Skip to content
క్రైమ్ వార్తలు

Jaipur Mercedes Fire: జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో దగ్ధమైన 8 లగ్జరీ కార్లు!

jagan 23 Sep 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Jaipur Mercedes Fire: జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో దగ్ధమైన 8 లగ్జరీ కార్లు!

Jaipur Mercedes Fire

Jaipur Mercedes Fire: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో సుమారు 8 ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు విలువైన విడిభాగాలు, యాక్సెసరీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా దట్టమైన పొగలు దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 ఫైరింజన్లు రంగంలోకి దిగి రెండు గంటల పాటు నిరంతరం శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో వర్క్‌షాప్‌లో కొత్తవి, పాతవి కలిపి 50కి పైగా కార్లు ఉన్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో 8 కార్లు దగ్ధమైనప్పటికీ, పోలీసులు , ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి మిగిలిన కార్లను సురక్షితంగా బయటకు తరలించడంతో తీవ్ర పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కచ్చితమైన కారణాలను తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాలిపోయిన వాహనాలు , విడిభాగాల ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక మాల్‌లో కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరొక అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సహాయంతో అరగంటలోనే మంటలను ఆర్పివేయడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.