Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన

jagan 16 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన

Telangana Assembly Session

Telangana Assembly Sessions: తెలంగాణ శాసనసభ వేదికగా రెవెన్యూ వివాదాలు, నిషేధిత భూముల జాబితా (22A / POB), ‘ధరణి’ పోర్టల్ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. భూ సమస్యలపై ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని గణాంకాలతో సహా ఖండించారు.

ప్రస్తుత ప్రభుత్వం దాదాపు కోటి ఎకరాల ప్రైవేటు భూములను ప్రోహిబిటరీ ఆర్డర్ బుక్ (POB) లోకి చేర్చిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూనంనేని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో మొత్తం భూమి విస్తీర్ణం 2 కోట్ల 49 లక్షల 76 వేల ఎకరాలు. ఇందులో అటవీ భూములు, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, నాలా, పార్ట్-బి కింద ఉన్న భూములన్నీ కలిపి దాదాపు 90 లక్షల ఎకరాలకు పైగా ఉంటాయి. ఇవన్నీ కలిపి చూపిస్తూ, ప్రభుత్వం కోటి ఎకరాల ప్రైవేటు భూములను బ్లాక్ చేసిందనడం సత్యదూరం. వాస్తవానికి నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు భూములు కేవలం 3,73,930 ఎకరాలు మాత్రమే” అని ఆయన లెక్కలతో వివరించారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను తీవ్ర అడావుడిగా, సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. “ఒక సర్వే నంబర్ పరిధిలో 1,000 ఎకరాలు ఉండి, అందులో కేవలం 100 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే.. ధరణి సాఫ్ట్‌వేర్‌లో బై నంబర్లు (సబ్-డివిజన్లు) లేకపోవడం వల్ల మొత్తం 1,000 ఎకరాలను ఒకేసారి నిషేధిత జాబితాలో పడేశారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం ఓటమి పాలవ్వడానికి ఈ భూ సమస్యలే ప్రధాన కారణం” అని స్పష్టం చేశారు.

చరిత్రను గుర్తుచేస్తూ.. 1999లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల చట్టానికి ’22A’ నిబంధన వచ్చిందని, ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల ఆధారంగా దీనిని పూర్తిస్థాయి చట్టంగా మార్చారని కూనంనేని గుర్తుచేశారు. వివాదంలో ఉన్న 3.73 లక్షల ఎకరాల ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురావాలని ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక నిర్దిష్ట కాలపరిమితి (టైమ్ స్కేల్) విధించి, ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిషేధిత, వివాదాస్పద భూముల వివరాల జాబితాను ఆయా గ్రామాలు, వార్డుల వారీగా రికార్డు పుస్తకాల్లో ప్రదర్శిస్తే ప్రజలకు పూర్తి స్పష్టత వస్తుందని, సగం సమస్యలు వీడిపోతాయని ఆయన సూచించారు.