Vinayaka Chavithi 2026: బేగం బజార్‌లో 24 క్యారెట్ల గోల్డ్ గణపతి…ఆకట్టుకుంటున్న స్వర్ణ గణనాథుడు..
Vinayaka Chavithi 2026: హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కొలువుదీరిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో మెరిసిపోతున్న ఈ వినాయకుడి విగ్రహం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. బంగారు కాంతులతో వెలిగిపోతున్న గణనాథుడికి చేసిన అద్భుతమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Vinayaka Chavithi 2026: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కొలువుదీరిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో మెరిసిపోతున్న ఈ వినాయకుడి విగ్రహం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. బంగారు కాంతులతో వెలిగిపోతున్న గణనాథుడికి చేసిన అద్భుతమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బేగం బజార్‌లోని గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. చిన్నప్పటి నుంచే ఓల్డ్ సిటీలో గణేష్ ఉత్సవాలపై ఉన్న ఆసక్తితో ఈసారి ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఆలోచనతో గోల్డ్ ప్లేటెడ్ గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గణనాథుడి రూపకల్పన వెనుక సుమారు ఎనిమిది నెలల ప్రణాళిక, శ్రమ ఉంది. రోజుకో కొత్త ఆలోచనతో డిజైన్‌ను మెరుగుపరుస్తూ చివరకు ప్రస్తుత రూపాన్ని తీసుకొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా రూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ గణపతి విగ్రహాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు. విగ్రహం చుట్టూ వివిధ దేవతా రూపాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
దశావతారాలతో పాటు లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి
గణనాథుడి చుట్టూ దశావతారాలను కొలువుదీర్చారు. వెనుక భాగంలో దశావతారాల దర్శనం భక్తులను ఆకట్టుకుంటోంది. పైభాగంలో తిరుమల శ్రీవారి రూపం, పక్కభాగాల్లో లక్ష్మీదేవి, పార్వతీదేవి తదితర దేవతా మూర్తులను ఏర్పాటు చేశారు.
పంచలోహాలతో విగ్రహం.. అమెరికన్ డైమండ్లతో అలంకరణ
విగ్రహానికి బ్రాస్ బేస్ ఉపయోగించడంతో పాటు పంచలోహాల మిశ్రమంతో దీనిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు మరింత ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేలా జ్యువెలరీ తరహా అలంకరణ చేశారు.
నిర్వాహకులు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారంలో ఉండటంతో, ఆ రంగంలో ఉపయోగించే స్టోన్స్‌ను గణనాథుడి అలంకరణలో ఉపయోగించినట్లు చెప్పారు. విగ్రహంపై పొదిగినవి సహజ వజ్రాలు కాకుండా అమెరికన్ డైమండ్స్ అని స్పష్టం చేశారు. దీంతో గణనాథుడికి ప్రత్యేకమైన జ్యువెలరీ లుక్ వచ్చింది.
ఎనిమిది మంది నిపుణుల బృందం.. ఎనిమిది నెలల శ్రమ
ఈ గణపతి విగ్రహం తయారీలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం పనిచేసింది. క్యాడ్ డిజైనర్లు, హ్యాండ్ సెట్టింగ్ నిపుణులు, పాలిషింగ్ నిపుణులు తదితరులు ఇందులో ఉన్నారు. ఎనిమిది నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించి గణనాథుడిని సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నిమజ్జనం ఉండదు.. శాశ్వతంగా భద్రపరచనున్న విగ్రహం
సాధారణంగా వినాయక చవితి సందర్భంగా పది రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ గణపతికి నిమజ్జనం ఉండదు.
ఈ విగ్రహం శాశ్వతంగా మండపంలోనే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ఊరేగింపు నిర్వహించిన అనంతరం తిరిగి మండపానికి తీసుకువస్తామని చెప్పారు. నిమజ్జనం కోసం మరో చిన్న గణపతిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ గోల్డ్ ప్లేటెడ్ గణనాథుడి విలువను మాత్రం వెల్లడించేందుకు నిర్వాహకులు నిరాకరించారు. విగ్రహానికి ధర కట్టడం కంటే భక్తుల గుండెల్లో గణనాథుడు శాశ్వతంగా కొలువుండటమే తమకు ముఖ్యమని వారు పేర్కొన్నారు.
బంగారు కాంతులతో మెరిసిపోతూ, దశావతారాలు, వివిధ దేవతా మూర్తులు, జ్యువెలరీ తరహా అలంకరణతో ప్రత్యేకంగా దర్శనమిస్తున్న ఈ గణనాథుడిని చూసేందుకు బేగం బజార్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.