంజరు పోరాటం నడిచింది.

ట్యాగ్‌లు: andhra pradesh